Sri Rama Navami: శ్రీ రామ నవమి 2025 తేదీ, సమయం, పూజ విధానం, ప్రాముఖ్యత తెలుసా
శ్రీ రామ నవమికి హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. శ్రీ రామ నవమి పండుగను శ్రీరాముని జన్మదినోత్సవంగా జరుపుకుంటారు. ఈ రోజున శ్రీ రామునికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ సంవత్సరం రామ నవమి పండుగను ఏ రోజున జరుపుకుంటారు? పూజ విధానం, ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం..

శ్రీ రాముడు లోక రక్షకుడైన శ్రీ మహా విష్ణువు ఏడవ అవతారం. దేవుడైన విష్ణువు.. మానవుడు రాముడిగా జన్మించి తన నడక, నడతతో దేవుడిగా పూజించపబడుతున్నాడు. రాముడంటే ఒక నమ్మకం. అటువంటి రామయ్య జన్మ దినోత్సవాన్ని ఆ సేతు హిమాచలం ఎంతో ఘనంగా జరుపుకుంటుంది. శ్రీరాముడు చైత్ర మాసం శుక్ల పక్షం తొమ్మిదవ రోజున జన్మించాడు. అందుకే ప్రతి సంవత్సరం చైత్ర మాసం తొమ్మిదవ రోజున శ్రీ రామ నవమి పండుగ జరుపుకుంటారు.
శ్రీ రాముడి ఆశీస్సులు పొందడానికి శ్రీ రామ నవమి రోజు అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున భక్తులు రాముడికి ప్రత్యేక పూజలు చేస్తారు. హిందూ విశ్వాసాల ప్రకారం రామనవమి రోజున రాముడిని పూజించే వారి జీవితంలోని కష్టాలు, సమస్యలు తొలగిపోతాయి. రాముని కృపని పొందుతారు. అటువంటి పరిస్థితిలో 2025 సంవత్సరంలో రామ నవమి పండుగ ఎప్పుడు జరుపుకుంటారు.. పూజా విధానం.. ప్రాముఖ్యత ఏమిటి?
ఈ సంవత్సరం శ్రీ రామ నవి ఎప్పుడంటే
హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్ర మాసంలోని శుక్ల పక్ష నవమి తిథి ఏప్రిల్ 5న సాయంత్రం 7:26 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిథి మరుసటి రోజు ఏప్రిల్ 6న సాయంత్రం 7:22 గంటలకు ముగుస్తుంది. హిందూ మతంలో ఉదయ తిథి ని పరిగణలోకి తీసుకుంటారు. కనుక ఉదయం తిథి ప్రకారం ఈసారి శ్రీ రామ నవమి 2025 ఏప్రిల్ 6న జరుపుకోనున్నారు.
శ్రీ రామ నవమి పూజా విధానం
శ్రీ రామ నవమి రోజున ఉదయమే నిద్రలేచి స్నానం చేయాలి. దీని తరువాత శుభ్రమైన దుస్తులు ధరించాలి. తరువాత పూజా స్థలాన్ని శుభ్రం చేయాలి. తరువాత ఒక స్టూల్ మీద ఒక గుడ్డను పరిచి, దానిపై రాముడి విగ్రహం లేదా చిత్రపటాన్ని ఉంచాలి. గంగా జలం, పంచామృతం, పువ్వులు మొదలైనవి రాముడికి సమర్పించాలి. దేవునికి పసుపు పండ్లు, చలిమిడి, పానకం, వడపప్పుని నైవేద్యంగా సమర్పించాలి. రామచరిత మానస్ ను లేదా సుందరకాండ ను పారాయణం చేయాలి. చివరికి శ్రీ రామునికి హారతి ఇచ్చి పూజను ముగించాలి. దీని తరువాత పేదలకు, నిరుపేదలకు విరాళాలు ఇవ్వాలి.
శ్రీ రామ నవమి ప్రాముఖ్యత
హిందూ మతంలో శ్రీ రామ నవమికి గొప్ప ప్రాముఖ్యత ఉంది. రామనవమి రోజున పూజ చేయడం వల్ల ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు. ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహం పెరుగుతుంది. ఈ రోజున పూజ చేయడం ద్వారా లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది. దీనివల్ల ఇంట్లో సంపద పెరుగుతుంది. సీతా దేవి.. లక్ష్మీ దేవి స్వరూపం. అటువంటి పరిస్థితిలో రామనవమి రోజున శ్రీరాముడితో పాటు సీతాదేవిని పూజిస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు