Maha Kumbhamela: మహా కుంభ భక్తులకు ఇస్కాన్ మహాప్రసాద వితరణ.. మేము సైతం అంటూ చేతులు కలిపిన అదానీ గ్రూప్..
ప్రయాగరాజ్ లో ఈ నెల 13 నుంచి జరగనున్న మహా కుంభ మేళాకు సర్వం సిద్ధమయింది. మన దేశం ప్రజలు మాత్రమే కాదు విదేశీయులు కూడా ఈ కుంభ మేళాపై ఆసక్తిని చూపిస్తున్నారు. ఇప్పటికే త్రివేణీ సంగమం వద్ద సందడి మొదలైంది. యాత్రికులు, భక్తులు , బాబాలు, స్వాములు చేరుకుంటున్నారు. అయితే ఈ మహా కుంభలో కోట్లాది మంది భక్తులు పాల్గొంటారు అని భావిస్తూ ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేస్తోంది యూపీ సర్కార్. మరోవైపు ఈ కార్యక్రమంలో పాల్గొనే భక్తులకు మహా ప్రసాదాన్ని అందించడానికి ఇస్కాన్ రెడీ అవుతుండగా.. భగవంతుడి సేవలో మేము సైతం అంటోంది అదానీ సంస్థ..
12 ఏళ్లకు ఒకసారి జరిగే మహా కుంభ కు ఈ సారి వేదికగా ప్రయాగ్‌రాజ్ మారింది. త్రివేణీ సంగమ క్షేత్రంలో జరిగనున్న మహా కుంభమేళా జనవరి 13న ప్రారంభమై.. ఫిబ్రవరి 26 వరకు అంటే మొత్తం 45 రోజుల పాటు సాగనుంది. ఈ మహా కుంభలో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి కోట్లాదిగా భక్తులు ప్రయాగరాజ్ కు చేరుకుంటారు. ఇక్కడకు వచ్చిన భక్తులకు ఆకలి దప్పికలను తీర్చేందుకు ఇస్కాన్ రెడీ అయింది. ఇంతటి గొప్ప కార్యక్రమంలో ఇస్కాన్ తో పాటు మేము సైతం అంటూ అదానీ గ్రూప్ మహా ప్రసాద సేవకు సిద్దం అయింది. అదానీ గ్రూప్ ,యు ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ఇస్కాన్)లు సంయుక్తంగా ఈ సంవత్సరం ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభమేళాలో భక్తులకు భోజనం అందించడానికి చేతులు కలిపాయి.
45 రోజుల పాటు సాగనున్న మహా ప్రసాద సేవ ఈ నెల 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహా కుంభమేళా జరిగే మొత్తం అన్ని రోజుల్లోనూ ఈ మహాప్రసాద సేవ అందించనున్నారు. ఈ నేపధ్యంలో ఇటువంటి మహత్కార్యంలో పాలు పాలుపంచుకునే అవకాశం కల్పించిన ఇస్కాన్‌కు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ కృతజ్ఞతలు చెప్పారు. గురువారం ఇస్కాన్ గవర్నింగ్ బాడీ కమిషన్ (జిబిసి) చైర్మన్ గురు ప్రసాద్ స్వామిని కలిశారు. ఈ సందర్భంగా అదానీ మాట్లాడుతూ.. కుంభం ఒక పవిత్రమైన సేవా క్షేత్రం.. ఇక్కడ ప్రతి భక్తుడు దేవుని సేవ ఉంటాడు. అటువంటి సమయంలో మహాప్రసాద సేవ చేయడం తన అదృష్టం అని చెప్పారు.
అన్నపూర్ణ మాత ఆశీస్సులతో లక్షలాది మంది భక్తులకు ఉచితంగా మహా ప్రసాద వితరణ చేయనున్నాం.. ఈ రోజు ఇస్కాన్ గురు ప్రసాద్ స్వామిని కలిసే అవకాశం పొందడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. సేవ అనేది దేశభక్తికి అత్యున్నత రూపం. సేవే ధ్యానం, సేవే ప్రార్థన..సేవే దేవుడని చెప్పారు.
ఇంటర్నేషనల్ కృష్ణ కాన్షియస్‌నెస్ సొసైటీ విశిష్ట బోధకులలో ఒకరైన గురు ప్రసాద్ స్వామి మాట్లాడుతూ.. సామాజిక సేవలో అదానీ గ్రూప్ ఎల్లప్పుడూ ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తుందని చెప్పారు. గౌతమ్ అదానీ వినయం.. నిస్వార్థంగా సేవ చేసే గుణం తనకు నచ్చుతుందని అన్నారు.
ఈ మహాప్రసాద సేవ 50 లక్షల మంది భక్తులకు అందించబడుతుంది. మేళా ప్రాంతంలో మాత్రమే కాదు వెలుపల రెండు వంటశాలలలో భోజనాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. మహా కుంభ ప్రాంతంలోని 40 ప్రదేశాలలో మహాప్రసాదం పంపిణీ చేయబడుతుంది. ఈ కార్యక్రమంలో 2,500 మంది వాలంటీర్లు పాల్గొంటారని చెప్పారు. వికలాంగులు, వృద్ధులు, పిల్లలతో ఉన్న తల్లులకు గోల్ఫ్ కార్ట్‌లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అంతేకాదు ఈ మహా కుంభ సమయంలో భగవద్గీత పుస్తకం ఐదు లక్షల కాపీలను భక్తులకు పంచనున్నామని వెల్లడించారు.