Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కృష్ణాష్టమి, వినాయక చవితి పండుగలు అసలెప్పుడు.? అదే గందరగోళం.. ఒక్కో రాష్ట్రంలో.. ఒక్కో రోజు సెలవు..

రెండు పండగలు నాలుగు తేదీలు.. కాదుకాదు మూడు పండగలు ఆరు తేదీలు.. పౌర్ణమి ఘడియలు ఎప్పుడో తెలీక... గతనెల 30, 31 తేదీల మధ్య చక్కర్లు కొట్టింది రాఖీ పండగ. ఆ రాఖీ పండగను ఎలాగోలా కానిచ్చేశాం... ఇప్పుడు కృష్ణాష్టమి, రేపటి రోజున గణేశ్ చతుర్థి.. ఈ రెండు పండగల మీద పెద్ద కన్‌ఫ్యూజనే నడుస్తోందిప్పుడు.

కృష్ణాష్టమి, వినాయక చవితి పండుగలు అసలెప్పుడు.? అదే గందరగోళం.. ఒక్కో రాష్ట్రంలో.. ఒక్కో రోజు సెలవు..
Krishna Ashtami, Vinayaka Chavati
Follow us
Ravi Kiran

| Edited By: TV9 Telugu

Updated on: Sep 11, 2023 | 4:48 PM

రెండు పండగలు నాలుగు తేదీలు.. కాదుకాదు మూడు పండగలు ఆరు తేదీలు.. పౌర్ణమి ఘడియలు ఎప్పుడో తెలీక… గతనెల 30, 31 తేదీల మధ్య చక్కర్లు కొట్టింది రాఖీ పండగ. ఆ రాఖీ పండగను ఎలాగోలా కానిచ్చేశాం… ఇప్పుడు కృష్ణాష్టమి, రేపటి రోజున గణేశ్ చతుర్థి.. ఈ రెండు పండగల మీద పెద్ద కన్‌ఫ్యూజనే నడుస్తోందిప్పుడు. హిందూ క్యాలెండర్ ప్రకారం జన్మాష్టమి భాద్రపద మాసంలో కృష్ణపక్షం ఎనిమిదో రోజున జరుపుకుంటారు. ఈసారి మాత్రం కృష్ణాష్టమి 6, 7 తేదీల్లో రెండు రోజులపాటు జరుపుకోవాల్సి వచ్చింది. సెప్టెంబర్ ఆరు మధ్యాహ్నం ౩ గంటల 37 నిమిషాలకు అష్టమి తిధి మొదలౌతుంది. సెప్టెంబర్ 7 సాయంత్రం 4 గంటలా 14 నిమిషాలకు ముగుస్తుంది. అందుకే… కొందరు సెప్టెంబర్ 6న, మరికొందరు సెప్టెంబర్ 7న జరుపుకుంటున్నారు.

ఈ ఏడాది వినాయక చవితి పండుగ తేదీ కూడా సందిగ్ధంలోనే పడింది. చవితి ఘడియలు ఎప్పుడన్న గందరగోళమే ఎటుచూసినా. ఆదిదేవుడి పండగను ఈనెల 18న జరుపుకోవాలా..? 19న జరుపుకోవాలా అనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏటా చవితి పండగను భాద్రపద శుక్ల చతుర్థి నాడు జరుపుకుంటారు. ఈసారి 18వ తేదీ ఉదయం 9 గంటల 58 నిమిషాలకు చవితి ప్రారంభమై 19వ తేదీ ఉదయం 10 గంటలా 28 నిమిషాలకు ముగుస్తుంది. ఈ లెక్కన చతుర్థశి 18, 19 రెండురోజులూ ఉంటుంది. దీంతో చవితి పండగ ఏరోజు జరుపుకోవాలన్న సందేహం అందరినీ వేధిస్తోంది.

ఈ సందిగ్ధతకు ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది విద్వత్‌సభ. 18వ తేదీనే చవితిని జరుపుకోవాలని, అదేరోజు నవరాత్రులు ప్రారంభించాలని సూచించింది. వర్గల్ విద్యాసరస్వతి క్షేత్రంలో నెలరోజుల కిందటే 100 మంది సిద్ధాంతులతో చర్చించి వినాయక చవితి తేదీపై నిర్ణయం తీసుకుంది విద్వత్ సభ. ఇదే విషయాన్ని తెలంగాణా ప్రభుత్వానికి నివేదించింది. గవర్నమెంట్ సెలవుల జాబితాలో ఇప్పటికే 18వ తేదీని అఫీషియల్ హాలిడేగా ప్రకటించేసింది.

భాగ్యనగర ఉత్సవ సమితి మాత్రం 19వ తేదీనే నవరాత్రులు మొదలుపెట్టేందుకు సన్నద్ధం అవుతోంది. చవితి సహిత సూర్యోదయం ఏ రోజు ఉంటే అదేరోజు వినాయక చవితి అనేది గణేష్ ఉత్సవ సమితి వాదన. మంత్రి తలసాని అధ్యక్షతన సమావేశమైన ఉత్సవ కమిటీ తాము 19వ తేదీకే కట్టుబడి ఉన్నట్టు తేల్చేసింది. అటు.. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయం వైఖరి మరోలా ఉంది. 18వ తేదీనే చవితి పండగని తేల్చేసింది. 18వ తేదీ నుండి 21 రోజుల పాటు కాణిపాకంలో బ్రహ్మోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరి… ఎవరి లెక్క ప్రామాణికం.. ఏ తేదీని చవితి పండగ జరుపుకోవాలి… ? మరో పదిరోజుల్లో పండగొచ్చేస్తుంటే… ఈ సస్పెన్స్‌కి తెరపడేదెప్పుడో మరి.