Makar Sankranti 2024
హిందూ మతంలో అనేక పండగలు పర్వదినాలు.. ప్రతి పండగకు విశిష్టత ఉంటుంది. హిందువులు జరుపుకునే అతి పెద్ద పండగలలో ఒకటి సంక్రాంతి. తెలుగు రాష్ట్రాలతో పాటు అనేక ప్రాంతాల్లో మకర సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు. మూడు రోజుల పాటు జరుపుకునే ఈ పండగలో రెండో రోజు మకర సంక్రాంతి. ఈ రోజు ప్రత్యక్ష దైవం సూర్యనారాయణుడు తన తనయుడు శనిస్వరుడు అధిపతి అయిన మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ కారణంగా మకర సంక్రాంతి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున ప్రధానంగా సూర్య భగవానుని పూజిస్తారు. ఈ పండుగ సూర్య భగవానుడికి అంకితం చేయబడింది. ఈ రోజున సూర్యుడిని ఆరాధించడం వలన సుఖ సంపదలు కలుగుతాయని విశ్వాసం. ఈ రోజున సూర్య భగవానుడిని భక్తితో పూజించి.. అర్ఘ్యం సమర్పిస్తే త్వరలోనే సూర్యుడు వారి కోరికలన్నీ తీరుస్తాడని నమ్మకం.
పురాణాల విశ్వాసాల ప్రకారం మకర సంక్రాంతి రోజున స్నానం, దానధర్మాలు, సూర్యారాధన చేయడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున చేసే దానం అత్యంత విశిష్టమని.. పులగం అన్నం తినడం శ్రేయస్కరమని పెద్దలు చెబుతారు. ఈ నేపధ్యంలో మకర సంక్రాంతి రోజున సూర్య భగవానుని పూజించే సరైన పద్ధతి గురించి ఈ రోజు తెలుసుకుందాం..
పూజా విధానం ఏమిటంటే..
- ఈ ఏడాది జనవరి 15న మకర సంక్రాంతి పండుగ వచ్చింది. ఈ రోజున సూర్య భగవానుడుని, విష్ణువును ఆరాధించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు.
- ఈ రోజు తెల్లవారుజామున నిద్రలేచి సూర్యభగవానుని ఆరాధించి పవిత్ర నదిలో స్నానం చేయండి. నది స్నానం చేయడానికి వీలు కాకపోతే స్నానం చేసే నీటిలో గంగాజలం కలపండి.
- స్నానం చేసిన అనంతరం రాగి పాత్రను తీసుకుని అందులో నీరు పోసి.. ఎరుపు పువ్వులు, అక్షతలను కలపండి. అనంతరం ఆ నీటిని సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. సూర్య భగవానుడికి సంబంధించిన మంత్రాలను పఠిస్తే శుభం కలుగుతుందని విశ్వాసం.
- ఈ రోజున సూర్యభగవానుడు మకరరాశిలోకి ప్రవేశిస్తాడని.. మకరరాశిలోకి ప్రవేశించిన వెంటనే వాతావరణంలో మార్పు వస్తుందని నమ్ముతారు.
- సూర్య భగవానుడిని శివుని మూడు కన్నులలో ఒకటైన త్రినేత్రంతో పోలుస్తారు. మకర సంక్రాంతి రోజున సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవంగా పూజలను అందుకుంటాడు.
- సూర్య భగవానుని పూజించడానికి మకర సంక్రాంతి రోజు అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. కావున ఈ రోజు తప్పకుండా సూర్యుని పూజించండి.
సూర్య భగవానునికి అర్ఘ్యాన్ని ఎలా సమర్పించాలంటే..
- ఎవరి జీవితంలోనైనా సుఖ సంతోషాలు, శాంతి, ఐశ్వర్యం కలగాలంటే మకర సంక్రాంతి రోజున తెల్లవారు జామునే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి ముందుగా స్నానం చేసి స్నానపు నీటిలో గంగాజలం కలపండి.
- గంగాజలం అందుబాటులో లేకపోతే తులసి ఆకులను కూడా వేసుకోవచ్చు. స్నానం చేసిన తరువాత, శుభ్రమైన లేదా కొత్త బట్టలు ధరించి, సూర్య భగవానుడిని ధ్యానం చేయండి. సూర్య నమోస్తు శ్లోకాన్ని 21 సార్లు జపించండి.
- దీని తరువాత సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించడానికి స్వచ్ఛమైన నీటితో ఒక రాగి పాత్రను నింపండి. ఇంటి బాల్కనీ లేదా టెర్రస్‌కు చెప్పులు లేకుండా వెళ్లండి. సూర్య భగవానుని 12 పేర్లను జపించండి. ఆ తర్వాత సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి.
- సూర్యునికి అర్ఘ్య సమర్పణ చేసేటప్పుడు ఓం సూర్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం నమో భాస్కరాయ నమః అని మంత్రాలను పఠించండి. అర్ఘ్య సమర్పయామి అంటూ ఈ మంత్రాన్ని జపించండి. సూర్యునికి అర్ఘ్యం సమర్పించిన తర్వాత అదే స్థలంలో మూడుసార్లు ప్రదక్షిణ చేయండి. ఇలా చేయడం సూర్య భగవానుడికి ప్రదక్షిణ చేయడంతో సమానం.
సంక్రాంతి రోజున సూర్య చాలీసా పఠించండి
మకర సంక్రాంతి రోజున సూర్య చాలీసా పఠించడం కూడా చాలా మంచిదని విశ్వాసం. అంతేకాదు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించవచ్చు. ఉజ్వల భవిష్యత్తు కోసం సూర్య భగవానుని ప్రార్థించవచ్చు. మకర సంక్రాంతి రోజున సూర్యభగవానుని ముందు ఆహారం, నీరు, బట్టలు మొదలైన వాటిని ఉంచి.. వాటిని అవసరమైన వారికి దానం చేస్తే, సూర్య భగవానుడు సంతోషిస్తాడని నమ్ముతారు. కనుక మకర సంక్రాంతి రోజున సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించడంతోపాటు, ఈ ప్రత్యేక చర్యలు తీసుకోవడం వలన విశిష్ట ఫలితాలు వస్తాయని విశ్వాసం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు