Tirumala: శ్రీవారి ఆన్ లైన్ దర్శన టికెట్ల బుకింగ్‌పై తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో రిలయన్స్ జియో సంస్థ ప్రతినిధులతో టీటీడీ బోర్డు సమావేశమయ్యింది. ఈ సమావేశంలో దర్శన టికెట్ల ఆన్ లైన్ బుకింగ్ పై జియో ప్రతినిధులు తమ ప్రెజెంటేషన్ ను ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల దర్శన బుకింగ్, వసతి, భోజన సౌకర్యాలు కల్పించేలా ప్రత్యేక యాప్ అభివృద్ధికి రిలయన్స్ జియోతో టీటీడీ ఒప్పందం చేసుకుందని టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి చెప్పారు. కరోనా వైరస్ కల్లోలం నుంచి శ్రీవారి దర్శన టికెట్ల.. ఆన్ లైన్ బుకింగ్ ప్రాధాన్యత సంతరించుకుంది. స్వామివారి దర్శనం చేసుకోవాలంటే టికెట్స్ తప్పని సరి చేయడంతో ఆన్ లైన్ లో దర్శన టికెట్ల కోసం భక్తులు పోటీ పడుతున్నారు. దీంతో ఒకటిన్నర సంవత్సరంగా సర్వర్ల సమస్యలు తలెత్తు ఇబ్బందులు కలిగిస్తున్నాయి.
గత కొన్ని సంవత్సరాల నుండి టీటీడీకి టీసీఎస్ సంస్థ సాంకేతిక సహకారం అందిస్తోంది. అయితే కరోనా వల్ల ఆన్ లైన్ లో శ్రీవారి దర్శన టికెట్ల డిమాండ్ కు అనుగుణంగా టీసీఎస్ సంస్థ సహకారం అందించలేని పరిస్థితి ఏర్పడిందని సుబ్బారెడ్డి చెప్పారు. దీంతో తాము భక్తులకు మెరుగైన సేవల కోసం రిలయన్స్ జియో సంస్థను సంప్రదించామని తెలిపారు. దీంతో శ్రీవారిసేవలో భాగంగా టీసీఎస్ కంటే మెరుగైన సేవలను టీటీడీకి ఉచితంగా అందిస్తామని రిలయన్స్ జియో సంస్థ ముందుకొచ్చిందని అన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు తలెత్తకుండా జియో క్లౌడ్ ప్లాట్‌ఫామ్ ను వినియోగించి గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టును అభివృద్ధి చేసి ఉచితంగా ఇస్తామని జియో సంస్థ హామీనిచ్చిందని అన్నారు. ఈ నేపథ్యంలో దర్శన బుకింగ్, వసతి, భోజన సౌకర్యాలు కల్పించేలా ప్రత్యేక యాప్ ను రిలయన్స్ జియో అభివృద్ధి చేస్తోందన్నారు. త్వరలోనే భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు జియో సంస్థతో ఒప్పందం చేసుకున్నామని టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. ఇకపై శ్రీవారి దర్శన టికెట్ల ఆన్ లైన్ బుకింగ్ కు ఎలాంటి ఇబ్బందులు ఉండవని అన్నారు.
Also Read: ఇప్పటివరకూ గోల్డెన్ స్పూన్‌తో సాగిన ఆర్యన్ ఖాన్ జీవితం.. రేపటి నుంచి ఎలా ఉండనున్నదంటే..
దేశ విదేశీయులను ఆకర్షించే మైసూర్ దసరా ఉత్సవాలకు 411 ఏళ్ల ఘన చరిత్ర..