Vinayaka Chavithi: లంబోదరుడి రూపాలు ఎన్నో… వినాయకుడి రూపం వెనుక ఉన్న తాత్వికత ఏంటీ..!
Ganesh Chathurthi: మనస్సు పెట్టి కోరుకోవాలేగానీ.. కోరినవన్నీ ఇస్తాడు వినాయకుడు.. సమస్తం వినాయకుడి ఆధీనంలోనే ఉంటాయి. ఆయన ఇవ్వలేనిది లేనేలేదు.. ఆయన ప్రభ కోటి సూర్యలకు సమమైంది..
Ganesh Chaturthi: మనస్సు పెట్టి కోరుకోవాలేగానీ.. కోరినవన్నీ ఇస్తాడు వినాయకుడు.. సమస్తం వినాయకుడి ఆధీనంలోనే ఉంటాయి కాబట్టి ఆయన ఇవ్వలేనిది లేనేలేదు…ఆయన ప్రభ కోటి సూర్యలకు సమమైంది.. అసలు ఈ చరాచర సృష్టిలో వినాయకుడికి సాధ్యం కానిదంటూ ఏదీ లేదు.. ఆ ఏకదంతుడు ఎన్నో రూపాలలో ఆయన పూజలందుకుంటున్నాడు.. ఒక్కో రూపంలో ఒక్కో మహిమను చూపుతాడా విఘ్నేశ్వరుడు..
లంబోదరుడి రూపాలు ఎన్నో… ఆయనకు ముప్ఫైరెండు రూపాలున్నాయని శాస్త్రాలు చెపుతున్నాయి. ఆ ముప్ఫైరెండింటిలో కూడా పదహారు రూపాలలో ఉండే వినాయకులను ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఒక్కొక్క రూపంలో ఉండే వినాయకుడిని పూజిస్తే ఒక్కో కోరిక తీరుతుందని, ఒక్కోరకం శుభం కలుగుతుందని పెద్దలు చెబుతుంటారు. ముద్గల పురాణంలో వినాయకుడికి సంబంధించిన పదహారు రూపాలను గురించి ప్రత్యేకంగా వివరణ కనిపిస్తుంది. బాలవిఘ్నేశుడు, తరుణ విఘ్నేశుడు, భక్త, వీర, శక్తి, ద్విజ, పింగలం, ఉచ్చిష్ట, విఘ్నరాజం, క్షిప్ర, హేరంబం, లక్ష్మీవిఘ్నేశ, మహావిఘ్నం, భువనేశం, నృత్త, ఊర్ధ్వ గణపతి అనే పదహారు రకాల గణపతుల రూపాలను గురించి ముద్గల పురాణం వివరిస్తోంది.
బాలగణపతిని పూజిస్తే బుద్ధివికాసంతోపాటు ప్రతి విషయాన్ని శ్రద్ధతో పరిశీలించే శక్తి అబ్బుతుంది. తరుణగణపతిని పూజిస్తే చేపట్టిన కార్యాన్ని ఎట్టిపరిస్థితుల్లోను సాధించి తీరాలనే పట్టుదల కలుగుతుంది. భక్తవిఘ్నేశుడిని పూజిస్తే భక్తిభావం పెరుగుతుంది. వీర విఘ్నేశుడ్ని పూజించినవారికి మంచి ధైర్యం వస్తుంది. శక్తి విఘ్నేశ్వరుడిని పూజిస్తే ఆత్మస్త్థెర్యం కలుగుతుంది. ద్విజ లేక ధ్వజగణపతిని పూజిస్తే సొంతంగా ఆలోచించగల శక్తి పెరుగుతుంది. సిద్ధివినాయకుడిని పూజిస్తే అన్నిటా విజయమే లభిస్తుంది. సిద్ధి, బుద్ధి అనే భార్యలను కలిగివుండి తన తొండంతో నువ్వులద్దిన ఉండ్రాళ్ళను తింటున్నట్లుగా ఈ సిద్ధివినాయకుడు ఉంటాడు.
ఉచ్చిష్ట గణపతిని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. అయితే ఈ గణపతి దగ్గర కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈయనకు చేసే పూజలో ఏమాత్రం శ్రద్ధలేకపోయినా కోరికలు తీరడం అటుంచి ఇబ్బందులు తలెత్తుతాయని పెద్దలు హెచ్చరిస్తున్నారు. విఘ్నవినాయకుడికి పది చేతులుంటాయి. విఘ్నాలు తొలగేందుకు ఈయన పూజకు మించింది మరొకటి లేదంటారు. క్షిప్రగణపతిని పూజిస్తే కోరికలు తీరుతాయి. హేరంబ గణపతిని పూజిస్తే ప్రయాణాలలో ప్రమాదాలు కలగవు.
లక్ష్మీగణపతి పూజ వల్ల ధనప్రాప్తి కలుగుతుంది. మహా విఘ్నవినాయకుడిని పూజిస్తే ఏలినాటిశని లాంటివి ఉన్న సమయాల్లో కూడా తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా సాగుతాయి. భువనేశ వినాయకుడిని పూజిస్తే శాశ్వత జయం కలుగుతుంది. అందుకే ఈయనను విజయవినాయకుడు అనికూడా అంటారు. నృత్త వినాయకుడిని పూజిస్తే తృప్తి, మనశ్శాంతి కలుగుతాయి. ఈయన తాండవం చేస్తుంటాడు కనుక తాండవ గణపతి అని కూడా అంటారు. ఊర్ధ్వ గణపతిని పూజిస్తే తెలిసి చేసిన పాపాలు కూడా పోతాయి. అలాగే ఆకుపచ్చని శరీరఛాయతో మెరిసిపోతున్న లక్ష్మీదేవిని తన ఎడమతొడమీద కూర్చోపెట్టుకొని ఆమె వెనుకగా తన చెయ్యిని పోనిచ్చి ఆమెను పొదివిపట్టుకున్నట్లుగా ఉంటాడు వూర్ధ్వగణపతి.
ఈ పదహారురకాల గణపతులను ప్రధానంగా పూజిస్తే కోరిన కోరికలు తీరుతాయని ముద్గల పురాణం చెపుతోంది. వినాయకచవితి రాగానే సర్వత్రా అనేక రూపాలలో గణపతి బొమ్మలు కనిపిస్తుంటాయి. వాటిలో శాస్త్రాలు నిర్దేశించిన రూపాలు ఇలా కనిపిస్తున్నాయి. వీటినే జాగ్రత్తగా శ్రద్ధతో పూజించడం మేలని పెద్దలు చెపుతున్నారు. ఇక వినాయకుడి పక్కన లక్ష్మీదేవి ఏమిటి అనే ప్రశ్న ఈ పదహారు గణపతులలోని కొన్ని గణపతుల రూపాలను పరిశీలిస్తున్నప్పుడు తలెత్తుతుంది. దానికి సమాధానంగా స్కందపురాణం, గణపతి పురాణం లాంటి పురాణాలు గణపతి శ్రీమహావిష్ణు స్వరూపమని, అందుకే ఆయన పక్కన లక్ష్మీదేవి ఉంటుందని చెపుతున్నాయి.