Spiritual-Heaven: స్వర్గ సీమకు దారెటు? స్వర్గం, నరకం అనేవి ఉన్నాయా? పురాణాలు ఏం చెబుతున్నాయి..?

స్వర్గం, నరకం అనేవి ఉన్నాయా? మరణించిన తర్వాత జీవులు వారి వారి ప్రారబ్ద కర్మలను బట్టి స్వర్గానికో, నరకానికో వెళ్ళటం అనేది నిజంగా జరుగుతుందా? వీటిని ఎవరైనా చూశారా? పురాణ కాలం నుంచి జిజ్ఞాసువులు వీటి గురించి ఆలోచిస్తూనే ఉన్నారు అనడంలో సందేహం..

Spiritual-Heaven: స్వర్గ సీమకు దారెటు? స్వర్గం, నరకం అనేవి ఉన్నాయా? పురాణాలు ఏం చెబుతున్నాయి..?
Follow us

| Edited By: Subhash Goud

Updated on: Jan 02, 2023 | 7:00 AM

స్వర్గం, నరకం అనేవి ఉన్నాయా? మరణించిన తర్వాత జీవులు వారి వారి ప్రారబ్ద కర్మలను బట్టి స్వర్గానికో, నరకానికో వెళ్ళటం అనేది నిజంగా జరుగుతుందా? వీటిని ఎవరైనా చూశారా? పురాణ కాలం నుంచి జిజ్ఞాసువులు వీటి గురించి ఆలోచిస్తూనే ఉన్నారు అనడంలో సందేహం లేదు. ఆధ్యాత్మికంగానే కాక భౌతికంగా కూడా చాలామంది వీటి మీద పరిశోధనలు చేశారు. టిబెట్ దేశానికి చెందిన బౌద్ధ బిక్షువు, మాజీ దలైలామా ట్యూస్డే లోబ్సాంగ్ రాంపా అనే ఆయన దీనిమీద, ముఖ్యంగా స్వర్గం మీద పరిశోధనలు చేసి ఒక గ్రంథం కూడా రాశారు. ఆధ్యాత్మికవేత్తలు, జ్ఞానులు చెప్పిన దాని ప్రకారం స్వర్గమైనా, నరకమైనా అదొక మానసిక స్థితే తప్ప, వాస్తవంలో అటువంటివి ఏమీ లేవు. వారి దృష్టిలో స్వర్గం అంటే మనసు బ్రహ్మానందంలో మునిగి తేలటం. అక్కడ మనసు నిశ్చలంగా, నిర్మలంగా శాశ్వతమైన ఆనందంలో కలిసిపోయి ఉంటుంది. నరకం అంటే మనసంతా బాధలతో, అలజడిగా, అశాంతిగా ఉంటుంది.
అయితే, గరుడ, బ్రహ్మాండ, కార్తీక పురాణాల్లో మాత్రం స్వర్గసీమ గురించి రకరకాలుగా అభివర్ణించడం జరిగింది. స్వర్గసీమ అనేది ఒకటుందని అవి చెబుతున్నాయి. అక్కడికి వెళ్లిన తరువాత బ్రహ్మానందం అనేది అనుభవం అవుతుందని అవి తెలియజేస్తున్నాయి. విచిత్రం ఏమంటే, స్వర్గసీమ గురించి ఈ పురాణాల్లోనూ, మహాభారతంలోనూ అనేక వివరాలు ఉన్నాయి. స్వర్గసీమకు వెళ్లే దారిలో కనిపించే కొన్ని ప్రాంతాల గురించి కూడా వీటిలో వివరాలను పొందుపరిచారు. నిజానికి వీటిని బట్టి మనం స్వర్గసీమకు ఒక రూట్ మ్యాప్ ను కూడా తయారు చేసుకోవచ్చు. పాండవులు ఈ మార్గం గుండా నే స్వర్గసీమకు చేరుకున్నట్టు మహాభారతంలో రాసి ఉంది.
భారతంలో పేర్కొన్న వివరాల ప్రకారం, స్వర్గసీమకు మార్గం బదరీనాథ్ నుంచి ప్రారంభం అవుతుంది. బద్రీనాథ్ ఉత్తరాఖండ్లో ఉంది. బదరీనాథ్ కు దగ్గరలో అంటే సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న గ్రామం నుంచి స్వర్గానికి దారి ప్రారంభం అవుతుంది. ఈ గ్రామం చివరి నుంచి సరస్వతీ నది కొంత దూరం ప్రవహించి, అలకనంద నదిలో కలుస్తుంది. ఆ తరువాత ఇది అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. ఇక్కడ ఒక సరస్వతీ దేవి ఆలయం కూడా ఉంది. పాండవులు ఈ ఆలయంలో పూజలు జరిపించారని ప్రతీతి.
ఈ సరస్వతీ నది పక్కన భీమ్ పూల్ అనే ఒక పెద్ద రాతి బండ ఉంది. పాండవులు ఈ నదిని దాటడానికి భీమసేనుడు ఈ బండను వంతెన కింద మార్చాడు. ఈ వంతెనను దాటిన తరువాత అసలైన స్వర్గారోహణ మార్గం ప్రారంభం అవుతుంది. అక్కడికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో చత్మోలి అనే గ్రామం ఉంది. ఇది సుమారు 12 వేల అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ గ్రామానికి వెళ్లే ముందు భృగు మహర్షి ఆశ్రమం కనిపిస్తుంది. ఆ ఆశ్రమం దాటి ముందుకు వెళ్లిన తరువాత మాతా దేవి ఆలయం ఉంటుంది. ఆమె నర నారాయణుల తల్లి అని చెబుతారు. ఈ ప్రాంతం 14 వేల అడుగుల ఎత్తులో ఉంటుంది. అది దాటి వెళ్ళిన తరువాత కుబేర్ మకుట్ అనే ప్రాంతం కనిపిస్తుంది. ఇక్కడే కుబేరుడి దగ్గర నుంచి రావణాసురుడు పుష్పక విమానాన్ని లాక్కున్నాడని చెబుతారు.
   ఇక ఇక్కడి నుంచి 5 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత వసుధార అనే జలపాతం వస్తుంది. ఈ జలపాతం సుమారు 120 మీటర్ల ఎత్తు నుంచి పడుతుంటుంది. ఆ ప్రాంతంలో చాలా వేగంగా గాలులు వీస్తుంటాయి. అందువల్ల జలపాతం నుంచి తుంపరలు చాలా దూరం వరకు పడుతుంటాయి. ఆ తుంపరలు మీద పడితే పాపాలు ప్రక్షాళన అవుతాయట. ఇక్కడ ఒకప్పుడు అష్టవసువులు తపస్సు చేశారు. ఇది దాటిన తర్వాతే చత్మొలి గ్రామం వస్తుంది. ఇక్కడ ప్రకృతి సౌందర్యం అద్భుతంగా ఉంటుంది. ఇక్కడే సతోపంత్, భగీరథ కర్క్ అనే రెండు నదులు కలిసి అలకనంద నదిగా రూపాంతరం చెందుతాయి. ఇక్కడికి ఒక కిలోమీటర్ దూరంలో లక్ష్మీ వన్ అనే ప్రాంతం ఉంది. ఇక్కడ లక్ష్మీదేవి, విష్ణుమూర్తి కొంతకాలం తపస్సు చేశారు. అంతేకాదు ఇక్కడే ద్రౌపది తనువు చాలించింది. ఇక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలో బందర్ అనే గ్రామం వస్తుంది. ఇక్కడ ధర్మరాజు దాహాన్ని తీర్చడానికి అర్జునుడు బాణ ప్రయోగం చేశాడు. ఇక్కడికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న చక్ర తీర్థ అనే ప్రాంతంలో అర్జునుడు తనువు చాలించాడు.
ఇక్కడికి మరో రెండు కిలోమీటర్ల దూరంలో సతోపంత్ సరస్సు ఉంది. ఈ సరస్సులో ఏకాదశి రోజున త్రిమూర్తులు వచ్చి స్నానం చేస్తారు. వారి దర్శనం కోసం గంధర్వులు పక్షుల రూపంలో వస్తారని ప్రతీతి. ఇక్కడే భీముడు మరణించాడు. సతోపంత్ నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత స్వర్గారోహణానికి మరో ముఖ్యమైన దారి కనిపిస్తుంది. ఈ మార్గం చాలా కష్టంగానూ, కఠినంగానూ ఉంటుంది. ఇక్కడ చంద్ర కుండ్, సూర్య కుండ్ అనే సరస్సులు ఉంటాయి. ఇక్కడి నుంచి ధర్మరాజు మాత్రమే ఒక కుక్క తోడు రాగా స్వర్గానికి ప్రయాణించాడు. నిజానికి, స్వర్గారోహణం అనేది ఆరు పర్వతాల సమూహం అని చెబుతారు. ఇందులో స్వర్గా రోహిణి అనేది మొదటి పర్వతం. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తర కాశి జిల్లాలో ఉన్న గర్వాల్ హిమాలయ ప్రాంతానికి చెందినది. దీనికి పడమర వైపున గంగోత్రి పర్వత సముదాయం ఉంటుంది. ఈ ఈ స్వర్గారోహిని పర్వతాగ్రం మబ్బుల్లో ఉంటుంది. అక్కడ మూడు మెట్లు కనిపిస్తాయి. అవి ఎక్కి పైకి వెళితే అక్కడ మరో నాగు మెట్లు కనిపిస్తాయి. అవి ఎక్కి వెళితే స్వర్గ ద్వారం దగ్గరకు వెళతారని మహాభారతం చెబుతోంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి