కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 26 నుంచి మొదలయ్యాయి. నేడు రెండో రోజు సందర్భంగా బుధవారం మలయప్ప స్వామి హంస వాహనంపై తిరుమాఢ వీదుల్లో విహరించారు. ఇందులో భాగంగా స్వామి వీణ ధరించి శ్రీసరస్వతీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. హంస వాహనసేవలో భాగంగా వివిధ కళాబృందాలు చేసిన ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు వేలాదిగా తిరుమలకు తరలివస్తున్నారు. అలాగే స్వామివారిని దర్శించుకుని, పలు సేవల్లో పాల్గొంటున్నారు.
హంసవాహన సేవలో శ్రీవేంకటేశ్వరస్వామి జ్ఞానమూర్తిగా కనిపించాడు. బ్రహ్మ వాహనంగా ప్రసిద్ధిగాంచిన హంస వాహనంపై శ్రీవారు విహరించారు. హంస అంటే జ్ఞానానికి ప్రతీకగా పేర్కొంటారు. హంసలో ఉన్న ప్రత్యేక లక్షణం ఏంటంటే.. నీళ్లను, పాలను వేరుచేసే స్వభావంతో ఇది ప్రత్యేకంగా నిలిస్తుంది. భక్తుల్లో నెలకొన్న అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి, బ్రహ్మపద ప్రాప్తి ప్రసాదించేందుకు మలయప్ప స్వామి హంస వాహనంపై కనిపిస్తాడని పురాణాలు చెబుతున్నాయి.
అలాగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం చిన్న శేష వాహన సేవను నిర్వహించారు. ఈ సేవలో శ్రీ మలయప్ప స్వామి చిన శేషవాహనం పై నుంచి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వాహన సేవను తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. తిరుమాడ వీధుల్లో నిర్వహించిన ఈ సేవకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై తమ ఇష్ట దైవాన్ని మనసారా దర్శించుకున్నారు.
కాగా.. బ్రహ్మోత్సవాల్లో తిరుమల శ్రీవారికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా తిరుపతి చేరుకున్న ముఖ్యమంత్రి ముందుగా గంగమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సీఎం జగన్‌కు మంత్రులు పెద్దిరెడ్డి, ఆర్‌కే రోజా, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తదితరులు స్వాగతం పలికారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..