AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సప్తశృంగి ఆలయాన్ని దర్శిస్తే.. పాపాలు, రోగాలు మాయం! ఈ అరుదైన శక్తి పీఠం ఎక్కడ ఉందంటే..?

Saptashrungi Nivasini: మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా, కల్వాన్ తాలూకాలో ఉన్న నండూరి గ్రామ సమీపంలో ప్రకృతి సౌందర్యం మధ్య విరాజిల్లుతున్న సప్తశృంగి అమ్మవారి ఆలయం భక్తుల విశేష ఆరాధన పొందుతోంది. ఏడు పర్వత శిఖరాల మధ్య స్వయంభువుగా వెలసిన అమ్మవారిని స్థానిక మరాఠాలు తమ కులదైవంగా పూజిస్తుంటారు.

సప్తశృంగి ఆలయాన్ని దర్శిస్తే.. పాపాలు, రోగాలు మాయం! ఈ అరుదైన శక్తి పీఠం ఎక్కడ ఉందంటే..?
Saptashrungi Mata Temple
Rajashekher G
|

Updated on: Feb 01, 2026 | 1:07 PM

Share

Saptashrungi Temple: భారతదేశంలో అనేక అమ్మవారి ఆలయాలు ఉన్నాయి. ఇందులో శక్తి పీఠాలు ప్రముఖమైనవి. ఇప్పుడు చెప్పుకుంటున్న సప్తశృంగి ఆలయం సతీదేవి 52 శక్తి పీఠాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా, కల్వాన్ తాలూకాలో ఉన్న నండూరి గ్రామ సమీపంలో ప్రకృతి సౌందర్యం మధ్య విరాజిల్లుతున్న సప్తశృంగి అమ్మవారి ఆలయం భక్తుల విశేష ఆరాధన పొందుతోంది. ఏడు పర్వత శిఖరాల మధ్య స్వయంభువుగా వెలసిన అమ్మవారిని స్థానిక మరాఠాలు తమ కులదైవంగా పూజిస్తుంటారు. సతీదేవి కుడిచేయి పడిన ప్రదేశంగా ఈ క్షేత్రాన్ని పురాణాలు పేర్కొంటాయి. మహారాష్ట్రలోని మూడున్నర శక్తిపీఠాల్లో ఇది సగం శక్తిపీఠంగా భావిస్తారు.

మూడున్నర శక్తిపీఠాల విశిష్టత

దేవీ భాగవతం ప్రకారం.. మహారాష్ట్రలో కొల్హాపూర్ మహాలక్ష్మి, తుల్జాపూర్ తుల్జాభవానీ, మహూర్ రేణుకాదేవి, వాణి సప్తశృంగి ఆలయాలు మూడున్నర శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెందాయి. ఇవి పవిత్ర ‘ఓంకారం’లోని నాలుగు స్వరూపాలకు ప్రతీకలుగా భావిస్తారు. ఇందులో సప్తశృంగి ఆలయాన్ని అర్ధ శక్తిపీఠంగా పరిగణిస్తారు.

బ్రహ్మ స్వరూపిణిగా అమ్మవారు

ఈ ఆలయ ప్రధాన దేవతను సప్తశృంగి, సప్తశృంగ నివాసిని, సప్తశృంగ మాత, బ్రహ్మ స్వరూపిణి అనే పేర్లతో పిలుస్తారు. బ్రహ్మదేవుని కమండలం నుంచి ఈ దేవత ఉద్భవించిందని, మహిషాసుర సంహారం అనంతరం ఇక్కడ కొలువైనదిగా భక్తుల విశ్వాసం.

స్థల పురాణం..

దక్షయజ్ఞంలో శివనిందను భరించలేక సతీదేవి ఆత్మార్పణ చేసుకున్న అనంతరం ఆమె దేహాన్ని శివుడు మోసుకుంటూ తాండవం చేయడంతో లోకాలు కంపించాయి. అప్పుడు విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని ఖండించగా.. ఆమె కుడిచేయి పడిన ప్రదేశమే సప్తశృంగిగా చెబుతారు.

రామాయణ ప్రాశస్త్యం

రామాయణ కాలంలో దండకారణ్యంలో భాగమైన ఈ ప్రాంతానికి శ్రీరాముడు సీత, లక్ష్మణులతో కలిసి వచ్చినట్లు పురాణాల్లో ప్రస్తావన ఉంది. సప్తశృంగి అమ్మవారిని దర్శించుకున్నట్లు చెబుతారు. యుద్ధంలో నేలపై కుప్పకూలిన లక్ష్మణుని రక్షించేందుకు హనుమంతుడు ఔషధ మూలికల కోసం సప్తశృంగి పర్వతాలకు వచ్చినట్టు కథనాలు ఉన్నాయి.

ఆలయ విశిష్టత

రెండు అంతస్తులుగా నిర్మితమైన ఈ ఆలయ గర్భగుడిలో అమ్మవారు 18 చేతులతో, విభిన్న ఆయుధాలతో మహిషాసుర మర్దినిగా దర్శనమిస్తారు. దాదాపు పది అడుగుల ఎత్తులో ఉన్న విగ్రహం భక్తులను ఆకట్టుకుంటుంది. కొండ అడుగున మహిషాసురుడు గేదె తల రూపం కనిపిస్తుంది. ఆలయం చుట్టూ ఉన్న కాళీకుండ్, సూర్యకుండ్, దత్తాత్రేయకుండ్ తటాకాల్లో స్నానం చేస్తే పాపాలు నశిస్తాయని, ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.

సప్తశృంగి అమ్మవారిని గిరిజనులు మహిషాసుర మర్దినిగా పూజిస్తారు. అమ్మవారి విగ్రహానికి నిత్యం సిందూరం పూత వేస్తారు. భయాలు, మానసిక ఆందోళనలు తొలగించి ధైర్యాన్ని ప్రసాదిస్తుందని విశ్వసిస్తారు. ముఖ్యంగా దసరా నవరాత్రుల్లో ఇక్కడి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి.

ఆలయానికి ఎలా చేరుకోవాలి?

నాసిక్ నగరానికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి మహారాష్ట్రలోని అన్ని ప్రధాన పట్టణాల నుంచి రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిన శక్తి క్షేత్రంగా సప్తశృంగి అమ్మవారి ఆలయం భక్తుల విశేష ఆదరణ పొందుతోంది.