
Yadadri Lakshminarasimhaswamy Temple: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దర్శించుకున్నారు. యాదాద్రిలో ఆధ్యాత్మిక ఉత్సవాల్లో పాల్గొన్న ఇంద్రకరణ్‌రెడ్డి.. చిరుధాన్యాల ప్రసాదం, బంగారం, వెండి నాణముల విక్రయాల వెబ్ పోర్టల్, ఆన్‌లైన్ టికెట్ సేవలను ప్రారంభించారు. అంతకుముందు ఇంద్రకరణ్‌రెడ్డి యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. స్వామి వారి దర్శనానికి వచ్చిన మంత్రికి దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఆలయ ఈవో, అర్చకులు స్వాగతం పలికారు.
గర్భాలయంలోని శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం తర్వాత ఆలయ ప్రధాన అర్చకులు వేదాశీర్వచనం అందజేశారు. బంగారం నాణెంను ఈవో గీత, వెండి నాణాన్ని ఆలయ అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి, ఇక చిరుధాన్యాల లడ్డూను దేవాదాయ ధర్మాదాయ శాఖ అదనపు కమిషనర్ జ్యోతి కొనుగోలు చేశారు.
ఇక.. బంగారు డాలర్ 3 గ్రాముల ధర 21,000 లుగా నిర్ణయించగా.. వెండి 5 గ్రాములు వెయ్యి రూపాయలు, 80 గ్రాముల మిల్లెట్ ప్రసాదాన్ని 40 రూపాయలుగా దేవస్థానం నిర్ణయించింది.
ఈ సందర్భంగా.. భక్తుల సౌకర్యం కోసం వెబ్ పోర్టల్‌ను ఆవిష్కరించి, ఆన్‌లైన్ టికెట్ సేవలను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రారంభించారు. వృద్దులు, వికలాంగుల కోసం యాదాద్రి ఆలయంలో రూ.21 లక్షల వ్యయంతో 3 బ్యాటరీ వాహనాలను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గొంగిడి సునీతరెడ్డి, జడ్పీ చైర్మన్ సందీప్‌రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, YTDA వైస్ చైర్మన్ కిషన్‌రావు, ఆర్కిటెక్ట్ ఆనంద్‌సాయితోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..