Navaratri 2023: శరన్నవరాత్రుల్లో 7వ రోజు.. లలితా త్రిపుర సుందరీ దేవిగా దర్శనం.. పూజ విధానం, నైవేద్యం..
త్రిపుర అనగా ముల్లోకాలు.. సుందరి అనగా అందమైనది. కనుక త్రిపుర సుందరి అంటే ముల్లోకాలను పాలించే సుందరి అని అర్ధం.. త్రిపుర ఉపనిషత్తులో త్రిపుర సుందరి దేవి గురించి వివరించారు. లలిత అనగా ఆటలు ఆడేది అని అర్ధం.. సృష్టి, స్థితి, లయలు దేవి ఆటలే.. శ్రీచక్ర అధిష్టాన శక్తిగా, పంచదశాక్షరీ మహామంత్రాధి దేవతగా తనని కొలిచే భక్తులను, ఉపాసకుల్ని లలితా త్రిపుర సుందరీ దేవి అనుగ్రహిస్తుంది.
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు దేశ వ్యాప్తంగా అత్యంత ఘనంగా జరుపుతున్నారు. నేడు దేవి నవరాత్రుల్లో ఏడవ రోజు. ఆశ్వయుజ శుద్ధ సప్తమి రోజున దుర్గాదేవి.. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంతో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. పూజలందుకుంటున్నారు. సృష్టి, స్థితి లయకారులైన త్రిమూర్తుల కంటే ముందు నుంచి ఉన్న అమ్మవారు కనుక త్రిపుర సుందరిగా సమస్త మండలంతో పూజలను అందుకుంటుంది.
త్రిపుర సుందరి దేవి షోడసి, లలిత , రాజరాజేశ్వరి దశ మహావిద్యలలో ఒక స్వరూపం.. సాక్ష్యాత్ ఆది పరాశక్తి అని పురాణాలు పేర్కొంటున్నాయి. త్రిపుర సుందరి దేవి పదహారేళ్ళ వయసు కల, పదహారు వివిధ కోరికలు కలది కావున షోడసి అని వ్యవహరిస్తారు.
లలితా దేవి స్తోత్రం..
సకుంకుమ విలేపనా మళికచుంబి కస్తూరికాం సమంద హసితేక్షణాం సశరచాప పాశాంకుశామ్ । అశేష జనమోహినీ మరుణమాల్య భూషోజ్జ్వలాం జపాకుసుమ భాసురాం జపవిధౌ స్మరే దంబికామ్ ॥
త్రిపుర అనగా ముల్లోకాలు.. సుందరి అనగా అందమైనది. కనుక త్రిపుర సుందరి అంటే ముల్లోకాలను పాలించే సుందరి అని అర్ధం.. త్రిపుర ఉపనిషత్తులో త్రిపుర సుందరి దేవి గురించి వివరించారు. లలిత అనగా ఆటలు ఆడేది అని అర్ధం.. సృష్టి, స్థితి, లయలు దేవి ఆటలే.. శ్రీచక్ర అధిష్టాన శక్తిగా, పంచదశాక్షరీ మహామంత్రాధి దేవతగా తనని కొలిచే భక్తులను, ఉపాసకుల్ని లలితా త్రిపుర సుందరీ దేవి అనుగ్రహిస్తుంది.
ఆదిశంకరాచార్యులు శ్రీచక్ర యంత్రాన్ని ప్రతిష్టించక ముందు ఈ దేవి ఉగ్ర రూపిణిగా ‘చండీదేవి’గా పూజలను అందుకునేది. శ్రీచక్ర యంత్రం ప్రతిష్టించిన అనంతరం అమ్మ పరమశాంత రూపిణిగా లలితా దేవిగా పిలవబడుతూ భక్తులతో పూజలను అందుకుంటుంది. లక్ష్మీ దేవి, సరస్వతీ దేవి ఇరువైపులా వంటిజామరలతో సేవిస్తూ ఉండగా చిరుమందహాసంతో లలితా దేవి చెరుకు గడను చేతపట్టుకొని, శివుని వక్షస్థలంపై కూర్చొని దర్శినమిస్తుంది.
పంచదశాక్షరీ మహా మంత్ర అధిష్ఠాన దేవతగా లలితా త్రిపురసుందరిని ఆరాధిస్తారు. కుంకుమతో నిత్యపూజలు చేసే మహిళలకు అమ్మవారు మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది.
జపించాల్సిన మంత్రం..
ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనే మంత్రము 108 మార్లు జపించాల్సి ఉంటుంది.
పూజా విధానం..
ఉదయమే నిద్ర లేచి స్నానం చేసిన అనంతరం అమ్మవారి గదిని శుభ్రం చేసి.. పీఠం మీద ఉన్నవారిని గంగ జలంతో శుద్ధి చేయాలి. అనంతరం అమ్మవారిని లలిత సుందరి దేవిగా అలంకరించి శ్రీ చక్రానికి కుంకుమతో పూజ చేయాలి. క్షిరాన్నం, దద్ధోజనం, అల్లం గారెలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి .. హారతినివ్వాలి. అనంతరం ఆ ప్రసాదాన్ని అందరికీ పంచాలి. నవరాత్రుల్లో లలితా దేవిని భక్తి శ్రద్ధలతో పూజించిన భక్తులకు శత్రు భయం లేకుండా చేస్తుంది. ధన ధాన్యాలకు ఆ ఇంట లోటు ఉండదు. ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆయుస్సుని పెంచుతుంది.
శ్రీ లలితా త్రిపురసుందరీ అనుగ్రహం కోసం పాటించాల్సిన శ్లోకం
లలితా త్రిపురసుందరి త్రిపురేశ్యైచ విద్మహే కామేశ్వర్యై చ ధీమహి తన్నోబాలా ప్రచోదయాత్.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.