Vijayawada: పది రోజుల పాటు వైభవంగా దసరా ఉత్సవాలు.. వేడుకలకు ముస్తాబవుతున్న ఇంద్రకీలాద్రి

దసరా ఉత్సవాలంటే ముందుగా గుర్తుకొచ్చేది విజయవాడ (Vijayawada) ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గామల్లేశ్వర స్వామి ఆలయంలో జరిగే వేడుకలే. అయితే ఈ సారి పది రోజుల పాటు అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరపాలని దేవస్థానం..

Vijayawada: పది రోజుల పాటు వైభవంగా దసరా ఉత్సవాలు.. వేడుకలకు ముస్తాబవుతున్న ఇంద్రకీలాద్రి
Dussehra Celebrations

Updated on: Sep 01, 2022 | 1:39 PM

దసరా ఉత్సవాలంటే ముందుగా గుర్తుకొచ్చేది విజయవాడ (Vijayawada) ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గామల్లేశ్వర స్వామి ఆలయంలో జరిగే వేడుకలే. అయితే ఈ సారి పది రోజుల పాటు అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరపాలని దేవస్థానం అధికారులు నిర్ణయించారు. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 5 వరకూ దసరా ఉత్సవాలు జరుగుతాయని ఆలయ ఈవో భ్రమరాంబ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ ఏడాది 10 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తామని, పది రోజుల పాటు పది అలంకారాల్లో అమ్మవారి దర్శనం ఉంటుందని తెలిపారు. మూలా నక్షత్రం రోజున ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS.Jagan) అమ్మ వారిని దర్శించుకుంటారని చెప్పారు. దసరా మహోత్సవాలకు టెండర్లు పూర్తయ్యాయని, పనులు ప్రారంభమయ్యాయని వివరించారు. రూ.80 లక్షలతో ప్రత్యేకంగా విద్యుద్ధీకరణ, ఘాట్ రోడ్లలో క్యూలైన్ల నిర్మాణం చేపట్టామన్నారు. కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈసారి ఉత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. భక్తులకు అన్ని రకాల దర్శనాలు ఉంటాయని, బ్రేక్ దర్శనాలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ప్రసాదం కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని, తిరుమల తరహాలో నాణ్యమైన లడ్డూలు అందిస్తామన్నారు. గతంలో మాదిరిగానే నగరోత్సవం నిర్వహిస్తామని, భవానీల మాల వితరణకు అవకాశం లేదని స్ఫష్టం చేశారు.

అమ్మవారి దర్శనానికి రాష్ట్రం నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రోజూ 30 వేల మందికి పైగా అమ్మవారి దర్శనానికి వస్తారని, మూలా నక్షత్రం రోజు 2 లక్షల మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ఎటువంటి ఆటంకాలు, ఏర్పాట్లు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. పోలీస్, రెవెన్యూ , మున్సిపల్, వైద్య ఆరోగ్య, ఆర్అండ్ బీ, పీడబ్ల్యూడీ, అగ్నిమాపక , ఇరిగేషన్, మత్స్య , సమాచార పౌర సంబంధాలు తదితర శాఖ అధికారుల సమన్వయం చేసుకుని ఉత్సవాలను విజయవంతం జరుపుతామని ఆలయ అధికారులు స్పష్టం చేశారు.

కాగా.. గతేడాది దసరా ఉత్సవాల్లో భాగంగా అపశృతి జరిగింది. మూలా నక్షత్రం రోజున అమ్మవారిని దర్శించుకునేందుకు సీఎం జగన్ వచ్చిన సమయంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. మ‌రికాసేప‌ట్లో అమ్మవారికి సీఎం జ‌గ‌న్ ప‌ట్టు వ‌స్త్రాల‌ను స‌మ‌ర్పించేందుకు వ‌స్తుండ‌గా ఈ ఘ‌ట‌న జ‌రిగింది. దీంతో ఇప్పటికే ఘాట్ రోడ్ ను మూసివేసి కొండరాళ్లు దొర్లిప‌డ‌కుండా అధికారులు ముందు జాగ్రత్త చ‌ర్యలు చేప‌ట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.