Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zodiac Signs: విదేశీ యానం ఎవరెవరికి?.. ఈ ఏడాది రాశులవారికి ఎలా ఉండబోతుందంటే..

ఈ ఏడాది ఏ ఏ రాశుల వారు ఏ ఏ కారణాల మీద విదేశీయానం చేస్తారనేది పరిశీలించవలసిన విషయం. మేషం, కర్కాటకం, తుల, మకర రాశుల వారికి ఈ ఏడాది అనివార్యంగా విదేశీయాన అదృష్టం పట్టబోతోంది. కొద్దిగా మీన రాశి వారికి కూడా ఆ అవకాశం కనిపిస్తోంది.

Zodiac Signs: విదేశీ యానం ఎవరెవరికి?.. ఈ ఏడాది రాశులవారికి ఎలా ఉండబోతుందంటే..
Zodiac
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Ravi Kiran

Updated on: Feb 10, 2023 | 10:41 AM

సాధారణంగా విదేశాలకు వెళ్లడానికి ప్రతివారు ఆసక్తి చూపిస్తుంటారు. విదేశాలకు వెళ్లడం అనేది ఎంతో అదృష్టంగా, వరంగా భావిస్తుంటారు. ఇన్ని కోట్ల మంది ప్రజలలో విదేశాలకు వెళ్లడం అనేది అందరికీ సాధ్యం కాని విషయం. ఇక విదేశాలకు ఏ కారణం మీద వెళతారు అనేది కూడా ఆలోచించాల్సిన విషయం. ఉన్నత విద్య, ఉద్యోగం, వ్యాపారం, పర్యాటకం, ఆరోగ్యం వంటి కారణాలు విదేశీయానంలో కనిపిస్తాయి. కారణం ఏదైనప్పటికీ విదేశీ యానంలో ఉన్న ఆనందం అనుభవించడం నిజంగా ఒక అదృష్టం అనే చెప్పాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఏ ఏ రాశుల వారు ఏ ఏ కారణాల మీద విదేశీయానం చేస్తారనేది పరిశీలించవలసిన విషయం. మేషం, కర్కాటకం, తుల, మకర రాశుల వారికి ఈ ఏడాది అనివార్యంగా విదేశీయాన అదృష్టం పట్టబోతోంది. కొద్దిగా మీన రాశి వారికి కూడా ఆ అవకాశం కనిపిస్తోంది.

మేష రాశి

ఈ రాశి వారు ఈ ఏడాది ప్రధానంగా ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఉన్నత విద్య కోసం కూడా విదేశాలకు వెళ్లే సూచనలు ఉన్నాయి. ఫిబ్రవరి నెల తర్వాత ఈ విదేశీయానం ఏదో ఒక రోజున అకస్మాత్తుగా జరిగే అవకాశం ఉంది. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లిన వారు అక్కడే స్థిరపడటానికి వీలుంది. మేష రాశి వారు ఏ ఒక్క దేశానికో కాకుండా అనేక దేశాలను చుట్టి వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. వీరికి విదేశాలకు వెళ్లడానికి గురువు, రాహువు, కుజుడు అవకాశం కల్పిస్తున్నాయి. ఈ ఏడాది వీరికి తప్పకుండా విదేశీ సంపాదన ఉండబోతోంది.

కర్కాటక రాశి

ఈ రాశి వారు ఈ ఏడాది వ్యాపార విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ విదేశాలకు వెళ్లే సూచనలు ఉన్నాయి. కేవలం పర్యాటకులుగా వెళ్లే అవకాశం కూడా ఉంది. వీరికి ఈ విదేశీయాన అవకాశం రెండు మూడు సార్లు కలిగే సూచనలు కూడా ఉన్నాయి. ఇది ఫిబ్రవరి తర్వాత నుంచి తప్పకుండా వీరి జీవితంలో చోటు చేసుకుంటుంది. ఈ రాశి వారికి ఈ ఏడాది విదేశీ ధనం సంపాదించే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో గనక వీరు విదేశాలకు వెళ్లే పక్షంలో క్షేమంగా తిరిగి రావడానికి అవకాశం ఉంది. వ్యాపారంలో కూడా పెట్టుబడులు పెరగడానికి, విస్తరణ చేపట్టడానికి వీలుంది. వ్యాపార పరంగా శిక్షణ పొంది రావడం కూడా జరగవచ్చు.

ఇవి కూడా చదవండి

తులా రాశి

ఈ రాశి వారు ముఖ్యంగా వ్యాపార నిమిత్తం ఇతర దేశాలు పర్యటించే అవకాశం ఉంది. విదేశీ సాంకేతిక పరిజ్ఞానం కోసం కొన్ని దేశాలకు వెళ్లి రావలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగరీత్యా లేదా పర్యాటకపరంగా కూడా విదేశాలకు వెళ్లడానికి అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఏదో ఒక దేశంలో స్థిరపడటానికి అవకాశం కనిపించడం లేదు. ఉద్యోగరీత్యా వెళ్ళినప్పటికీ అతి తక్కువ కాలంలో తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. ఉన్నత విద్య కోసం ఈ ఏడాది విదేశాలకు వెళ్లే విద్యార్థులు అక్కడ స్థిరపడే అవకాశం తక్కువ. స్థిర నివాసానికి ప్రస్తుతం అవకాశం కనిపించడం లేదు. విదేశాలలో వీరికి ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవ మర్యాదలు లభించే సూచనలు కూడా ఉన్నాయి.

మకర రాశి

ఈ రాశి వారికి ఏడాది విదేశీయానం తప్పకుండా జరుగుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారు సాంకేతిక విద్యలో రాణించి ఉన్నట్టయితే వీరు తమకు ఇష్టమైన దేశంలో స్థిరనివాసం ఏర్పరచుకొనే అవకాశం ఉంది. విదేశీ సంస్థల నుంచి వీరికి మంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. కొద్దిపాటి ప్రయత్నంతో వీసా సమస్యలు కూడా పరిష్కారం అయ్యే సూచనలు ఉన్నాయి. పర్యాటకంగానూ, ఆరోగ్యపరంగానూ తాత్కాలికంగా విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఇటువంటి ప్రయాణాలను వీరు జయప్రదంగా పూర్తి చేసుకుని వస్తారు. మొత్తానికి వీరికి ఈ ఏడాది నుంచి విదేశీ సంపాదన గడించే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి నెల నుంచి వీరికి ఈ అదృష్టం పట్టబోతోంది.

మీన రాశి

గురువు, శని, రాహు గ్రహాల అనుకూలత వల్ల వీరికి విదేశీయానయోగం పట్టే అవకాశం ఉంది. సాధారణంగా ఉన్నత విద్య, ఆధ్యాత్మిక వ్యవహారాలు, పర్యాటకం వంటి కారణాలవల్ల వీరు ఇతర దేశాలకు వెళ్లడానికి అవకాశం ఉంది. కొన్ని రకాలైన ఆటంకాలు, అవరోధాలు ఎదురైనప్పటికీ వీరు ఏప్రిల్ తరువాత కొద్ది కాలం పాటు విదేశాలకు వెళ్లి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. విదేశీ యానం సందర్భంగా వీరు మంచి పేరు తెచ్చుకునే సూచనలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ రాశి వారు విదేశాలలో స్థిరపడే అవకాశం లేదు కానీ, రెండు మూడు దేశాలకు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడే సూచనలు మాత్రం ఉన్నాయి. ఈ రాశికి చెందిన సాంకేతిక పరిజ్ఞాన నిపుణులకు విదేశీ సంస్థలలో లేదా బహుళ జాతి సంస్థలలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది.