రహస్య గది నుంచి పూరీ జగన్నాథుడి అంతు లేని సంపదను వెలికి తీశారు. అయితే రత్న భాండాగారంలోని మిస్టరీ పూర్తిగా వీడలేదు. దానిని ఛేదించడానికి అడ్వాన్స్‌డ్ టెక్నాలజీనే నమ్ముకున్నారు ఆలయ అధికారులు. ఇంతకీ రత్న భాండాగారంలో రహస్య సొరంగాలు దాగున్నాయా? ఏ టెక్నాలజీ సాయంతో వాటి గుట్టు రట్టు చేయబోతున్నారా.. పూరీ జగన్నాథుని ఆలయంలో అంతుచిక్కని సంపద ఉందని అక్కడి ప్రజలు ఆనోటా ఈనోటా చెప్పుకోవడమే కాదు.. చరిత్రకారులు సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నారు. అధికారులు సైతం అది పుకార్లు కాదు.. నిజమేనన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే కొద్ది రోజుల క్రితం రహస్య గది తెరిచిన తరువాత.. అక్కడ సంపద ఉందన్నది నిజమని తేలిపోయింది. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే… ఆ రత్నభాండాగారంలో వెలకట్టలేని పురాతన విగ్రహాలు దొరికాయని అధికారులే స్వయంగా స్టేట్‌మెంట్ ఇచ్చారు.
రత్న భాండాగారం రహస్యగదిలో 34 కిరీటాలు, రత్నఖచిత స్వర్ణ సింహాసనాలు, మహాలక్ష్మికి సంబంధించిన వడ్డాణాలు, దేవతల పసిడి విగ్రహాలు ఉన్నట్టు చెబుతున్నారు. గతంలో రత్నభాండాగారంలోని ఆభరణాలను లెక్కపెట్టినప్పుడు.. కొన్నింటిని జాబితాలో పొందుపరచలేదు. అలా జాబితాలో లేని 7 విగ్రహాలు దొరికాయని చెబుతున్నారు. కాకపోతే, 46 ఏళ్లుగా లోపలే ఉండడంతో కాస్త నల్లగా మారాయని చెబుతున్నారు. రెండోసారి రత్న భాండాగారాన్ని తెరిచినప్పుడు ఈ అమూల్య సంపద గురించి బయటి ప్రపంచానికి తెలిసింది.
అయితే ప్రపంచానికి తెలియాల్సిన విషయం ఇంకొకటుంది. శ్రీక్షేత్రం ఆవరణలో రహస్య గదులు, సొరంగ మార్గాలు చాలా ఉన్నాయని దేవాలయ చరిత్ర చెబుతోంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. రహస్య గది తెరిచినప్పుడు పూరీ జగన్నాథ ఆలయంలోని సొరంగ మార్గాలపై స్పష్టత రాలేదని పూరీ రాజు గజపతి మహారాజ్ కూడా తెలిపారు. అయితే రహస్య గదిలోనే వెల కట్టలేనంత సంపద ఉంది. ఇక వందల ఏళ్ల నుంచి మహారాజులు, చక్రవర్తులు స్వామికి సమర్పించిన నవరత్న ఖచిత ఆభరణాలు, వజ్ర వైఢూర్యాలు…వీటన్నింటిని రహస్య నేల మాళిగల్లో, సొరంగాల్లో భద్రపరిచారని చరిత్ర చెబుతోంది. రహస్య గది కింద మరో రహస్య గది, సొరంగాలు, చాలా పెద్ద అండర్ గ్రౌండ్ నెట్‌వర్క్ ఉందని స్థానికులు బలంగా నమ్ముతారు. ఆ గదిలో అత్యంత విలువైన సంపద దాచారని కొందరు చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. 1902లో బ్రిటిషర్లు ఈ సొరంగ మార్గాన్ని కనిపెట్టాలని చూసినా.. వాళ్ల ప్రయత్నాలు ఫలించలేదంటున్నారు.
రత్న భాండాగారంలో ఉన్న రహస్య గదులు, సొరంగాల మిస్టరీని ఛేదించడానికి ఒడిశా సర్కార్ నియమించిన బిశ్వనాథ్ రథ్ కమిటీ నడుం బిగించింది. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ ఉపయోగించి రహస్య గదిని స్కానింగ్ చేయాలని కమిటీ ప్రతిపాదించింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రహస్య గదిని సమగ్రంగా స్కాన్ చేస్తే, దాని కింద దాగి ఉన్న రహస్య సొరంగాలు బయటపడతాయని కమిటీ భావిస్తోంది. ఒకవేళ రత్న భాండాగారంలో ఇంకా రహస్య సొరంగాలు, గదులు ఉంటే బయటపడతాయని, లేకపోతే ప్రజల్లో ఉన్న అపోహలు, ప్రచారాలు, అనుమానాలకు ఫుల్‌స్టాప్ పడుతుందని కమిటీ అనుకుంటోంది. దీంతో పాటు రత్న భాండాగారానికి మరమ్మతులు చేసేందుకు కూడా ఈ స్కానింగ్ ఉపయోగపడుతుందని చెబుతున్నారు.
అయితే రత్న భాండాగారం కింద రహస్య గదులు, సొరంగాలు ఉన్నాయని చరిత్ర చెబుతోంది. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సాయంతో చేసే స్కానింగ్‌తో రహస్య గది రహస్యాలు త్వరలోనే బయటపడే అవకాశం ఉంది. అలా బయటపడితే ఆలయ మేనేజింగ్ కమిటీ, ఒడిశా సర్కార్..మరిన్ని కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..