Maha Shivaratri: మహా శివరాత్రి ఫిబ్రవరి 15న లేదా 16..? శాస్త్రం చెప్పిన తేదీ ఇదే..!
ప్రతిసారిలానే ఈ సంవత్సరం కూడా మహా శివరాత్రి పండగ తేదీపై కొంత గందరగోళం నెలకొంది. ఫిబ్రవరి 15 లేదా 16.. ఏ తేదీలో శివరాత్రిని జరుపుకోవాలనేదానిపై చర్చ కొనసాగుతోంది. ఫిబ్రవరి 15న నిర్వహించాలని తాత్కాలికంగా నిర్ణయించారు. దీనిపై పూర్తి స్పష్టత రాలేదు.

సనాతన ధర్మంలో మహా శివరాత్రి అత్యంత పవిత్రమైన దినం. ఈ రోజు కోసం చాలా మంది శివ భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తూ ఉంటారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాసాలు, జాగారాలు, వ్రతాలు ఇలా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. ఆరోజున శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతాయి. శివనామ స్మరణతో మారుమోగుతుంటాయి. అయితే, ప్రతిసారిలానే ఈ సంవత్సరం కూడా మహా శివరాత్రి పండగ తేదీపై కొంత గందరగోళం నెలకొంది. ఫిబ్రవరి 15 లేదా 16.. ఏ తేదీలో శివరాత్రిని జరుపుకోవాలనేదానిపై చర్చ కొనసాగుతోంది. ఫిబ్రవరి 15న నిర్వహించాలని తాత్కాలికంగా నిర్ణయించారు. దీనిపై పూర్తి స్పష్టత రాలేదు. అయితే, ఏ రోజు మహా శివరాత్రిని జరుపుకోవాలనేదానిపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
ప్రతి చాంద్రమాసంలోని 14వ రోజు లేదా అమావాస్యకు ముందు వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు. కానీ, మాఘమాసంలో వచ్చే శివరాత్రి అంటే ఫిబ్రవరి లేదా మార్చి నెలలో వచ్చే శివరాత్రిని మహా శివరాత్రిగా జరుపుకుంటారు. 2026 సంవత్సరంలో మహా శివరాత్రి మాఘ మాసం కృష్ణ పక్ష చతుర్ధశి తిథి నాడు వస్తోంది.
శివరాత్రి ఏరోజున
అయితే, ఈసారి చతుర్ధశి ఫిబ్రవరి 15 ఆదివారం సాయంత్రం 5.05 గంటలకు ప్రారంభమై.. ఫిబ్రవరి 16న సోమవారం సాయంత్రం 5.34 గంటలకు ముగుస్తుంది. ఫిబ్రవరి 15న రాత్రి శివుని పూజకు అత్యంత పవిత్రమైన సమయం నిషిత కాలం (రాత్రి 11:55 – 12:56) అని పండితులు సూచిస్తున్నారు. అందుకే ఫిబ్రవరి 15న ఆదివారంనాడే శివరాత్రిని జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు.
ఇక, ఉపవాసం ముగింపు కోసం పిబ్రవరి 16, సోమవారం ఉదయం 6.42 గంటల నుంచి మధ్యాహ్నం 3.10 గంటల మధ్య పారణ చేయవచ్చని అంటున్నారు.
మహా శివరాత్రి విశిష్టత
పరమ శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు మహా శివరాత్రి. ఆ రోజున అందుకే శివభక్తులు ఉపవాసం ఉండటంతోపాటు జాగరణ చేస్తారు. రోజంతా శివనామస్మరణతో గడుపుతారు. ప్రదోషవేళ శివుడిని అభిషేకిస్తారు. బిల్వార్చన, రుద్రాభిషేకం చేస్తారు. శివరాత్రి రోజున రాత్రిపూట చేసే పూజలు, పారాయణలు, అభిషేకాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. రాత్రిపూట చేసే శివార్చన వల్ల శరీరంలో తేజస్సు కలుగుతుంది. శివారాధనతో ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలుగుతాయి.
ఇక, మహా శివరాత్రి రోజున శివాలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, జరుగుతాయి. శివపార్వతుల కళ్యాణోత్సవం ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఈ కళ్యాణోత్సవంలో పాల్గొని ఆ ఆది దంపతుల ఆశీస్సులు అందుకునేందుకు భారీగా సంఖ్యలో భక్తులు శివాలయాలకు వెళుతుంటారు. శివుడిని పూజించేందుకు పూజా పద్ధతులు, మంత్రాలు తెలియకపోయినా.. చెంబుడు నీళ్లు పోసినా.. ఆ భోళా శంకుడు తన ఆశీర్వాదాలను అందిస్తాడు. తన భక్తులకు ఏ కష్టం వచ్చినా స్వయంగా రంగంలోకి దిగుతాడనడానికి మార్కండేయుడు, భక్త కన్నప్ప లాంటి అనేక ఉదాహరణలున్నాయి. అందుకే మహా శివరాత్రి రోజున శివ నామ స్మరణ అత్యంత ప్రాధాన్యంగా చెప్పబడింది.
