భోగి పండ్లు అంటే ఏమిటి? పిల్లలపై ఎందుకు పోస్తారో తెలుసా?
సంక్రాంతి పండగ మూడు రోజులలో మొదటగా వచ్చేది భోగి. ఆ తర్వాత సంక్రాంతి, తదుపరి రోజును కనుమగా జరుపుకుంటారు. భోగి రోజున భోగి మంటలు వేస్తారు. ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం సమయంలో చిన్న పిల్లలకు భోగి పండ్లను పోసి సంబరం చేస్తారు. రేగుపండ్లతో ఇతర పదార్థాలు, వస్తువులను చేర్చి పిల్లలపైనుంచి పోస్తారు. భోగి పండ్లు పిల్లలపై ఎందుకు పోస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

మకర సంక్రాంతి తెలుగు రాష్ట్ర ప్రజలకు అతిపెద్ద పండగ. మూడు రోజులు ఈ పండగను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ పండగ ఎక్కువగా పిల్లలు, మహిళలకు ప్రత్యేకమని చెప్పవచ్చు. పిల్లలు, యువకులు పతంగులు ఎగురవేస్తే ఆనందంగా గడుపుతారు. ఇక, స్త్రీలు తమ ఆరాధ్య దేవతలను భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మునిగిపోతారు. పిండి వంటకాలు, నోములు, వ్రతాలు, ఇతర కార్యక్రమాలతో కుటుంబంతో ఎంతో సంతోషంగా గడుపుతారు.
సంక్రాంతి పండగ మూడు రోజులలో మొదటగా వచ్చేది భోగి. ఆ తర్వాత సంక్రాంతి, తదుపరి రోజును కనుమగా జరుపుకుంటారు. భోగి రోజున భోగి మంటలు వేస్తారు. ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం సమయంలో చిన్న పిల్లలకు భోగి పండ్లను పోసి సంబరం చేస్తారు. రేగుపండ్లతో ఇతర పదార్థాలు, వస్తువులను చేర్చి పిల్లలపైనుంచి పోస్తారు. భోగి పండ్లు పిల్లలపై ఎందుకు పోస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
భోగి పండ్లు అంటే ఏమిటి?
భోగి పండ్లు అంటే కేవలం రేగు పండ్లు మాత్రమే కాదు. రేగు పండ్లతోపాటు చిన్న చెరకు గడ ముక్కలు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణేలు, అక్షతలను కలిపి ‘భోగి పండ్లు’గా పిలుస్తారు. కొన్ని ప్రాంతాల్లో శనగలు కూడా కలుపుతారు.
భోగి పండ్లు ఎందుకు పోస్తారు?
పిల్లల ధిష్టి తొలగడానికి
పిల్లలపై ఉన్న చెడు దృష్టి(దిష్టి) తొలగిపోయి.. వారికి ఆయురారోగ్యాలు కలగాలని ఈ భోగి పండ్ల సంప్రదాయాన్ని పాటిస్తారు.
శ్రీమన్నారాయణుని ఆశీస్సులు
రేగు పండ్లను ‘బదరీ ఫలం’ అని కూడా అంటారు. నరనారాయణులు బదరికావనంలో తపస్సు చేసినప్పుడు దేవతలు వారిపై బదరీ ఫలాలను కురిపించారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే పిల్లలను నారాయణుడిగా భావించి ఈ పండ్లను పోస్తారు.
సూర్యుని అనుగ్రహం
రేగు పండ్లు ఎరుపు రంగులో, గుండ్రంగా ఉండటం.. సూర్యుడిని పోలి ఉన్నట్లుగా భావిస్తారు. అందుకే దీన్ని అర్క ఫలం అని కూడా అంటారు. సూర్యుడి ఆశీస్సులు పిల్లలపై ఉండాలని దీనిని ఉపయోగిస్తారు.
ఆరోగ్య సూత్రం
పిల్లల తల పైభాగంలో ఉండే ‘బ్రహ్మరంధ్రం’ వద్ద ఈ పండ్లను పోయడం వల్ల పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందని, రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుందని విశ్వాసం.
భోగి పండ్లు పోసే విధానం
భోగి రోజు సాయంత్రం ఈ వేడుకను జరుపుకుంటారు. సాధారణంగా ఐదేళ్లలోపు పిల్లలకు భోగి పండ్లు పోస్తారు. కొన్ని చోట్ల 12 ఏళ్ల పిల్లల వరకు పోస్తారు. పిల్లలకు తలస్నానం చేయించి, కొత్త బట్టలు వేసి తూర్పు ముఖంగా కూర్చోబెట్టాలి. ముందుగా ఇంటిలోని దేవుని వద్ద దీపం వెలిగించాలి. మొదటగా పిల్లల తల్లి దోసెడు పండ్లు తీసుకుని, పిల్లల తల చుట్టూ మూడుసార్లు సవ్యదిశలో, మూడుసార్లు అపసవ్య దిశలో తిప్పి తలపై పోయాలి. ఆ తర్వాత తండ్రి, ఇతర పెద్దలు, మహిళలు ఇదేవిధంగా పండ్లు పోసి పిల్లలను ఆశీర్వదిస్తారు. చివరగా పిల్లలకు మంగళ హారతి ఇవ్వాలి. ఈ సందర్భంగా పిల్లలకు, పండ్లు పోసినవారికి పండగ సందర్భంగా చేసిన పిండి వంటకాలు, చకినాలు అందిస్తారు.
అయితే, భోగి పండ్లు పోసిన తర్వాత కింద పడిన పండ్లను గానీ, నాణేలను గానీ పిల్లలు ఏరుకోకూడదు. భోగి పండ్లను శుభ్రం చేసి ఆవులకు లేదా ఇతర మూగ జీవాలకు ఆహారంగా వేయడం మంచిది. కాగా, ప్రాంతాలవారీగా ఈ భోగి పండ్లు పోసే విధానంలో చిన్నపాటి మార్పులు ఉండవచ్చు.
Note: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది.
