విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో శోభకృత్ నామ సంవత్సరం పౌర్ణమిని పురస్కరించుకుని ఈరోజు ఉదయం ఐదున్నర గంటల సమయంలో ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధల మధ్య సాగింది. దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఇంద్రకీలాద్రి ఘాట్‌రోడ్డు ప్రారంభంలోని కామధేను అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభమైన ఈ గిరిప్రదక్షణలో వందలాదిమంది భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. అరుణాచల క్షేత్రము తరహాలో ప్రతి పౌర్ణమికి ఇక్కడకూడా గిరిప్రదిక్షిన చెయ్యడం ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్ కర్నాటి రాంబాబు, ఈవో భ్రమరాంబ, స్థానాచార్యులు, ట్రస్టు బోర్డు సభ్యులు పాల్గొని అమ్మవారికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.
దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఉదయం ఐదున్నర గంటలకు కామధేను అమ్మవారి ఆలయం నుంచి గిరిప్రదక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ గిరిప్రదక్షణ కార్యక్రమం.. కుమ్మరిపాలెం కూడలి, సితార, కబేళా, పాలఫ్యాక్టరీ, చిట్టినగర్, కొత్తపేట, బ్రాహ్మణమీది నుంచి ఘాట్‌రోడ్డు వరకు జరిగింది. డప్పు వాయిద్యాలు, కోలాటాల మధ్య దుర్గా మల్లేశ్వరస్వామి వారి ప్రచార రథం ముందు సాగుతుండగా.. వెనుక దుర్గామల్లేశ్వరస్వామి ఉత్సవ మూర్తులను వాహనంలో ఉంచి.. ఇంద్రకీలాద్రి చుట్టూ సుమారు 9 కిలోమీటర్లు ప్రదక్షణ చేశారు.
భక్తుల సౌకర్యార్థం గిరిప్రదిక్షిన మార్గం లో బస్సుని కూడా అధికారులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మహిళ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని.. స్వామి, అమ్మవార్లకు దారిపొడవునా పూలు, పండ్లు, కొబ్బరికాయలు సమర్పించి పూజలు చేశారు. పౌర్ణమి రోజున అమ్మవారి శిఖరం చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తే కోరికలు తీరుతాయనేది భక్తుల విశ్వాసం. మరోపక్క పౌర్ణమి సందర్భంగా దుర్గా మల్లే శ్వరస్వామి దేవస్థానంలో కనకదుర్గమ్మను దర్శించుకోవడానికి భక్తులు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలిరావడంతో అమ్మవారి ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది.
Reporter: Vikram
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..