AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నటరాజ స్వామి పాదాల కింద ఉన్న ఆ రాక్షసుడు ఎవరు? మీకు తెలియని అసలు నిజాలు..

పరమశివుడు ధరించిన నటరాజ స్వరూపం వెనుక ఉన్న అసలైన రహస్యం ఏంటో మీకు తెలుసా? శివుని పాదాల కింద పడుకుని ఉండే ఆ మరుగుజ్జు రాక్షసుడు కేవలం ఒక కథ మాత్రమే కాదు.. మనలో ఉండే ఒక పెద్ద శత్రువుకు సంకేతం. ఇతర రాక్షసులను సంహరించినట్లే ఈ రాక్షసుడిని శివుడు ఎందుకు చంపలేదు? కేవలం పాదం కింద ఎందుకు అణచి ఉంచాడు? అనే విషయాలు తెలుసుకుందాం..

నటరాజ స్వామి పాదాల కింద ఉన్న ఆ రాక్షసుడు ఎవరు? మీకు తెలియని అసలు నిజాలు..
Lord Nataraja Apasmara Mystery
Krishna S
|

Updated on: Aug 09, 2026 | 10:28 PM

Share

పరమశివుడు అనగానే మనకు వెంటనే గుర్తుకువచ్చే అత్యంత అద్భుతమైన, మనోహరమైన రూపాలలో నటరాజ స్వరూపం ఒకటి. విశ్వ నాట్య చక్రవర్తి అయిన పరమేశ్వరుడు చేసే ఆనంద తాండవం సృష్టి, స్థితి, లయ, తిరోధానం, అనుగ్రహం అనే పంచకృత్యాలకు ప్రతీకగా నిలుస్తుంది. అయితే నటరాజ స్వామి విగ్రహాన్ని లేదా చిత్రాన్ని జాగ్రత్తగా గమనిస్తే.. ఆయన కుడిపాదం కింద ఒక మరుగుజ్జు రాక్షసుడు పడుకుని ఉన్నట్లు కనిపిస్తుంది. అసలు ఆ రాక్షసుడు ఎవరు? ఆయన నటరాజుని పాదాల కింద ఎందుకు నలిగిపోతున్నాడు? అనే డౌట్ చాలా మంది వస్తుంది.

పురాణ గాథ: అపస్మారుని పుట్టుక

సనాతన ధర్మ పురాణాల ప్రకారం.. ఈ రాక్షసుడి పేరు అపస్మారుడు. ఈయనను జ్ఞాన శూన్యత, అజ్ఞానం, అహంకారం, మతిమరుపుకు ప్రతీకగా చెబుతారు. ఒకానొక సమయంలో దారుకావనంలో ఉండే మునులు తమ శక్తులు, యజ్ఞ యాగాలు, తపోబలంతో తామే గొప్పవారమని, ఈశ్వరుడి కంటే తమే అధికులమని తీవ్రమైన అహంకారానికి లోనవుతారు. వారి అహంకారాన్ని, అజ్ఞానాన్ని తుంచేందుకు పరమశివుడు ఒక అందమైన భిక్షాటక రూపంలో అక్కడికి వెళ్తారు. మునులు తమ మంత్ర బలంతో ఒక తీవ్రమైన అభిచార హోమం చేసి, అందులో నుండి భయంకరమైన పులిని, పాములను, అలాగే అపస్మారుడు అనే మరుగుజ్జు రాక్షసుడిని సృష్టించి శివునిపైకి ప్రయోగిస్తారు. శివుడు పులి చర్మాన్ని ధరించి, పాములను ఆభరణాలుగా చేసుకుని, అజ్ఞానానికి ప్రతీక అయిన ఆ అపస్మారుడిని తన కుడిపాదం కింద తొక్కిపట్టి ఆనంద తాండవం చేస్తారు.

ఈ రూపం వెనుక ఉన్న లోతైన ఆధ్యాత్మిక అంతరార్థం

నటరాజ స్వరూపం కేవలం ఒక శిల్పం లేదా నాట్య భంగిమ మాత్రమే కాదు. ఇందులో ప్రతి అంశానికి ఒక విశిష్టమైన పరమార్థం ఉంది.

అపస్మారుడు: అపస్మారుడు అంటే కేవలం ఒక రాక్షసుడు మాత్రమే కాదు. మనలో ఉండే అజ్ఞానం, అహంకారం, మాయ, మతిమరుపు, చెడు ఆలోచనలకు సంకేతం.

పాదంతో తొక్కడం: నటరాజుడు తన కుడిపాదాన్ని అపస్మారుని వీపుపై ఉంచి తొక్కడం అంటే… భగవంతుడు మానవులలోని అజ్ఞానాన్ని, అహంకారాన్ని తన జ్ఞానంతో అణచివేస్తున్నాడని అర్థం.

ఎత్తిన ఎడమ పాదం: ఆ పక్కనే పైకి ఎత్తి ఉన్న ఎడమ పాదం ముక్తికి లేదా శరణాగతికి సంకేతం. అజ్ఞానాన్ని అణచివేసినప్పుడే జీవుడికి ముక్తి మార్గం సుగమమవుతుందని ఇది సూచిస్తుంది.

అభయ హస్తం: నటరాజుని ఒక చేయి అభయ హస్తంగా ఉండి.. ‘‘నన్ను శరణు వేడిన భక్తులకు అజ్ఞానం నుండి విముక్తి కలిగిస్తాను’’ అని అభయాన్ని ఇస్తుంది.

చేతిలో అగ్ని – డమరుకం: ఒక చేతిలోని డమరుకం సృష్టి ఆవిర్భావ నాదానికి, మరొక చేతిలోని అగ్ని ప్రళయానికి, సృష్టి లయకు ప్రతీకలు.

అపస్మారుడిని శివుడు పూర్తిగా ఎందుకు సంహరించలేదు?

మహిషాసురుడిని దుర్గమ్మ, నరకాసురుడిని కృష్ణుడు సంహరించినట్లుగా… శివుడు అపస్మారుడిని సంహరించకుండా కేవలం తన పాదం కింద నొక్కి ఎందుకు ఉంచాడు? అనే సందేహం చాలామందికి వస్తుంది. దీనికి ఒక గొప్ప తత్వశాస్త్ర కారణం ఉంది. సృష్టి చక్రం నడవడానికి జ్ఞానంతో పాటు అజ్ఞానం కూడా సృష్టిలో ఒక భాగంగా ఉంటుంది. అజ్ఞానాన్ని సంపూర్ణంగా నాశనం చేస్తే, సృష్టి సమతుల్యత దెబ్బతింటుంది. విద్య విలువ తెలియాలంటే అవిద్య ఉండాలి, వెలుగు విలువ తెలియాలంటే చీకటి ఉండాలి. అందుకే శివుడు అపస్మారుడిని సంహరించకుండా అతడిని తన నిరంతర నియంత్రణలో ఉంచాడు.

మానవాళికి ఈ కథ ఇచ్చే సందేశం

మనలో కూడా అహంకారం, అజ్ఞానం అనే అపస్మారుడు ఎల్లప్పుడూ ఉంటాడు. దాన్ని పూర్తిగా తుడిచిపెట్టలేకపోయినా, శివుని జ్ఞానమనే పాదం కింద ఎల్లప్పుడూ నియంత్రణలో ఉంచుకోవాలి. అప్పుడే మనిషి అహంకారాన్ని జయించి ప్రశాంతతను, ముక్తిని సాధించగలడు.

Follow Us