AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vidura Niti: విదుర నీతిలోని మేటి కథ.. కుమారులు చేసిన తప్పులను సరిదిద్దకపోతే.. రాజుగా తండ్రిగా అంతులేని దుఃఖాన్ని అనుభవిస్తావు

Mahabharata-Vidura Niti: పురాణాలు, మహాభారతం ఇతిహాస, కావ్య గ్రంధాల్లో ఉన్న నీతులను తెలుసుకోవటం.. వాటిని ఆచరించే ప్రయత్నం చేయడం ఆధునిక కాలంలో  అవసరం. మహాభారతం ఉద్యోగపర్వంలో..

Vidura Niti: విదుర నీతిలోని మేటి కథ.. కుమారులు చేసిన తప్పులను సరిదిద్దకపోతే.. రాజుగా తండ్రిగా అంతులేని దుఃఖాన్ని అనుభవిస్తావు
Vidura Niti
Surya Kala
|

Updated on: Sep 07, 2021 | 10:14 AM

Share

Mahabharata-Vidura Niti: పురాణాలు, మహాభారతం ఇతిహాస, కావ్య గ్రంధాల్లో ఉన్న నీతులను తెలుసుకోవటం.. వాటిని ఆచరించే ప్రయత్నం చేయడం ఆధునిక కాలంలో  అవసరం. మహాభారతం ఉద్యోగపర్వంలో సందర్భానుసారంగా విదురుని చేత ధృతరాష్ట్రునికి చెప్పించిన సామజిక రాజకీయ, కుటుంబ జీవనానికి చెందిన నీతి శాస్త్ర విషయాలు “విదురనీతి” లుగా ప్రసిద్ధి చెందాయి. ఇందులో ఒక మనిషి మనిషిగా సమాజంలో జీవించాలంటే ధర్మార్ధ కామ మొక్షాలనే చతుర్విధ పురుషార్థాల సాధన కోసం చేయాల్సిన పనులు పూర్తిగా వివరించాడు విదురుడు. ఈ విదురు చెప్పిన వానిలో రాజధర్మం, సామాన్య ధర్మం ఎల్లవేళలా మనిషి నైతిక, ధార్మిక జీవన విధానం వివరించాడు. అంధుడైన దృతరాష్ట్రుడు మనసుని చెవులను మూసుకోవడం వలన, తనయుడు దుర్యోధనాదుల రాజ్యాంహకారం చేత ఎవరికీ పనికిరాకుండా పోయారు.

కురుక్షేత్రంలో హోరాహోరీగా కౌరవులు, పాండవులు తలపడుతున్న సమయంలో దృతరాష్ట్రుడుకి తన కుమారులు బతికి ఉంటారా అనే సందేహం ఏర్పడింది. దీంతో వెంటనే కురుక్షేత్రం ఆపించి.. తన బిడ్డలను కాపాడుకోవాలని భావిస్తాడు. వెంటనే దృతరాష్ట్రుడు..  విదురుని మందిరానికి పిలిపించి ” విదురా! సంజయుడు నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు. మనసు వికలమయింది నిద్ర రావడం లేదు ” అన్నాడు. విదురుడు ” దృతరాష్ట్రా! బలవంతుని చేతిలో దెబ్బలు తిన్న బలహీడు, ఇతరుల డబ్బు అపహరించ కాచుకున్న వాడు, ధనం సంపద పోగొట్టుకున్న వాడు, కామంతో కైపెక్కిన వాడు నిద్రపట్టక అవస్థ పడతాడు. వీటిలో నీకు ఏ దోషం ఉంది.ఇతరుల సొమ్ము అపహరించి నీవు ఒక్కడివే అనుభవించాలనుకున్నావు అందుకే నీకు నిద్ర రావడం లేదు” అని విదురుడు అన్నాడు.

వెంటనే దృతరాష్ట్రుడు ” అది కాదు విదురా..  ధర్మరాజు మనో గతం అవగతం కాక నిద్ర రావడం లేదు అన్నాడు. విదురుడు ” రాజా..  నీ బంధువు, హితుడు, సేవకుడు, శాంతమూర్తి అయిన ధర్మరాజు నీకు కీడు తలపెడతాడా? అతని రాజ్యాన్ని ధర్మరాజుకి అప్పగించి ఇప్పటికైనా నీవు నీ కుమారులు చేసిన తప్పు సరిదిద్దు.

వెంటనే దృతరాష్ట్రుడు స్పందిస్తూ..  ” విదురా! రేపు సభలో సంజయుడు చెప్పినది విని మాకు ఏది క్షేమమో అది చేయించు. ఇప్పుడు నా మనసుకు శాంతి కలిగేలా నీ అమృత వచనం నా మీద కురిపించు ” అన్నాడు.

దృతరాష్ట్రుడుకి విదురుడు ఇచ్చిన బదులు విదురనీతిగా ప్రసిద్ధి పొందింది.

రాజా..  మనిషి తనను లోకులు నిందించే పని చేయక లోక హితమైన కార్యాలు చేయాలి. పరుల సంపదకు ఈర్ష్యపడక నలుగురితో కలిసి మెలిసి బ్రతకాలి. కోపం వస్తే ఆపుకోకపోవడం,  పొగడ్తలకు పొంగి పోవడం , గర్వించడం, ఎంత ఉన్న అసంతృప్తి, దురభిమానం, ఏపనీ చేయక పోవడం దుర్జనుల లక్షణమని విదురుడు చెప్పాడు. అంతేకాదు తనను పాలించే రాజును , లోకాన్నిరక్షించే భగవంతుని, కట్టుకున్న భార్యను, బంధువులను సముచితంగా ఆదరించక పోతే ఏ కార్యం సత్ఫలితాన్ని ఇవ్వదు. అవివేకులు తమను ప్రేమించే వారిని వదిలి ద్వేషించే వారి వెంట పడతారు. ఎదుటి వాడు బలవంతుడని తెలిసినా వారిని హింసిస్తాడు. ధనము, విద్య, వంశము మంచి వారికి గౌరవాన్ని అణుకుకువను కలిగిస్తే చెడ్డవారికి మదాన్ని గర్వాన్ని కలిగిస్తుంది. ఒకని బాణం శత్రువును సంహరించవచ్చు లేదా అది గురితప్పవచ్చు.. అయితే ఒకరి నీతి మాత్రం శత్రువుని గురి తప్పకుండా నాశనం చేస్తుంది.

తాను ఒక్కడే తినడమూ అందరూ నిద్రిస్తున్నప్పుడు ఒక్కడే ఆలోచించడం , ఒంటరిగా ప్రయాణం చేయడమూ మంచిది కాదు. లోకంలో సత్యానికి మించిన మంచి గుణం లేదు. క్షమాగుణాన్ని చేతగాని గుణంగా భావిస్తారు కాని దానికి మించిన ధర్మం లేదు. పరుషవాక్యములు మాట్లాడక పోవడం, పాపపు పనులు చేయక పోవడం వలన మనిషి ఉత్తముడు అవుతాడు. బలవంతుడై శాంతంగా ఉండే వాడు, పేద వాడైనా దానం చేసే వాడు పుణ్యపురుషుడు అనిపించు కుంటాడు. పరస్త్రీ వ్యామోహం, మద్యపానం, వేటాడటం, పరుషభాషణ, వృధాగా ధనమును ఖర్చు చేయడమూ, పోట్లాడటమూ సప్త వ్యసనాలని విజ్ఞులు చెప్తారు. కనుక వారు వాటి జోలికి పోరు. తనకు ఉన్నంతలో ఇతరులకు ఇవ్వాలి, శత్రువనా కోరిన సహాయం చేయాలి. ఎక్కువగా కష్టపడి తక్కువగా సుఖపడాలి. మంచి వారు పొగడ్తలకు మేలు చేస్తారు కాని కీడు చేయరు. నేను చెప్పిన లక్షణాలు ధర్మజునిలో ఉన్నాయి. నీవు వారిని ఆదరించి ఇప్పుడు నిరాదరణకు గురి చేసావు. వారి రాజ్యభాగాన్ని వారికి ఇచ్చి వారిని ఆదరించడం నీ ధర్మం. మీరు కలసి ఉన్నంత కాలం దేవతలు కూడా మీ వంక కన్నెత్తి చూడలేరు ” అన్నాడు.

విదురుని మాటలు విన్న దృతరాష్ట్రుడు ” విదురా? నన్ను ఇప్పుడు ఏమి చేయమంటావు ” అని అడిగాడు. విదురుడు ” అలా అడిగితే నేను ఏమి చెప్పను? రాజ్యం దక్కింది కదా అని తమ్ముని రాజ్యం కాజేయాలని చూసావు. చేపతో సహా గాలం కూడా మింగిన చందాన ఉంది నువ్వు చేస్తున్న పని. పక్వానికి రాక మునుపే పండును కోసిన రుచిగా ఉండక పోవడమే కాక దాని విత్తనం తన ప్రయోజనాన్ని కోల్పోతుంది. పరుల ధనానికి, విద్యకు, పరాక్రమానికి ఈర్ష్య చెందే వాడు ఏరోగం లేక పోయినా బాధ పడక తప్పదు. ఎదుటి వానికి ప్రియం కలిగించేలా మాట్లాడలేక పోయిన ఊరక ఉండటం మంచిది. మాటల వలననే పగ, చెలిమి, తెలివి, కలత, ధర్మం, పాపం, కీత్రి, అపకీర్తి కలుగుతాయి. గొడ్డలితో నరికిన చెట్టు కూడా చిగురిస్తుంది.. కానీ  మాటలతో చెడిన కార్యం సిద్ధించదు. శరీరానికి తగిలిన గాయం మాన్పవచ్చు కాని మనసుకు తగిలిన గాయం మాన్పలేము.

పూర్వం ప్రహ్లాదుడు రాక్షస కులంలో జన్మించినా ధర్మ మార్గం తప్పక అంగీరసునికి తన కుమారునికి వచ్చిన వివాదంలో పక్షపాత రహితంగా అంగీరసుని పక్షాన న్యాయం చెప్పాడు. కనుక నీవు కూడా నీ కుమారుల పట్ల పక్షవాతం వదిలి ఇరువుకి సంధి చెయ్యి.

పాడవులు నిన్ను తండ్రి స్థానంలో ఉంచి గౌరవిస్తున్నారు నీవు అలాగే వారిని కన్న కొడుకులుగా చూడటం మంచిది. మేలు చేసిన వాడికి కీడు చేసిన వాడి శవాన్ని కుక్కలు కూడా ముట్టవు. నీ తమ్ముడు పాండు రాజు నీకు పరమ భక్తుడు, పాండవులు నీకెంతో మేలు చేసారు. వారిని ఆదరించడం మంచిది. ప్రతి మనిషికి సుఖ దుఃఖాలు సహజం. దుఃఖించడం వలన శక్తి నశిస్తుంది, మతి చెడుతుంది, శరీరం కృశిస్తుంది, రోగం వస్తుంది శత్రువుకు అది బలాన్ని చేకూరుస్తుంది కనుక దుఃఖించడం మాను” అంటూ విదురుడు .. దృతరాష్ట్రుడికి నీతి బోధ చేశాడు.

Also Read:   ఇంట్లోనే బంకమట్టితో వినాయక విగ్రహం సులభంగా తయారీ.. స్టెప్ బై స్టెప్..