Ramappa: కాకతీయుల కళాత్మకతకు అద్భుతమైన శిల్పరీతి.. ఇసుక పునాదిపై వెలిసిన రామప్ప దేవాలయం
కాకతీయుల కళాత్మకతకు అద్భుతం శిల్పసంపదకు చారిత్రక సాంస్కృతిక సంప్రదాయాలకు ఎన్నో ప్రత్యేకతలకు నెలవు రామప్ప దేవాలయం.
Ramappa Temple: కాకతీయుల కళాత్మకతకు అద్భుతం శిల్పసంపదకు చారిత్రక సాంస్కృతిక సంప్రదాయాలకు ఎన్నో ప్రత్యేకతలకు నెలవు రామప్ప దేవాలయం. ఓరుగల్లు కేంద్రంగా సాగిన కాకతీయుల పాలనలో 12వ శతాబ్దంలో గణపతి దేవుని హయాంలో వారి సామంత రాజైన రేచర్ల రుద్రుడు దీన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. కాకతీయుల నిర్మాణ శైలి… దేవాలయము, తటాకము, నగరము అనే సూత్రం మీద ఆధారపడి ఉంది. రామప్ప గుడి కూడా అదే పద్ధతిలో నిర్మించారు
ఇసుక పునాదిపై వెలిసిన అద్భుతం రామప్ప దేవాలయం. అపురూప శిల్పకళా తోరణాలతో అలరారుతున్న ఈ కోవెలకు ప్రపంచస్థాయి గుర్తింపు లభించింది.ఇక్కడి శిల్పాలు కదలలేవు, మెదలలేవు, పెదవి విప్పి పలుకలేవు.. అయితేనేం, అవి పలికించని భావం లేదు. వాటిని చూసి పులకించని హృదయం లేదు. శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ కాకతీయ కట్టడానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు దక్కింది. యునెస్కో వారసత్వ కట్టడాల జాబితాలో స్థానాన్ని సంపాదించిందీ సుందర నిర్మాణం.
రామప్ప ఆలయం ఎన్నో ప్రత్యేకతల సమాహారం. దేవాలయానికి ఈశాన్య భాగంలో ఉన్న మండపము నందు ఈ దేవాలయ నిర్మాణానికి సంబంధించిన శాసనము ప్రతిష్టించబడింది. పూర్వపు వరంగల్ జిల్లా కేంద్రానికి 70 కి.మీ. దూరంలో ములుగు జిల్లా పాలంపేట గ్రామంలో ఉంది.. రామప్ప దేవాలయం. ఈ అపురూప శిల్పాలయాన్ని క్రీ.శ. 1213లో కాకతీయ ప్రభువు గణపతిదేవుని సైన్యాధ్యక్షుడు రేచర్ల రుద్రుడు కట్టించాడు. రుద్రుడి తండ్రి కాటయ. ఆయన తన హయాంలో పలు చెరువులు తవ్వించాడని రామప్ప దేవాలయ శాసనం తర్వాతిదైన గొడిశాల శాసనం (శక సంవత్సరం 1157, క్రీ.శ.1236) ద్వారా తెలుస్తోంది. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న రేచర్ల రుద్రుడు తటాకాలు తవ్వించడంతోపాటు రామప్ప ఆలయాన్నీ కట్టించాడు. ఆలయ సమీపంలో విశాలమైన చెరువుకూడా రేచర్ల రుద్రుడు నిర్మించిందే.. ఈ చెరువు ని ఆనుకొని తెలంగాణ టూరిజం హరిత గెస్ట్ హౌస్ లను నిర్మించింది. దీంతో భక్తులు పర్యాటకుల తాకిడి మొదట్నుంచీ కూడా ఎక్కువగానే ఉంది. ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన యునెస్కో గుర్తింపు పొందడంతో ఈ ఆలయాన్ని సందర్శించడానికి వచ్చే భక్తులు పర్యాటకులు ఉద్వేగ భరితంగా ఆలయ గొప్పతనాన్నిపంచుకున్నారు.
కాకతీయుల పాలన శిల్ప కళకు స్వర్ణయుగం, అందులోనూ త్రికూటాలయాలు ప్రసిద్ధి చెందాయి. అయితే, రామప్ప గుడి త్రికూటాలయం కాదు. కానీ, ఈ ఆలయానికి మూడు ప్రవేశ ద్వారాలున్నాయి. ఎత్తయిన పీఠంపై నక్షత్ర ఆకారంలో, తూర్పునకు అభిముఖంగా గుడిని నిర్మించారు. ఉత్తర, దక్షిణ దిశల్లోనూ ప్రవేశ ద్వారాలున్నాయి. ఆలయం మధ్యభాగంలో మహామంటపం ఏర్పాటు చేశారు. క్రీ.శ.1203లో వేయించిన, గణపతిదేవుని కాలం నాటి కొండపర్తి శాసనం.. కాకతీయ శిల్ప నిర్మాణ కౌశలాన్ని ఈ శ్లోకంలో వర్ణించింది. ఈ దేవాలయము తూర్పు దక్షిణము ఉత్తరము మూడు వైపులా ద్వారములు కలిగిన ఎత్తయిన వేదికలపై నిర్మించబడినది పశ్చిమ వైపు గర్భాలయము నందు శివుడు లింగ రూపం ప్రతిష్టించబడి ఉన్నాడు. అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించి క్రీస్తుశకం 1213లో రుద్రేశ్వరున్ని ప్రతిష్ఠింప చేశారు ఆ రోజు నుంచి ఈరోజు వరకు పరమశివుడు నిత్యపూజలు అందుకుంటున్నాడు గత 13 సంవత్సరాలుగా ఈ ఆలయంలో లో నిత్యకైంకర్యాలు చేస్తున్నామని ఆలయ పూజారి తెలిపారు.
ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానమూ, యంత్రాలూ లేని కాలంలో నిర్మించిన రామప్ప గుడిలో కనీవినీ ఎరుగని వింతలు కనిపిస్తాయి. శిల్ప సౌందర్యం ఆనాటి శిల్పాచార్యుల సునిశిత పనితనాన్ని చాటిచెబుతాయి. గొలుసుకట్టుగా నిర్మించిన చిన్నచిన్న శిల్పాల వెనుకగా ఒకవైపు నుంచి మరోవైపునకు దారం తీయవచ్చంటే ఆ శిల్ప నిర్మాణ చాతుర్యం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి విశేషాలెన్నో రామప్ప గుడిలో చూడొచ్చు.
Read Also…. Ram Pothineni: రామ్ సినిమా ఆడియో రైట్స్ రికార్డ్ ధర… అతడే కారణమా ?