Tirumala Tirupati Temple: తిరుమల బ్రేక్ దర్శనాల సమయాన్ని మార్చాలని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నిర్ణయించింది. శనివారం టీటీడీ బోర్డు మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్‌లో కీలక నిర్ణయాలను తీసుకున్నారు బోర్డు సభ్యులు. బోర్డ్ మీటింగ్ అనంతరం మీడియాతో మాట్లాడిన వైవీ సుబ్బారెడ్డి.. బ్రహ్మోత్సవాల్లో శ్రీవారి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్చించామని తెలిపారు. అలాగే, బ్రహ్మోత్సవాల అనంతరం తిరుపతిలో సర్వదర్శన టోకెన్ల జారీని పునరుద్ధరిస్తామని తెలిపారు. అలాగే, శ్రీవారి బ్రేక్ దర్శనాల సమయాన్ని మార్చాలని నిర్ణయించామన్నారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు బ్రేక్ దర్శన సమయాలను మార్చుతామని చెప్పారు. బ్రహ్మోత్సవాల తర్వాత ప్రయోగాత్మకంగా బ్రేక్ దర్శనాల మార్పును అమలు చేస్తామని వివరించారు వైవీ సుబ్బారెడ్డి. సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకుని వీఐపీ, శ్రీవాణి దర్శనాలను తగ్గించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు టీటీడీ చైర్మన్. తిరుమలలో వసతి కేటాయింపు వ్యవస్థను తిరుపతికి మార్చాలని నిర్ణయించామన్నారు. ఇదే సమయంలో టీటీడీ ఆస్తులపై కీలక ప్రకటన చేశారు బోర్డ్ చైర్మన్. టీటీడీ ఆస్తులపై గతంలో శ్వేతపత్రం విడుదల చేశామని, 960 ఆస్తులను టీటీడీ వెబ్ సైట్‌లో పొందపరచామని వెల్లడించారు. వీటి విలువ రూ.85,705 కోట్లు ఉంటుందన్నారు. ఇకపై ప్రతి సంవత్సరం టీటీడీ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేస్తామని తెలిపారాయన.
శ్రీవారి ప్రసాదాలకు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు..
శ్రీవారి ప్రసాదాల తయారీకి ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను వినియోగించాలని గతంలో నిర్ణయించామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఏపీ మార్క్ ఫెడ్, రైతు సాధికారిక సంస్థల ద్వారా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తామన్నారు. తిరుమలలో భక్తులకు వసతి పరమైన ఇబ్బందులు తలెత్తకుండా యాత్రికుల వసతి సముదాయం నిర్మిస్తామని తెలిపారు టీటీడీ చైర్మన్. గోవర్ధన్ సత్రం వెనుక రూ.95 కోట్లతో పీఏసీ-5 నిర్మిస్తామన్నారు. ఇక నందకం విశ్రాంతి గృహంలో ఫర్నిచర్ మార్పునకు రూ.2.45 కోట్లు కేటాయించామని తెలిపారు. నెల్లూరులో రెండు ఎకరాల్లో శ్రీవారి ఆలయం, కళ్యాణ మండపం నిర్మాణానికి రూ.3 కోట్లు కేటాయించామన్నారు. టీటీడీ ఉద్యోగులకు ఇళ్లస్థలాల కోసం ప్రభుత్వం నుండి 300 ఎకరాలు తీసుకున్నామని, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా మరో 130 ఎకరాలు తీసుకోవాలని నిర్ణయించామన్నారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..