Karkateshwara Temple: ఎండ్రకాయ రూపంలో దర్శనం ఇచ్చే శివుడు.. ఎక్కడో తెలుసా?
నల్లమల అటవీప్రాంతంలో అత్యంత మహిమాన్వితమైన శైవక్షేత్రం, కార్తీకమాసంలో తప్పక దర్శించుకోవలసిన పుణ్యక్షేత్రం ఒకటి ఉంది. అదే కడప జిల్లాలోని గుండాలకోన. ప్రకృతి సోయగాలు, ఎత్తైన కొండలు లోతైన జలపాతాలకు నెలవైన ఈ ప్రదేశం కేవలం అందానికి మాత్రమే కాదు, ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యానికి నిలయం. ఇక్కడ గుండాలఈశ్వరుడు సాక్షాత్తూ ఎండ్రకాయ (కర్కాటకం) రూపంలో ప్రత్యక్షంగా దర్శనం ఇస్తాడని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు.

ఆంధ్రప్రదేశ్, కడప జిల్లా, చిట్వేలి మండలంలోని ప్రసిద్ధ శైవక్షేత్రమే గుండాలకోన. విశ్వామిత్రుడు ప్రతిష్ఠించిన గుండాలేశ్వరస్వామి ఆలయ ప్రాంతంగా ఇది ప్రసిద్ధి చెందింది. గుండాలకోనలో గుండం పక్కనే ఒక గుహ ఉంది. ఈ గుహలోనే గుండాల ఈశ్వరుడు ఎండ్రకాయ (కర్కాటకం) రూపంలో భక్తులకు దర్శనం ఇస్తాడు. ఈ కర్కాటకం ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క సైజులో కూడా కనిపిస్తూ కోరిన వారి కోర్కెలు తీరుస్తాడు.
కోరికలు నెరవేర్చే విధానం: గుహ ద్వారంలో భక్తులు పూజలు పండ్లను ఉంచుతారు. వాటిని ఎండ్రకాయ లోనికి తీసుకుపోతే తమ కోర్కెలు నెరవేరినట్లుగా భక్తులు భావిస్తారు. ఈ కర్కాటకం రూపంలో ఆ పరమేశ్వరుడు ఎన్నో సంవత్సరాల నుండి అక్కడ ఉండటం ఒక పెద్ద విశేషం.
మాఘ వాయిద్యాలు: ఒక సందర్భంలో తుంగా రాఘవయ్య మరికొందరు భక్తులు కలసి ఈ ప్రదేశంలో రాత్రుళ్ళు నిద్ర చేయగా తెల్లవారు జామున స్వామివారి పుట్ట దగ్గర నుంచి మంగళ వాయిద్యాలు వినిపించాయని అంటారు.
దర్శన సమయం: పార్వతీపరమేశ్వరుల నిలయమైన గుండాలకోన ను కార్తీక మాసంలోని సోమవారాల్లో అధిక సంఖ్యలో దర్శించుకుంటారు. ప్రత్యేకించి 3వ సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.
స్థల పురాణం
స్థల పురాణం ప్రకారం, శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాముల వారి మనుమరాలైన శ్రీ ఈశ్వరమ్మను వివాహం చేసుకోగోరి నిరాకరణకు గురైన రంగరాజు (నగరిపాడు రంగనాయకుల స్వామి) కొంతకాలం ఈ గుండాలకోనలోనే తపస్సు చేశారు. అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై ఎండ్రకాయ రూపంలో భక్తులకు దర్శనమిస్తానని చెప్పాడని చెబుతారు.
ఏడు గుండాల ప్రత్యేకత
గుండాలకోన చిట్వేలి మండలం వెంకటరాజు పల్లి, పెద్దూరు, అనుంపల్లె గ్రామాల నుంచి దాదాపు 9 కిమీ దూరంలో రిజర్వు ఫారెస్టులో దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో ఉంది. వెంకటగిరి కొండల మీదుగా ఇక్కడ ఏడు గుండాలు ఉన్నాయి.
స్నాన మహిమ: ఈ గుండంలో మునిగితే సర్వపాపాలు తొలగిపోతాయని, దెయ్యాలు వదులుతాయని, సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఒక్కసారి గుండాలలో స్నానమాచరిస్తే అప్పటి వరకు ఉన్న బడలిక మటుమాయమవుతుందని వైద్యులు సైతం అంటున్నారు.
వర్ణాల మార్పు: గుండాలకోన సెలయేరు పైభాగాన ఉన్న ఈ గుండాలు చదును గుండం, బూడిద గుండం, సమారాధన గుండం, పసుపు గుండం, గిన్ని గుండం, అక్కదేవతల గుండం, స్నాన గుండం. గిన్ని గుండంలోని నీరు పసుపు గుండంలోకి మారగానే పసుపు రంగులోకి మారుతుంది. ఆ తర్వాత మరో గుండంలో పడగానే బూడిద రంగుగా మారుతుంది. చివరిగా ఈ నీరు సమారాధన గుండంలోకి చేరుతుంది.
ప్రయాణ సూచన:
స్వామిని దర్శించుకోవాలంటే ఎన్నో ప్రయాసాలకోర్చి భక్తులు 9 కిలోమీటర్లు అడవి బాటలో వెళ్లాలి. దట్టమైన అడవుల్లో దారి తప్పి క్రూరజంతువులకు బలైన సంఘటనలు కూడా జరిగాయి. అందుకే అటవీ అధికారుల అనుమతి సహాయంతో ప్రయాణం సాగించడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు.
శతాబ్దాలుగా ఇక్కడ మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతుంటాయి. భక్తుల రద్దీ పెరిగాక ఆర్టీసీ అధికారులు ఆ ఒక్క రోజు మాత్రం రైల్వేకోడూరు నుంచి వై.కోట మీదుగా గుండాలకోనకు బస్సులు నడుపుతున్నారు.




