సంఖ్యాశాస్త్రం అసలేం చెబుతోంది..? సంఖ్యలతో మన జీవితానికి లింకేంటి.?

ప్రపంచం సాంకేతిక పరిజ్ఞానంలో ముందుకు దూసుకుపోతున్నందువల్ల ఐటీ రంగానికి ఎంతగానో ప్రాధాన్యం, ప్రాముఖ్యం పెరిగింది.

సంఖ్యాశాస్త్రం అసలేం చెబుతోంది..? సంఖ్యలతో మన జీవితానికి లింకేంటి.?
Numerology Colors
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Ravi Kiran

Updated on: Jan 31, 2023 | 9:00 AM

ప్రపంచం సాంకేతిక పరిజ్ఞానంలో ముందుకు దూసుకుపోతున్నందువల్ల ఐటీ రంగానికి ఎంతగానో ప్రాధాన్యం, ప్రాముఖ్యం పెరిగింది. లక్షల మంది యువతీ యువకులు కంప్యూటర్ విజ్ఞానంలో పోటా పోటీగా ముందుకు వెళుతూ, దేశ విదేశాల్లో చక్కని ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు. కొత్త కొత్త ఆవిష్కరణలతో కనివిని ఎరుగని గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అమెరికా తదితర దేశాల్లో భారతీయ ఐటీ నిపుణులు భారీ జీతభత్యాలతో ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు. అయితే, ఆర్థిక మాంద్యం వంటి కారణాలవల్ల విదేశాల్లో ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి కూడా ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం ఐటీ నిపుణులకు విదేశీ ఉద్యోగాలు, ఆవిష్కరణలు, స్టార్టప్ కంపెనీలు తదితర విషయాల్లో జీవితం ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికర విషయం. సంఖ్యాశాస్త్రం ప్రకారం ఐటి నిపుణుల జీవితాలను ఇక్కడ చర్చించడం జరుగుతుంది.

సంఖ్యా శాస్త్రానికి సంబంధించినంతవరకు ఈ ఏడాది 3, 5, 9 సంఖ్యలవారికి విపరీత రాజయోగం పట్టే అవకాశం ఉంది. పుట్టిన తేదీని కూడటం వల్ల వచ్చే సింగిల్ డిజిట్ సంఖ్యను బట్టి వారి ఐటి జీవితాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. ఈ 3,5,9 సంఖ్యలవారికి విదేశాలలో భారీ జీత భత్యాలతో ఉద్యోగాలు లభించడమే కాకుండా, వీరు కొత్త ఆవిష్కరణలతో అంటే ఇన్వెన్షన్ లతో మంచి గుర్తింపు తెచ్చుకునే అవకాశం కూడా ఉంది. ఈ సంఖ్యల కు సంబంధించి ఇప్పటికే చాలామందికి మంచి ఉద్యోగాలు లభించి ఉంటాయి. ఇందులో 3 సంఖ్యకు గురు గ్రహం అధిపతి కాగా, ఐదవ సంఖ్యకు బుధ గ్రహం, 9 కి కుజ గ్రహం అధిపతి. ఇందులో 5, 9 సంఖ్యలు సాంకేతిక నైపుణ్యాన్ని సూచిస్తాయి. ఇక గురు గ్రహం అన్ని విద్యలకు కారకుడు.

ఇప్పటికే ఐటి ఉద్యోగాలలో ఉన్నవారికి అనేక అవకాశాలు కలిసి వస్తాయి. ఫిబ్రవరి నుంచి వీరికి తప్పనిసరిగా విదేశీయాన యోగం ఉంది. వీరు ఈ ఏడాది తప్పకుండా సరికొత్త యాప్ లను సృష్టించడం, కష్టతరమైన ప్రాజెక్టులను చేపట్టడం, కొత్త టెక్నాలజీలకు రూపకల్పన చేయడం వంటివి జరుగుతాయి. వీరి జీవితాలలో ఈ ఏడాది అనేక శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. జీవితాలు చిత్ర విచిత్రమైన మలుపులు తిరుగుతాయి. వీరి మనసులోని అనేక కోరికలు, ఆకాంక్షలు నెరవేరుతాయి. మే నెల నుంచి వీరి కెరీర్ అసాధారణంగా, అనూహ్యంగా పురోగతి చెందుతుంది.

ఈ మూడు సంఖ్యల తరువాత ప్రాధాన్యం సంతరించుకున్న సంఖ్యలు 4, 6. ఇందులో నాలుగో నెంబర్ రాహువు కు, ఆరవ నెంబర్ శుక్రుడికి సంబంధించినవి. సాధారణంగా శుక్ర, రాహువులు టెక్నాలజీ పరంగా విదేశాలలో ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంటుంది. అయితే, ఈ రెండు సంఖ్యల వారు ఈ ఏడాది అక్టోబర్ తర్వాతే అందలాలు ఎక్కే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ సంఖ్యలవారికి స్వదేశంలో మంచి కంపెనీలలోనే ఉద్యోగాలు ఉన్నప్పటికీ అక్టోబర్ తర్వాత వీరు విదేశాలకు వెళ్లి స్థిరపడే అవకాశం ఉంది. సాధారణంగా ఈ సంఖ్యల వారిలో సృజనాత్మక శక్తి ఎక్కువగా ఉంటుంది. వీరు తమకు ఉన్న విజ్ఞానంతో సంతృప్తి పడరు. కొత్త టెక్నాలజీలు కనిపెట్టడానికి తాపత్రయపడతారు. వీరు తమ రంగంలో తప్పకుండా తమదైన ముద్ర వేస్తారు.

ఇక 1, 2,7, 8 సంఖ్యలవారు స్వదేశంలోనే మంచి కంపెనీలలో ఉద్యోగాలు సంపాదించుకునే సూచనలు ఉన్నాయి. సాధారణంగా వీరిలో చొరవ ఎక్కువగా ఉంటుంది. ఏదో ఒకటి కొత్తగా సృష్టించాలన్న ఆరాటం ఉంటుంది. అయితే, వీరు విదేశాలలో కన్నా స్వదేశంలోనే రాణించే అవకాశం ఉంది. ఈ ఏడాదికి విదేశాలలో ఉద్యోగాలు సంపాదించడం కానీ, విదేశాలలో స్థిరపడటం కానీ జరిగే అవకాశాలు చాలా తక్కువ. ఇందులో ఒకటవ సంఖ్యకు అధిపతి రవి. రెండవ సంఖ్యకు చంద్రుడు అధిపతి. ఏడవ సంఖ్యకు కేతువు, ఎనిమిదవ సంఖ్యకు శని అధిపతులు. సాధారణంగా ఈ గ్రహాలకు స్వదేశం మీద, పుట్టిన గడ్డ మీద అభిమానం ఎక్కువ. ఈ సంఖ్యలకు సంబంధించి ఇందులో ఎక్కువ మంది విదేశాలకు వెళ్లడానికి ఇష్టపడకపోవచ్చు. మంచి కంపెనీలో వీరు అతి త్వరగా నాయకులు లేదా సారధులు అయ్యే అవకాశం ఉంది.