Tirumala: టీటీడీ నిధులు మున్సిపల్ కార్పొరేషన్‌కు మళ్లింపు.. దేవుడి సంపదను దారి మళ్లిస్తున్నారని బీజేపీ ఆరోపణలు
ఏడుకొండల వాడి ఆస్తిని హారతి కర్పూరంలా కరిగించే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందని మండిపడుతున్నారు బీజేపీ నేతలు. టీటీడీ నిధులను తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌కు మళ్లించాలన్న నిర్ణయాన్ని తప్పుబట్టారు భానుప్రకాశ్ రెడ్డి. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఓటు బ్యాంకు రాజకీయాలకు అధికార వైసీపీ పాల్పడుతోందని అన్నారు
తిరుపతి, అక్టోబర్ 9: శ్రీవారి హుండీ కానుకలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయంటూ బీజేపీ చేస్తున్న ఆరోపణ ఇప్పుడు మరో వివాదానికి తెర తీసింది. టీటీడీ బడ్జెట్‌తో ఒక శాతం నిధులను తిరుపతి అభివృద్ధికి కేటాయించాలంటూ టీటీడీ పాలకమండలి తీసుకున్న నిర్ణయం రాజకీయ రచ్చగా మారింది. శ్రీవారి నిధులను ఓట్ల కోసం దారి మళ్లించడమేనంటున్న బీజేపీ ఈ అధికారం ఎక్కడిదని ప్రశ్నిస్తోంది. ఈ అంశంపై పెద్ద చర్చనే నడుస్తోంది.
టీటీడీ పాలకమండలి తీసుకున్న కీలక నిర్ణయాల్లో తిరుపతి అభివృద్ధి కోసం టీటీడీ నిధులను ఖర్చు చేయడం.. ఇప్పుడు రాజకీయంగా వివాదానికి కారణమైంది. ధర్మ ప్రచారం కోసం కాకుండా సొంత ప్రయోజనాలకు స్వామి వారి నిధులను ఖర్చు చేయడం దారి మళ్లించడం కాదా అని ప్రశ్నిస్తున్న బీజేపీ.. టీటీడీ పాలక మండలి నిర్ణయాలను తప్పుపడుతుండగా.. ప్రైవేట్ సంస్థలు కార్పొరేట్ సామాజిక బాధ్యతగా ఎలా అభివృద్ధి పనులు చేస్తాయో అదే తరహా టీటీడీ కూడా ఒక సామాజిక బాధ్యతగా తిరుపతి అభివృద్ధి పట్ల బడ్జెట్‌లో ఒక శాతం నిధులను కేటాయించాలని పాలకమండలి తీర్మానించింది.
ఈ మేరకు పాలకమండలి తీసుకున్న నిర్ణయాన్ని టీటీడీ చైర్మన్ భూమన ఈవో ధర్మారెడ్డి ప్రకటించారు. అంతేకాకుండా టీటీడీకి చెందిన ఆలయాలతో పాటు టీటీడీ సంస్థలు, సముదాయాలు ఉన్న ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనుల బాధ్యత, పారిశుద్ధ్య పనుల నిర్వహణ టీటీడీ చేపట్టాలని కూడా నిర్ణయించింది. ఈ మేరకు టీటీడీ బడ్జెట్ నుంచి తిరుపతి అభివృద్ధికి నిధులు కేటాయింపు చేయనుంది. ఈ నిర్ణయాన్ని తప్పుపడుతున్న బీజేపీ పారిశుద్ధ పనుల కోసం కూడా టీటీడీ నిధులనే ఖర్చు చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు బీజేపీ నేతలు భాను ప్రకాష్, సామంచి శ్రీనివాస్ వ్యతిరేకిస్తున్నారు. వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
టీటీడీ నిధులను హారతి కర్పూరంలా కరిగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలన్నారు. సీఎం జగన్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. భక్తుల కానుకలతో వచ్చిన శ్రీవారి హుండీ నిధుల్ని కార్పొరేషన్ కు కేటాయించి ఎలా ఖర్చు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఏటా రూ.4600 కోట్ల దాకా ఆదాయం టీటీడీకి ఉంటుందన్నారు. అందులో తిరుపతి కార్పొరేషన్‌కి ఒక శాతం నిధులను ఖర్చు ఎలా చేస్తారన్నారు. ఎక్కడెక్కడ ఖర్చు చేస్తారని, అభివృద్ధికి బీజేపీ అడ్డుకాదన్నారు. గరుడ ఫ్లై ఓవర్‌కు వేల కోట్లు ఖర్చు చేశారని.. భక్తుల అవసరాలకని స్వాగతించామన్నారు బీజేపీ నేతలు. ఇప్పటికే తిరుపతిలో రోడ్ల కోసం రూ.100 కోట్ల వరకు టీటీడీ సొమ్ము ఖర్చు చేశారని.. స్థానిక ప్రజల మౌలిక సదుపాయాల కోసమని ఊరికే ఉన్నామన్నారు. ఇదంతా ఎన్నికల కోసమేనని టీటీడీ స్వామి నిధులను ఈ విధంగా ఖర్చు చేస్తుందా అని ప్రశ్నిస్తున్నారు బీజేపీ నేతలు. కాగా, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న ఈ నిర్ణయమని వెనక్కి తీసుకోవాలన్నారు బీజేపీ నేతలు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..