
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడి ఆలయంలో నిత్య కళ్యాణం పచ్చ తోరణం. ఇక స్వామివారికి జరిపే బ్రహ్మోత్సవాలకు ఎంతో విశిష్టత ఉంది. స్వయంగా సృష్టి కర్త అయిన బ్రహ్మదేవుడే శ్రీవారికి బ్రహ్మోత్సవాలు జరిపించినట్లు భవిష్యోత్తర పురాణం పేర్కొంటోంది. తొమ్మిది రోజుల పాటు ఈ ఉత్సవాలు కన్నులపండువగా జరుగుతాయి. ఈ ఉత్సవాలను దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు తిరుమలకు తండోపతండాలుగా వస్తారు. ఈ బ్రహ్మోత్సవాలను కనులారా తిలకించి.. భక్తిపారవశ్యంతో పునీతులవుతారు. ఈ ఏడాది శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 24వ తేదీన ప్రారంభం అయి అక్టోబర్ 02వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 23వ తేదీ సాయంత్రం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.
శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సెప్టెంబర్ 16వ తేదిన శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలకు ముందు మంగళవారం రోజున ఆలయాన్ని శుద్ధి చేస్తారు.
బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యే తొలిరోజున ఉదయం స్వామివారికి సుప్రభాత, తోమాలసేవలు జరిగాక శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామికి ఏకాంతంగా తిరుమంజన ప్రక్రియ చేసి, నైవేద్యం సమర్పిస్తారు. ఆలయసన్నిధిలోని ధ్వజస్తంభంమీద పతాకావిష్కరణ చేస్తారు. బ్రహ్మోత్సవాలు జరిగీ తొమ్మిది రోజులు ప్రతి రోజు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు , సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వాహన సేవలు ఉంటాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
(నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.)