AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Life Facts: ‘జీవితం చాలా చిన్నది.. ద్వేషించడం కాదు.. సంతోషంగా బ్రతకడం నేర్చుకో’..

భారతదేశంలోని ఒకానొక విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు వారి ఆచార్యుడు ఒక జీవిత పాఠం చెప్పిన తీరు ఇది..

Life Facts: 'జీవితం చాలా చిన్నది.. ద్వేషించడం కాదు.. సంతోషంగా బ్రతకడం నేర్చుకో'..
Life Facts
TV9 Telugu Digital Desk
| Edited By: Ravi Kiran|

Updated on: Dec 17, 2022 | 9:20 AM

Share

భారతదేశంలోని ఒకానొక విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు వారి ఆచార్యుడు ఒక జీవిత పాఠం చెప్పిన తీరు ఇది. పుస్తకాలు నుంచి పాఠాలు నేర్పడం పూర్తయిన తర్వాత ఆచార్యుడు తన విద్యార్థులను ఒక కోరిక కోరాడు. “మీ జీవితంలో ఒక్క ఐదు రోజులను నాకు వదిలేయండి. ఐదంటే ఐదు రోజులు చాలు. నాకు ఇంకేమీ అక్కర్లేదు” అని విద్యార్థులకు చెప్పాడు. విద్యార్థులంతా ఏకగ్రీవంగా అంగీకరించారు. ఏం చేయాలో, ఎలా చేయాలో చెప్పండి అని అడిగారు. “నేను ఒక వరుసలో పని చెబుతాను. మీరు అదే వరుసలో నేనేం చెబితే అది పూర్తి చేయండి” అని ఆచార్యుడు చెప్పాడు.

“మీరంతా ఒకరోజు గ్రామానికి వెళ్లి రైతుతో ఒకరోజు గడపండి”అని ఆయన చెప్పాడు. సరేనని గ్రామాలకు వెళ్ళిపోయారు. ఆచార్యుడు చెప్పిన దాని ప్రకారం ఉదయం నుంచి రాత్రి వరకు వాళ్లు తమకు వీలైన రైతుతో సమయం గడిపారు. రైతు జీవితాన్ని శ్రద్ధగా, లోతుగా పరిశీలించారు. అక్కడి వాతావరణాన్ని అనుభవించారు. అతను ఎంత కష్టపడి ఆహార పదార్థాలను పండిస్తున్నది తెలుసుకున్నారు. మనం ఆహార పదార్థాలలో చాలా భాగాన్ని పారేస్తుంటాం. అయితే రైతు ఆహారాన్ని పండించడానికి ఎంత కష్టపడుతున్నది, ఏ రకంగా వనరుల్ని ఖర్చు చేస్తున్నది వాళ్ళు నిశితంగా గమనించారు. రైతును అడిగి అనేక విషయాలు తెలుసుకున్నారు. ఆహారాన్ని వృధా చేసేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని నిర్ణయానికి వచ్చారు. వాళ్లు గ్రామాల నుంచి తిరిగి వచ్చి ఆచార్యుడికి తమ అనుభవాన్ని వివరంగా తెలియజేశారు.

రెండో రోజు న ఆయన వారిని ఒక జైలుకి వెళ్లి రమ్మన్నాడు. ఏ నేరము చేయకపోయినా అధికారుల అనుమతి తీసుకుని రోజంతా ఖైదీలతో గడిపి రండని చెప్పి పంపించాడు. మనమంతా భావిస్తున్న ఖైదీలు పరిస్థితుల ప్రభావం వల్ల జైళ్లలో మగ్గుతున్నట్టు, క్షణికావేశంలో చేసిన నేరానికి జైలు జీవితం అనుభవిస్తున్నట్టు వారికి అర్థమైంది. ఆగ్రహావేశాలను అదుపు చేసుకోలేని పక్షంలో జరిగే పర్యవసానాలు వారికి అర్థమయ్యాయి. “నేను ఈ నేరాన్ని కావాలని చేయలేదు. ఆ క్షణంలో నాకు ఏదో అయింది. ఆవేశం నన్ను ఆవహించింది. దాంతో నేరం జరిగిపోయింది” అని అక్కడి ఖైదీలలో చాలామంది చెప్పారు. ద్వేషం, క్రోధం వంటి గుణాల స్థానంలో కొద్దిగా ప్రేమను పెంచుకుంటే ఇంత అనర్థం జరిగేది కాదని వాళ్లు అర్థం చేసుకున్నారు.

ఆచార్యుడి ఆదేశాల ప్రకారం వారు మూడవ రోజున ఒక ఉపాధ్యాయుడితో రోజంతా గడపాల్సి వచ్చింది. జీవితంలో ఒక ఉపాధ్యాయుడి ప్రాధాన్యం ఏమిటో వాళ్లకు తెలిసి వచ్చింది. జీవితంలో మీరు ఎక్కడ ఉన్నా, మీరేం చేస్తున్నా మీకు తప్పనిసరిగా ఎవరిదో ఒకరి సహాయం, మార్గదర్శనం అవసరం అవుతాయి. మనకు సహాయం చేసే వారు ఉంటారు. అది మనకు ఎంతో తృప్తినిస్తుంది. అందులో ముఖ్యమైన వారు ఉపాధ్యాయులు. మన జీవితాలకు చక్కని పునాది వేసేవాడు ఉపాధ్యాయుడు. అడగకుండానే మనకు అండగా నిలబడతాడు. అతను మన కోసం తన జీవితాన్ని, తన విలువైన సమయాన్ని త్యాగం చేస్తాడు. “నా విద్యార్థి బాగుండటం కంటే నాకు మరేమీ వద్దు” అని ప్రేమగా చెప్పే వ్యక్తి ఉపాధ్యాయుడు.

ఆ తరువాత ఆచార్యుడి సూచన ప్రకారం వారు నాలుగవ రోజున ఒక మానసిక చికిత్స కేంద్రానికి వెళ్లారు. వారక్కడ మానసిక రోగులు, మానసిక వైద్యులతో రోజంతా గడిపారు. మానసిక రోగులు విద్యార్థుల్ని నానా దుర్భాషలు ఆడారు. రకరకాలుగా ఇబ్బంది పెట్టారు. వైద్యులు వారిని చక్కదిద్దడానికి ఎంతో సహనంతో ప్రయత్నాలు చేస్తున్నారు. సహనం కోల్పోకుండా సమాజంలో విమర్శలను, అపార్ధాలను, అనుమానాలను ఎలా ఎదుర్కోవాలన్నది వారికి అక్కడ బాగా అర్థమైంది. విమర్శలకు కృంగిపోక ఎలా మానసిక ధైర్యాన్ని పెంపొందించుకోవాలో వారు అర్థం చేసుకున్నారు.

ఐదవ రోజున వారు ఒక స్మశానంలో గడపాల్సి వచ్చింది. జీవితం ఎంత అశాశ్వతమైనదో వాళ్లకు కళ్ళకు కట్టింది. జీవితాన్ని బతికి ఉండగా ఎంత సద్వినియోగం చేసుకోవాలో, కొన్ని విషయాలకు ఎలా వెంపర్లాడకూడదో వారికి బోధపడింది. బతికి ఉన్నంతకాలం ఇతరుల పట్ల ఎంత నిస్వార్ధంగా వ్యవహరించాలో వాళ్ళు తెలుసుకోగలిగారు. తరగతి గదుల్లో పాఠాలు చెప్పినంత మా త్రాన సరిపోదు. సంపూర్ణ విద్యను వంట పట్టించుకోవాలంటే జీవితానికి సంబంధించిన అన్ని కోణాలను పరిశీలించాలి. అనుభవించాలి. దీనివల్ల అర్థవంతమైన జీవితం అనుభవించడానికి వీలవుతుంది.