Tirupati Laddu: ఏడుకొండల వాడికి ఎంత ప్రాధాన్యతో లడ్డుకూ అంతే.. మరో ఘనత సాధించిన శ్రీవారి లడ్డూ..!
నైవేద్య ప్రియుడిగా నేటికీ ప్రియంగా ద్వాపర యుగం నాటి అలవాటును కలియుగంలోనూ మరువకున్న శ్రీవారికి రోజు ఎన్నో నైవేద్యాలు. ఎన్నెన్నో నివేదనలు.
తిరుమల లడ్డు. కొండల రాయుడికి ప్రీతిపాత్రమైన ఈ లడ్డు ఏడుకొండలంత కీర్తిని సొంతం చేసుకుంది. విశ్వవ్యాప్తంగా విస్తరించింది. అంతే కాదు పేటెంట్ హక్కుల్ని సాధించుకుంది. శ్రీవారికి ప్రసాదాలు ఎన్ని ఉన్నా భక్తులకు ప్రీతిపాత్రమైన తిరుమల లడ్డు తిరుగులేనిదిగా మిగిలింది.
నైవేద్య ప్రియుడిగా నేటికీ ప్రియంగా ద్వాపర యుగం నాటి అలవాటును కలియుగంలోనూ మరువకున్న శ్రీవారికి రోజు ఎన్నో నైవేద్యాలు. ఎన్నెన్నో నివేదనలు. తెల్లవారుజామున 5 గంటల నుంచి తొలి నైవేద్యం సమర్పించే అర్చకులు పులిహోర, పొంగలి, దద్దోజనం సీరా, రవ్వ కేసరి, చక్కెర పొంగలి తదితర అన్న ప్రసాదాలతో పాటు పెరుగన్నం, లడ్డూలు, వడలు, అప్పాలు తదితర పిండి వంటలు మాత్రమే కాదు మినప దోసెలు, మునుగోరు, (మిరియాల అన్నం) కదంబం, క్షీరన్నం శ్రీవారి నైవేద్యాలు.
ఇలా భోజన ప్రియుడికి ఎన్నో ప్రసాదాలు పెట్టినా వెంకన్నకు, ఆయన భక్తకటికి అత్యంత ప్రతిపాదమైనది లడ్డూనే. తిరుమల ఆలయంలో పల్లవుల కాలం నుంచి ప్రసాదాలు మొదలయ్యాయని చరిత్ర చెబుతోంది. రెండవ దేవరాయలు కాలం నుంచి ప్రసాదాల సంఖ్య మరింత పెరిగింది. రెండవ దేవరాయుల కాలంలో మంత్రిగా పనిచేసిన శేఖర మల్లన్న ఆలయ ప్రసాదాల కోసం అనేక దానాలు చేయగా అప్పుడే శ్రీవారికి నైవేద్య వేళలు కూడా ఖరారు అయ్యాయి. అప్పట్లో కొండమీద భోజన సదుపాయాలు లేకపోవడంతో భక్తులకు పంచే ప్రసాదాలే వారి ఆకలి తీర్చేవి.
భక్తులకు అందించే ప్రసాదాలను తిరుప్పొంగంగా పిలిచే ఆలయ అర్చకులు ఆ తర్వాత సుఖియం, అష్టం, వడ, అత్తిరసం, మనోహరపడి ప్రసాదాలను ప్రవేశపెట్టారు. వీటిలో వడ మినహా మరి ఏది ఎక్కువ రోజులు నిల్వ ఉండే పరిస్థితి లేకపోవడంతో వడకు డిమాండ్ పెరిగింది. ఇది గుర్తించిన అప్పటి మద్రాస్ ప్రభుత్వం 1803 నుంచి శ్రీవారి ఆలయంలో ప్రసాదాలను విక్రయించడం ప్రారంభించింది. అప్పుడే లడ్డుకు ముందు రూపమైన బూందీ ని ప్రసాదంగా విక్రయించడం ప్రారంభమైంది. అది కాస్త చివరకు 1940లో లడ్డుగా స్థిరపడింది.
ఇక 1950లో తిరుమల తిరుపతి దేవస్థానము పాలకమండలి పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా లడ్డూ తయారీకి వాడాల్సిన సరుకుల మోతాదు దిట్టంను పెంచుతూ వచ్చింది. వాస్తు ప్రకారం ఆగ్నేయ మూల ఆలయంలో నిర్మించిన పోటులో ప్రసాదాలు తయారు చేస్తుండగా, శ్రీవారి పోటుకు ముందు శ్రీనివాసుని తల్లి వకుళ మాత కొలువై ఉంటుంది. తల్లి రుచి చూసిన తర్వాతే అన్నట్లు పోటులో తయారుచేసిన ప్రసాదాలను వకుళ మాత ముందు కొంతసేపు ఉంచిన తర్వాత స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఆలయంలోని సంపంగి ప్రాకారం ఉత్తరభాగాన తయారు చేస్తున్న లడ్డు అన్నింటా తనదే అగ్రస్థానం అంటోంది.
ఆస్థానం లడ్డు, కళ్యాణోత్సవం లడ్డు, ప్రోక్తం లడ్డు అని మూడు రకాల లడ్డూలను తయారు చేస్తున్న టీటీడీ ఆస్థానం లడ్డును ప్రత్యేక ఉత్సవాల సందర్భాల్లోనే తయారు చేస్తోంది. 750 గ్రాముల బరువు ఉండే ఈ లడ్డును కేవలం గౌరవ అతిథులకు మాత్రమే అందిస్తుంది. దీన్ని దిట్టం లో ఖరారు చేసిన మోతాదు కన్నా ఎక్కువ నెయ్యి ముంత మామిడి పప్పు, కుంకుమపువ్వుతో ప్రత్యేకంగా తయారు చేస్తున్న టీటీడీ కల్యాణోత్సవం లడ్డును ఆర్జిత సేవలో పాల్గొనే గృహస్థులకు అందజేస్తుంది. ఇక చిన్న లడ్డు కంటే రుచికరంగా ఉండే కళ్యాణం లడ్డు ధర రూ. 200 కాగా మూడో రకం లడ్డూ నే భక్తులకు లభించే లడ్డు ప్రసాదం. ఈ లడ్డు ధర ప్రస్తుతం రూ. 50 కాగా ఈ లడ్డు బరువు 175 గ్రాముల వరకు ఉంటుంది.
1940 తొలి రోజుల్లో లడ్డూ రేటు 8 అణాలే ఉండగా ఆ తరువాత రెండు రూపాయలకు విక్రయించగా మెల్లమెల్లగా నాలుగైదు ఆపై పది రూపాయలకు పెరిగింది. ఆ తర్వాత రూ. 25 లకు పెరిగింది. ఇప్పుడు అది ఏకంగా రూ. 50 లకు లడ్డూ ధర పెరిగింది. అయినా దాని కున్న డిమాండ్ మాత్రం అంతా ఇంతా కాదు. పరమ పవిత్రంగా భావించే భక్తులకు శ్రీవారి లడ్డు అంటే అమితమైన ప్రేమ. అంతేకాదు అంతకంటే ఎక్కువ భక్తి భావం. తిరుమల కొండకు వచ్చే భక్తులు స్వామి దర్శనానికి ఎంత ప్రాధాన్యం ఇస్తారో ఆయన లడ్డు ప్రసాదానికి అంతే ప్రాధాన్యం ఇస్తున్నారు శ్రీవారి భక్తులు.
ఇక ఏటా టీటీడీ లడ్డు ప్రసాదాల విక్రయం ద్వారా దాదాపు రూ. 500 కోట్లు ఆదాయాన్ని పొందుతోంది. తిరుమలేశుని ప్రసాదాల తయారీకి ఏటా వేలాది మెట్రిక్ టన్నుల ముడి పదార్థాలను కొనుగోలు చేస్తుంది. ఇందుకోసం టిటిడి ఏటా రూ. కోట్లలో నిధుల్ని ఖర్చు చేస్తుండగా ఇందులో శ్రీవారి లడ్డు సింహభాగం లడ్డు తయారు తయారీకే వినియోగిస్తుంది. ప్రస్తుతం ఒక్కో చిన్న లడ్డు తయారీకి దాదాపు రూ 48 ఖర్చవుతుండగా సామాన్య భక్తుడిని దృష్టిలో ఉంచుకుని ఉచిత దర్శనానికి వెళ్లే వారికి ఉచిత లడ్డును ఇస్తోంది. శ్రీవారి దర్శనం చేసుకోక పోయిన ఆధార్ కార్డు చూపిస్తే, మరో రెండు లడ్డులను టీటీడీ విక్రయిస్తోంది.
కోట్లాది మంది భక్తులు స్వీకరించే మహా ప్రసాదం లడ్డూ మధుర్యానికి భక్తకోటి ఫిదా అవుతోంది. దాదాపు 310 ఏళ్లు నిండిన లడ్డు మాధుర్యం ఇప్పుడు మరింత నాణ్యత రుచితో స్వచ్ఛమైన నెయ్యితో భక్తులకు అందుతోంది. శ్రీవారి పోటులో ఉన్న 600 మంది పోటు సిబ్బందితో శ్రీవారి ప్రసాదాలు తయారవుతుండగా దిట్టం ప్రకారం తయారవుతున్న లడ్డులు గుమగుమలాడుతున్నాయి. పోటులోని దిట్టం ప్రకారం 5100 లడ్డూల తయారీకి మొత్తం 803 కేజీల ముడి సరుకులు వినియోగిస్తున్న టి టి డి అందులో ఆవు నెయ్యి 165 కేజీలు, శెనగపిండి 180 కేజీలు, చక్కెర 400 కేజీలు, ముంతమామిడి పప్పు 30 కేజీలు, ఎండు ద్రాక్ష 18 కేజీలు, కలకండ 8 కేజీలు, యాలకులు 4 కిలోలు, పచ్చ కర్పూరం వినియోగిస్తోంది. రోజుకు దాదాపు 15 మెట్రిక్ టన్నుల నెయ్యి ని వినియోగిస్తున్న టీటీడీ రోజు 300 లక్షల లడ్డూలను తయారుచేస్తోంది. పోటులో పనిచేసే 600 మంది సిబ్బందిలో 500 మంది వరకు శ్రీ వైష్ణవులు ఉండగా మరో వంద మంది కాంట్రాక్టు సిబ్బంది చేతిలో శ్రీవారి ప్రసాదాల తయారీ జరుగుతోంది.ప్రతి నెలా దాదాపు 1.10 కోట్ల లడ్డూలను విక్రయిస్తున్న టిటిడి రోజు శ్రీవారిని దర్శించుకునే భక్తులకు లడ్డులోని మాధుర్యాన్ని పంచిపెడుతుంది.
ఇలా వెంకన్న ప్రసాదాల్లో తిరుగులేని ప్రసాదంగా గుర్తింపును సొంతం చేసుకున్న లడ్డు ప్రసాదం పేటెంట్ హక్కులను కూడా సాధించుకుంది. టీటీడీ మాజీ ఈవో రమణచారి అప్పట్లో తిరుమల లడ్డుకు మేదోసంపత్తి హక్కులు పొందేందుకు చేసిన విశేష కృషి ఫలితంగానే 2009 సెప్టెంబర్ 18 న పేటెంట్ హక్కు లడ్డు సొంతం అయ్యింది. లడ్డు తయారీ విధానం రుచి నిల్వ సామర్థ్యం లాంటి అంశాలను ప్రధానంగా పరిశీలించిన చెన్నైలోని జియోగ్రాఫికల్ ఇండికేటర్ రిజిస్ట్రీ విభాగం వెంకన్న లడ్డును తన జాబితాలో చేర్చుకుంది.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
మరిన్ని ఆధ్యాత్మికం వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..