Mysterious Temple: కలియుగాంతాన్ని సూచించే ఆలయం.. వేసవిలో చల్లగా, శీతాకాలంలో వేడిగా నీరు.. ఎన్ని రహస్యలో తెలుసా..

భారతదేశం ఆధ్యాత్మికతకు నెలవు. మన దేశంలో అనేక పురాతన , రహస్యమైన దేవాలయాలు ఉన్నాయి. కొన్ని ఆలయాలు, ప్రదేశాలు ప్రత్యేక రహస్యాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. అలాంటి దేవాలయాల్లో ఒకటి కేదారేశ్వర గుహ.. ఈ ఆలయం కలియుగం అంతం అంటే ప్రపంచం అంతాన్ని సూచిస్తుంది.

Mysterious Temple: కలియుగాంతాన్ని సూచించే ఆలయం.. వేసవిలో చల్లగా, శీతాకాలంలో వేడిగా నీరు.. ఎన్ని రహస్యలో తెలుసా..
Mysterious Kedareshwar Cave Temple
Follow us
Surya Kala

|

Updated on: Nov 20, 2024 | 3:42 PM

మన దేశంలోనే కాదు.. నేపాల్, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్ , జపాన్, చైనా, ఇర్లాండ్, ఇండోనేషియా వంటి అనేక ఇతర దేశాల్లో కూడా అనేక దేవుళ్ల ఆలయాలున్నాయి. అయితే కొన్ని దేవాలయాలు వాటి ప్రత్యేక రహస్యాలు, వాస్తు శిల్ప కళలు, నమ్మకాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. అటువంటి మర్మమైన ఆలయం ఒకటి మన దేశంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచింది. ఈ ఆలయం ప్రపంచం అంతాన్ని చూస్తుందని ప్రజలు నమ్ముతారు. అంతేకాదు ఈ ఆలయానికి సంబంధించి కొన్ని ఇతర రహస్యాలు ఉన్నాయి. అవి ఇతర దేవాలయాల నుంచి ఈ ఆలయాన్ని వేరు చేసి చూపిస్తాయి.

ఈ ఆలయం ఎక్కడ ఉంది?

ఈ ఆలయం మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలోని హరిశ్చంద్రగఢ్ అనే కొండకోటలో ఉంది. దీని పేరు కేదారేశ్వర గుహ దేవాలయం. ఈ ఆలయంలోని అతీంద్రియ సౌందర్యంతో పాటు దీనిలోని అనేక రహస్యాలు ఏళ్ల తరబడి ప్రజలను ఆకర్షించేలా చేస్తోంది. ఎందుకంటే ఈ ఆలయ నిర్మాణం చాలా రహస్యమైనది. ఏ నిర్మాణం నిలబడాలన్నా కనీసం నాలుగు స్థంబాలు కావాలి అంటారు. అయితే ఈ అద్భుత దేవాలయం ఏళ్ల తరబడి ఒకే స్తంభంపై నిలుస్తోంది. ఈ ఆలయాన్ని 6వ శతాబ్దంలో కలచూరి వంశస్థులు నిర్మించారని చెబుతారు. అయితే ఈ కోట గుహలు 11వ శతాబ్దంలో కనుగొనబడ్డాయి.

నాలుగు స్తంభాలు.. నాలుగు యుగాలకు ప్రతీక

నిజానికి ఈ ఆలయంలో నాలుగు స్తంభాలు కనిపిస్తాయి. అయితే ఒక స్తంభం మాత్రమే భూమికి అనుసంధానించబడి ఉంది. మిగిలిన మూడు ఇప్పటికే విరిగిపోయాయి. ఈ ఆలయ స్తంభాలు నాలుగు యుగాలను సూచిస్తాయని నమ్ముతారు. అంటే ఈ నాలుగు స్థంబాలు సత్య యుగం, త్రేతా యుగం, ద్వాపర యుగం, కలియుగం. మూడు యుగాలు దాటి ఇప్పుడు నాలుగో యుగమైన కలియుగంలో ఉన్నాం. అదే విధంగా ఈ గుహ ఈ స్తంభాల్లో ఒకదానిపైనే నిలబడి ఉంది. ఎందుకంటే మిగలిన మూడు స్థంభాలు విరిగి పడిపోయాయి. చివరి స్తంభం విరిగితే అదే కలియుగ అంతానికి సూచన అని.. అప్పుడు ప్రపంచం అంతం అవుతుందని నమ్ముతారు. అంతేకాదు మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ స్తంభాలు తమ ఎత్తును మారుతూ ఉంటుందనే నమ్మకం కూడా ఉంది.

ఇవి కూడా చదవండి

అద్భుత శివలింగం, నీరు

ఈ ఆలయంలో అద్భుత స్తంభాలు మాత్రమే కాదు ఇక్కడ శివలింగం కూడా ఓ రహస్యమే.. ఈ గుహలోని శివలింగం సహజంగా ఏర్పడింది. ఈ ఆలయం కోట లోపల సుమారు 4,671 అడుగుల ఎత్తులో నిర్మించబడింది. ఆలయానికి సమీపంలో మూడు గుహలు ఉన్నాయి. కుడి గుహలో మంచుని తలపించే చల్లని నీటి మధ్యలో 5 అడుగుల శివలింగం ఉంది. వేసవిలో ఇక్కడి నీరు మంచులా చల్లగా మారుతుందని ప్రజలు అంటున్నారు. అదే సమయంలో ఇక్కడ నీరు శీతాకాలంలో గోరువెచ్చని నీరుగా మారుతుంది. ఈ నీటిలో స్నానం చేయడం వల్ల అన్ని పాపాలు, బాధలు, వ్యాధుల నుంచి ముక్తి లభిస్తుందని కూడా నమ్ముతారు.

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.