Kanchi Paramacharya: నేనున్నది ఎందుకు? ఆమెకు బ్రహ్మానందం కలిగించిన స్వామివారు!
కంచి పరమాచార్య స్వామివారికి హిందూ మత గురువులలో ప్రత్యక స్థానం ఉంది. ఆయన పూర్తి పేరు శ్రీ చంద్రశేఖరవేంకటేశ్వర సరస్వతి స్వామివారు. హిందూ ధర్మంలో అత్యంత ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రం కంచి కామకోటి పీఠం యొక్క 68వ శంకరాచార్యగా ప్రసిద్ధి చెందారు. ఆయన జీవితకాలం అనంతరం కూడా ఆయన ఆశయాలు, బోధనలు అనేకమంది ప్రజలకు మార్గదర్శకంగా కొనసాగుతున్నాయి.

కంచి పరమాచార్య స్వామివారికి హిందూ మత గురువులలో ప్రత్యక స్థానం ఉంది. ఆయన పూర్తి పేరు శ్రీ చంద్రశేఖరవేంకటేశ్వర సరస్వతి స్వామివారు (Jagadguru Sri Chandrasekharendra Saraswati Swami). హిందూ ధర్మంలో అత్యంత ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రం కంచి కామకోటి పీఠం (Sri Kanchi Kamakoti Peetham) యొక్క 68వ శంకరాచార్య (Jagadguru Shankaracharya)గా ప్రసిద్ధి చెందారు. ఆయన జీవితకాలం అనంతరం కూడా ఆయన ఆశయాలు, బోధనలు అనేకమంది ప్రజలకు మార్గదర్శకంగా కొనసాగుతున్నాయి.
కంచి పరమాచార్య స్వామివారు మాంబలంలో ఉన్న సమయంలో జరిగిన ఒక సంఘటన గురించి తెలుసుకుందాం. ఆరోజు రాత్రి పన్నెండు గంటలవరకూ గోష్ఠి జరుగుతూనే ఉన్నది. అగ్నిహోత్రం రామానుజ తాతాచారి గారితో కలిసి అలా వేకువజామున ముగిసింది. స్వామి గోష్ఠి ముగించి దండం, కమండలం తీసుకొని బయలుదేరారు.
దారిలో ఒక స్త్రీ ఒక యువతినీ, చంటి పిల్లనూ తీసుకొని గబగబా ముందుకు వచ్చింది. రాత్రంతా నిద్రలేక కాలాతీతమైవుంటే, ఇప్పుడు కూడా దర్శనాలా అని తాతాచారిగారికి చికాకు వేసింది. ‘స్వాములవారికి విశ్రాంతి అక్కరలేదా?’ అని ఆయన కాస్త కసిరారు. అయితే ఆవిడ ఆమాట వినిపించుకోలేదు. తమ కుమార్తె ఎక్స్ ప్రెస్ బండిలో వెళ్తున్నందున స్వామి ఆశీస్సులకై వచ్చానని ఆవిడ అన్నది.
తాతాచారి కోపం, ఆవిడ తన పని తాను కానియ్యడం.. స్వామివారు గమనిస్తూనే ఉన్నారు. తాతాచారిగారిని కొంచం ప్రసాదం పట్టుకొని రమ్మని పంపారు.
ఆ తర్వాత స్వాములవారు ఆరావిడ చెప్పేదంతా విన్నారు. ప్రశాంతంగా ఆశీర్వదించి ప్రసాదం ఇచ్చారు. ఆమె బ్రహ్మానందంతో మరలి పోయింది.
ఆమె వెళ్ళిన తరువాత స్వామి ఇలా అన్నారు.
భగవంతుని ముందు తమ తమ బాధలను చెప్పుకుంటే బాధానివృత్తి అవుతుందని ప్రజలలో నమ్మకం ఉంది. కానీ, ప్రజలకు దేవుడు కన్పించడు కదా! నాలో ఆయనను చూచుకొని, ఆ నమ్మకంతోనే అమాయకంగా వీళ్ళు నా దగ్గరకు వచ్చి దేవునితో చెప్పుకున్నట్లు.. నాముందు తమ గోడు వెళ్ళబోసు కుంటున్నారు. తృప్తితో వెళుతున్నారు. వారి నమ్మకాన్ని నేనెందుకు చెడగొట్టాలి? నేను ఉన్నది దేనికి? ప్రజలు తమగోడు చెప్పుకుంటే వినటానికేగదా! దానివలన ఈ శరీరానికి శ్రమ కలిగితే కలగనీ గాక, ఏమీ కొదవలేదు. నాకు ప్రజలు నమస్కరిస్తున్నారు, నన్ను భగవంతునిగా భావించి నాతో తమ బాధలు విన్నవించుకుంటున్నారు. దానిలో గొప్పయేమీ లేదు. ప్రజలలో ఈ మాత్రమైనా భగవచ్చింతన మిగిలింది అని నాకు సంతోషం. కనుక ఈ పనికి ఎవరూ అడ్డు రాకుండా ఉండటం మంచిది అని స్వామివారు హితబోధ చేశారు. (శ్రీ కంచి పరమాచార్య పథం” పుస్తకం నుంచి సేకరించిన సమాచారం)
