కార్తీకమాసంలో దీపం ఏ సమయంలో వెలిగిస్తే మంచిది.? పాటించాల్సిన నియమాలు ఏంటి.!
కార్తీక మాసం మహాశివునికి అత్యంత ప్రీతికరమైన మాసం. శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మారుమోగుతాయి. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచిన భక్తులు పుణ్య నదులలో స్నానాలు చేసి దీపాలు వెలిగిస్తారు. అసలు దీపాలు ఏవిధంగా వెలిగించాలి. ఏ సమయంలో వెలిగించాలి. ఏ నూనెను ఉపయోగించాలి. ఆ వివరాలు ఇలా..

కార్తీక మాసంలో దీపం ఏవిధంగా వెలిగించాలి, ఏసమయంలో వెలిగించాలి, దీపం వెలిగించే సమయంలో పాటించాల్సిన నియమాలను పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని పంచారామక్షేత్రం శ్రీఉమాసోమేశ్వర జనార్దనస్వామి ఆలయ అభిషేక్ పండిట్ కొత్తపల్లి వెంకట సత్య సుబ్రహ్మణ్యం వివరించారు. కృత్రికా నక్షత్రంతో కూడిన పౌర్ణమి వచ్చే నెలను కార్తీక మాసం అంటారు. కృత్తికా నక్షత్రం కుమారస్వామి జన్మ నక్షత్రం. అజ్ఞానాన్ని పోగొట్టేది దీపం. కృత్రిక అగ్ని సంబంధం కాబట్టి కార్తీకదీపం అని పేరు వచ్చింది.
“దీపం జ్యోతి పరంబ్రహ్మ దీపేన సాధ్యతే సర్వం” జ్యోతి పరబ్రహ్మ స్వరూపం పరమాత్మ జ్యోతి స్వరూపుడు. దీపారాధన వల్ల మనలోని అజ్ఞానాన్ని ప్రారదోలి ఆత్మని చైతన్యం చేయడం జరుగుతుంది. ఇంత విశేషం కలిగిన దీపాన్ని వెలిగించేప్పుడు మనస్సు, శరీరం నిశ్చలంగా ఉండాలి. తెల్లవారక ముందే స్నానం చేసి ఉదయం 5 నుండి 6 : 30 నిమిషాల మద్యలో దీపం వెలిగించాలి. ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే సర్వ శ్రేయస్కరం. నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే శని దోషం పరిష్కారం కలిగి శత్రువినాశనం జరుగుతుంది. ఆముదం నూనెతో దీపం వెలిగిస్తే శత్రువినాశనం జరుగుతుంది. ఈ విధంగా కాకుండా వేరే ఏ విధమైన నూనెలు ఉపయోగించి దీపం పెట్టినా ఫలితం ఉండదు.
హిందూ సంప్రదాయంలో ప్రతి వ్యక్తి ప్రతిరోజు ఉదయాన్నే దీపారాధన చేయాలి. అలా చేయడం కుదరదు కాబట్టి కార్తీక మాసంలో 365 వత్తులతో దీపాన్ని వెలిగిస్తారు. ఈ దీపాన్ని సాయంకాల సమయంలో వెలిగించాలి. సంవత్సరానికి 365 రోజులు లెక్కగా 365 ఒత్తులతో ఒక దీపాన్ని వెలిగిస్తారు. కార్తీక పాడ్యమి మొదలు బహుళ అమావాస్య వరకు ఏ రోజు దీపం వెలిగించినా అది కార్తీకదీపమే అవుతుంది. కార్తీకదీపం పెట్టడం వల్ల దీపం కాంతి ప్రసరించిన ప్రాంతమంతా ప్రకృతి, పశుపక్ష్యాదులు, పాడి పంటలతో, సిరిసంపదలతో విరాజిల్లుతుంది.




