
ఆకాశంలో అత్యంత అరుదైన సంఘటనలలో ఒకటి సూర్యగ్రహణం. ఈఏడాది చివరి గ్రహణం సూర్య గ్రహణం.. అద్భుతమైన పాక్షిక సూర్యగ్రహణంగా సంభవించబోతోంది. ఇది ఒక నిర్దిష్ట కారణంతో చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. ఈ సంఘటన శరదృతువు విషువత్తు ఒక రోజు ముందు ఏర్పడుతుంది. పగలు, రాత్రి సమానంగా ఉంటాయి. అందుకే ఈ సూర్యగ్రహణాన్ని చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తున్నారు. ఈ సూర్యగ్రహణం సమయంలో పూర్తిగా చీకటి ఏర్పడదు. అయితే సూర్యుడు చంద్రవంక ఆకారంలో కనిపిస్తాడు. అందుకనే ఈ గ్రహణం చాలా ప్రత్యేకమైనది. ఈ సూర్యగ్రహణం తేదీ, సమయం, దానిని ఎక్కడ చూడవచ్చో తెలుసుకుందాం.
ఈ సూర్యగ్రహణం ఆదివారం సెప్టెంబర్ 21వ తేదీ, 2025న సంభవిస్తుంది. భారత ప్రామాణిక సమయం ప్రకారం., ఈ గ్రహణం దాదాపు రాత్రి 10:59 నుంచి తెల్లవారుజామున 3:23 (సెప్టెంబర్ 22) వరకు ఉంటుంది. అంటే ఈ సంఘటన అర్థరాత్రి నుంచి మర్నాడు సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ గ్రహణం భారతదేశంలో నేరుగా కనిపించకపోయినా.. ఖగోళ శాస్త్రంపై ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ గ్రహణాన్ని వీక్షించవచ్చు.
ఈ గ్రహణం భారత దేశ సమయం ప్రకారం.. సూర్యోదయం సమయంలో సంభవిస్తుంది. అప్పుడు నెలవంక ఆకారంలో సూర్యుడు క్షితిజ సమాంతరంగా కనిపిస్తాడు. ఈ ప్రత్యేకమైన దృశ్యం చాలా అరుదుగా పరిగణించబడుతుంది. ఎందుకంటే గ్రహణం, సూర్యోదయం ఒకేసారి సంభవించడం చాలా అరుదు. ఇంకా ఈ సంఘటన శరదృతువు విషువత్తుకు ముందు సంభవిస్తుంది. కనుక ఈ గ్రహణ ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది.
సెప్టెంబర్ 21న ఏర్పడే ఈ పాక్షిక సూర్యగ్రహణం దక్షిణ అర్ధగోళంలో మాత్రమే కనిపిస్తుంది. న్యూజిలాండ్, అంటార్కిటికాలోని ప్రజలు ఈ అద్భుతమైన దృశ్యాన్ని ఆస్వాదించగలరు. భారతదేశంలో ఇది స్పష్టంగా కనిపించకపోయినా.. ప్రతి ఒక్కరూ దీన్ని ఆన్‌లైన్‌లో చూడవచ్చు.