TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నెల రోజుల పాటు ఆ సేవ రద్దు.. ప్రకటన జారీ చేసిన టీటీడీ

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక అప్డేట్ జారీ చేసింది. ధనుర్మాసం ప్రారంభం కానుండటంతో ఆలయంలో నెల రోజుల పాటు సుప్రభాత సేవను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. ఇవాళ (శుక్రవారం) సాయంత్రం నుంచి....

TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నెల రోజుల పాటు ఆ సేవ రద్దు.. ప్రకటన జారీ చేసిన టీటీడీ
Tirumala
Follow us
Ganesh Mudavath

|

Updated on: Dec 16, 2022 | 10:47 AM

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక అప్డేట్ జారీ చేసింది. ధనుర్మాసం ప్రారంభం కానుండటంతో ఆలయంలో నెల రోజుల పాటు సుప్రభాత సేవను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. ఇవాళ (శుక్రవారం) సాయంత్రం నుంచి ధనుర్మాసం ప్రారంభం కానుంది. ఈ క్రమంలో రేపటి (శనివారం) నుంచి జనవరి 14 వరకూ తిరుప్పావై పఠనం జరగనుంది. స్వామి వారి ఆలయంలో సుప్రభాత సేవకు బదులుగా తిరుప్పావైతో మేల్కోలుపు సేవ నిర్వహిస్తారు. ఆగమ శాస్త్రంలో ధనుర్మాసానికి విశేష ప్రాధాన్యం ఉంది. సాధారణంగా ప్రతి రోజు తెల్లవారు జామున స్వామి వారిని సుప్రభాత సేవతో మేల్కొలుపుతారు. ఆ తర్వాతే అన్ని కైంకర్యాలు ప్రారంభం అవుతాయి. ఈ సేవలో పాల్గొనేందుకు అనేక రంగాలకు చెందిన ప్రముఖులు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే, శ్రీవారి సేవల్లో సంప్రదాయాల కొనసాగింపులో భాగంగా ఇప్పుడు నెల రోజుల పాటు ఈ సేవను రద్దు చేసి తిరుప్పావై సేవను నిర్వహించనున్నారు.

పురాణాల ప్రకారం ధనుర్మాసంలో దేవతలు సూర్యోదయానికి ఒకటిన్నర గంట ముందుగా నిద్రలేస్తారు. బ్రహ్మ ముహూర్తంలో శ్రీమహావిష్ణువును ప్రత్యేకంగా ప్రార్థిస్తారు. కాబట్టి ఈ మాసానికి అంత ప్రాధాన్యత వచ్చింది. శ్రీవారి ఆలయంలో నెల రోజుల పాటు జరిగే తిరుప్పావై పారాయణంలో రోజుకు ఒకటి వంతున అర్చకులు నివేదిస్తారు. కాగా.. స్వామివారి దర్శనం కోసం 14 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. శ్రీవారి హుండీ ఆదాయం 4.13 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

మరో వైపు.. తిరుమల శ్రీవారి దర్శనానికి ఎంత డిమాండ్‌ ఉంటుందో స్వామివారి లడ్డూలకు కూడా అంతే డిమాండ్‌ ఉంటుంది. దీనిని అవకాశంగా తీసుకుని కొందరు శ్రీవారి భక్తులను బురిడీ కొట్టిస్తున్నారు. అధిక లడ్డూలు విక్రయిస్తామంటూ, దర్శనంతో సంబంధం లేకుండానే లడ్డూలు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవాలంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఈ అసత్య వార్తలపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) స్పందించింది. తమ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో లడ్డూలు బుక్‌ చేసుకోవచ్చన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని తేల్చి చెప్పేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మికం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి