పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల శేషాచల అడవుల్లోని పుణ్యతీర్థాల్లో ఒకటైన శ్రీ కుమారధార తీర్థ ముక్కోటిని ఏ ఏడాది మార్చి 7వ తేదీ న నిర్వహించనున్నామని టీటీడీ అధికారులు చెప్పారు. ఈ తీర్ధంలో స్నానమాచరించడానికి భారీ సంఖ్యలో హాజరవుతారని అంచనా వేస్తున్నామని.. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కుమార ధార తీర్ధానికి సంబంధించిన వరహ, మార్కండేయ, పద్మ, వామన పురాణాల ప్రాకారం అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి.
వరహ, మార్కండేయ పురాణాల ప్రకారం..
ఒక వృద్ద బ్రాహ్మణుడు శేషాచల గిరుల్లో ఒంటరిగా సంచరిస్తుండేవాడు. ఒకానొక సమయంలో శ్రీ వేంకటేశ్వరస్వామి వారు ప్రత్యక్షమై ఆ వృద్ధ బ్రహ్మనుడితో ”ఈ వయస్సులో చెవులు వినిపించవు, కళ్లు కనిపించవు.. అడవిలో ఏంచేస్తున్నావు” అని ప్రశ్నించారు. దీంతో ఆ వృద్ధుడు.. తాను యజ్ఞయాగాలు ఆచరించి దైవరుణం తీర్చుకోవాలనే తలంపుతో ఉన్నాను అని స్వామివారికి చెప్పాడు. అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడిపై కరుణ కలిగిన శ్రీవారు.. ఒక సలహా ఇచ్చారు. అక్కడ ఉన్న తీర్ధంలో ఆ వృద్ధుడికి స్నానమాచరించమని చెప్పారు. దీంతో ఈ తీర్ధంలో వృద్ధుడు స్నానమచరించగా 19 ఏళ్ల నవ యువకుడిగా మారిపోయాడు. అలా ముసలి వయసు నుంచి కౌమార్యంలోకి మారిపోవడం వల్ల ఈ తీర్థానికి ‘కుమార ధార’ అనే పేరు వచ్చిందని పురాణాలు పేర్కొన్నాయి.
పద్మ, వామన పురాణాల ప్రకారం..
దేవలోకం సేనాధిపతి కుమారస్వామి రాక్షసుడైన తారకాసురిడి సంహారం తరువాత శాపవిమోచనం కోసం ప్రయత్నించాడు. శివుని సూచన మేరకు శేషాచల పర్వాతాల్లోని వృషాద్రిలో తపస్సు చేశాడు. అనంతరం ఈ తీర్ధంలో కుమారస్వామి స్నానమాచరించి శాపవిమోచనం పొందడు. సాక్షత్తు కుమారస్వామివారు స్నానం చేయడం వల్ల ఈ తీర్థానికి ‘కుమారధార’ అనే పేరు స్థిరపడిందని వామన, పద్మ పురాణాలు పేర్కొన్నాయి.
ఈ తీర్థంలో స్నానం చేసి తమ శక్తి మేరకు దానాలు చేసిన వారికి ఉత్తమగతులు లభిస్తాయని భక్తుల నమ్మకం. కనుక కుమార తీర్ధ ముక్కోటికి భారీ సంఖ్యలో భక్తులు తీర్ధంలో స్నానమాచరిస్తారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..