AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: హోటల్‌ ముందు అనుమానాస్పద బ్యాగ్.. భయం గుప్పిట్లో టీమిండయా ఆటగాళ్లు.. కట్‌చేస్తే..!

India vs England Second Test: భారత్, ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్ బర్మింగ్‌హామ్‌లోని చారిత్రాత్మక ఎడ్జ్‌బాస్టన్ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు, టీమ్ బర్మింగ్‌హామ్ సమీపంలో అనుమానాస్పద ప్యాకేజీ కనిపించడంతో కలకలం చెలరేగింది. ఆ తర్వాత ఆటగాళ్లను హోటల్ నుంచి బయటకు వెళ్లకుండా నిషేధించారు.

Team India: హోటల్‌ ముందు అనుమానాస్పద బ్యాగ్.. భయం గుప్పిట్లో టీమిండయా ఆటగాళ్లు.. కట్‌చేస్తే..!
Ind Vs Eng
Venkata Chari
|

Updated on: Jul 02, 2025 | 6:42 AM

Share

India vs England Second Test: ఇంగ్లాండ్‌తో జరగనున్న రెండవ టెస్ట్ మ్యాచ్‌కు ముందు టీమిండియా బస చేసిన హోటల్‌లో అనుమానాస్పద ప్యాకేజీ కలకలం సృష్టించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ ఘటనతో భద్రతా సిబ్బంది అప్రమత్తమై, హోటల్‌ను అదనపు భద్రతతో చుట్టుముట్టారు.

వివరాల్లోకి వెళితే, ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో టీమిండియా సభ్యులు బస చేస్తున్న హోటల్ ప్రాంగణంలో ఓ అనుమానాస్పద ప్యాకేజీ కనిపించింది. వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమై, ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్యాకేజీని తనిఖీ చేసేందుకు బాంబు డిస్పోజల్ స్క్వాడ్‌ను రప్పించినట్లు సమాచారం.

ఈ ఘటనతో ఆటగాళ్ల భద్రత పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ప్యాకేజీని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని, అందులో ఏముందో ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. అయినప్పటికీ, ముందస్తు జాగ్రత్త చర్యగా హోటల్ పరిసరాల్లో భద్రతను గణనీయంగా పెంచారు. ఆటగాళ్లు బయటికి వెళ్లకుండా, బయటి వ్యక్తులు లోపలికి రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నారు.

సోషల్ మీడియాలోనూ కలకలం..

మంగళవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో, బర్మింగ్‌హామ్ సిటీ సెంటర్ పోలీసులకు సెంటెనరీ స్క్వేర్‌లో అనుమానాస్పద ప్యాకేజీ గురించి సమాచారం అందింది. ఆ తర్వాత, పోలీసులు వెంటనే సెంటెనరీ స్క్వేర్, పరిసర ప్రాంతాలలో భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ మేరకు బర్మింగ్‌హామ్ సిటీ సెంటర్ పోలీసులు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో ఒక పోస్ట్‌ చేశారు. ‘మేం బర్మింగ్‌హామ్ సిటీ సెంటర్‌లోని సెంటెనరీ స్క్వేర్ చుట్టూ ఒక వలయాన్ని ఏర్పాటు చేశాం. మేం ఒక అనుమానాస్పద ప్యాకేజీని పరిశీలిస్తున్నాం. దీని గురించి మధ్యాహ్నం 3 గంటలకు ముందే మాకు సమాచారం అందింది. ముందుజాగ్రత్తగా, దీనిని పరిశీలిస్తున్న సమయంలో అనేక భవనాలను ఖాళీ చేయించాం. దయచేసి ఆ ప్రాంతానికి వెళ్లకుండా ఉండండి’ అంటూ పోస్ట్ చేసింది.

రెండో టెస్టు మ్యాచ్ జులై 2వ తేదీ నుంచి బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో ప్రారంభం కానుంది. తొలి టెస్టులో ఓటమి పాలైన టీమిండియా, ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను సమం చేయాలని పట్టుదలగా ఉంది. ఇలాంటి కీలక సమయంలో భద్రతాపరమైన సమస్య తలెత్తడం ఆందోళన కలిగిస్తోంది. అధికారులు పూర్తి స్థాయి విచారణ జరిపి, వాస్తవాలను వెల్లడించాలని అభిమానులు కోరుతున్నారు. ఈ ఘటన మ్యాచ్‌పై ఎటువంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..