తెలుగు నేలలో మరుగున ఉన్న త్రేతాయుగం నాటి క్షేత్రం అర్ధగిరి.. ఇక్కడ నీటిలో వ్యాధులను నయం చేసే గుణం..

రామ భక్త హనుమంతుడికి మన దేశంలో ఆలయం లేని ఊరు ఉండదు అంటే అతిశయోక్తి కాదు. రామయ్యని దైవంగా భావించి కొలిచే ఆంజనేయుడిని తమ భయాలను దూరం చేసి కష్టాలు తీర్చే సంకట మోచానుడిగా భావించి భక్తులు పుజిస్తారు. గల్లీ గల్లీ కి హనుంతుంది ఆలయాలు లేదా విగ్రహాలున్నా.. కొన్ని క్షేత్రాలు మాత్రం విశిష్టమైనవి. పురాణాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగినవి. ఇలా హనుమంతుడు కొలువైన క్షేత్రం అర్ధగిరి. ఈ పుణ్య స్థానం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కాణిపాకం క్షేత్రానికి అతి సమీపంలో ఉంది. ఇక్కడ స్వామివారి పుష్కరిణిలో నీరు తాగడం వలన వ్యాధులు నయం అవుతాయని నమ్మకం.

తెలుగు నేలలో మరుగున ఉన్న త్రేతాయుగం నాటి క్షేత్రం అర్ధగిరి.. ఇక్కడ నీటిలో వ్యాధులను నయం చేసే గుణం..
Ardha Giri Temple

Updated on: Apr 27, 2025 | 4:23 PM

ఎక్కడ రామ నామ స్మరణ జరుగుతుందో అక్కడ హనుమంతుడు ఉండటని నమ్మకం. రామయ్య భక్తుడైన ఆంజనేయ స్వామికి పురాణాలతో ముడిపడిన పురాతన, ప్రశస్తమైన ఆలయాల్లో అర్ధగిరి ఆంజనేయుని ఆలయం మొదటి స్థానంలో ఉంది. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రముఖ పుణ్య క్షేత్రం కాణిపాకం వరసిద్ధి వినాయకుడు ఆలయానికి సుమారు 13 కి.మీ దూరంలో ఉంది. అరగొండ గ్రామంలో ఉన్న కొండపై అర్ధగిరి ఆంజనేయస్వామి ఆలయం ఉంది. ఈ పర్వతాన్ని సంజీవని పర్వతం అని కూడా స్థానికులు పిలుస్తారు. మనకు తెలియని మరుగున ఉన్న ఎన్నో ప్రముఖ క్షేత్రాల్లో ఒకటి అర్ధగిరి క్షేత్రం. ఎంతో చరిత్ర.. మహిమనిత్వమైన ఈ క్షేత్రం గురించి ఈ రోజు తెలుసుకుందాం..

పురాణం ప్రకారం ఆలయ చరిత్ర..

అర్థగిరి క్షేత్ర ఆవిర్భావం గురించి రామాయణగాథనే చరిత్రగా చెబుతున్నారు. త్రేతాయుగ కాలంలో సీతమ్మని రావణుడి చేర నుంచి విడిపించేందుకు రామ.. రావణుల మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో రావణుడి కుమారుడైన ఇంద్రజిత్తుతో యుద్ధం చేస్తూ ఇంద్రజిత్తు ఆయుధం తగిలి లక్ష్మణుడు మూర్చబోతాడు. లక్ష్మణుడు మేలుకోవాలంటే సంజీవిని అనే దివ్య ఔషధం కావాలని తెలిసి.. హనుమంతుడు జై శ్రీరామ్ అంటూ సంజీవిని తీసుకుని రావడానికి వాయువేగంతో ఆకాశంలోకి లంఘించాడు.

ఇవి కూడా చదవండి

ద్రోణగిరి పర్వతంపై సంజీవని మొక్క ఎక్కడ ఉందో తెలియని హనుమంతుడు ఏకంగా తన అరచేతుల మీద సంజీవని పర్వతాన్ని పెట్టుకుని మూర్చబోయిన లక్ష్మణుడి వద్దకు తీసుకుని వస్తుండగా.. ఔషదులతో ఉన్న ద్రోణగిరి పర్వతాన్ని తీసుకొస్తున్న ఆంజనేయుడిని భరతుడు చూశాడు. అయితే అది చీకటి సమయం.. దీన్తి తమకు హానిచేయడానికి రాక్షసులు పర్వతం తెస్తున్నారని భావించిన భరతుడు హనుమంతునిపై బాణం సంధించాడు. అప్పుడు ద్రోణగిరి పర్వతములో సగభాగం విరిగి పెళ పెళరావంతో నేలమీద పడింది. అలా ఔషదాలతో కూడిన ద్రోణగిరి పర్వతం పడిన ప్రాంతమే నేటి అర్ధగిరి.

ఉత్తరం వైపు హనుమంతుడి విగ్రహం

ఈ కొండ పడిన ప్రాంతంలో ఒక గ్రామం వెలసింది. ఆ గ్రామమే అరకొండగా… కాలక్రమేణా అరగొండగా రూపాంతరం చెందిందని భాగవతుల కథనం. స్థలపురాణం. ఈ క్షేత్రంలో ప్రధాన దైవం హనుమంతుడు.. స్వామి ప్రసన్నాంజనేయునిగా ప్రసిద్ధి చెందారు. అయితే ఈ హనుమంతుడి ఆలయ విశిష్టత ఏమిటంటే… మిగతా హనుమంతుడి ఆలయముల్లో వలె కాకుండా ఇక్కడ హనుమంతుని విగ్రహం ఉత్తరంవైపు ఉంటుంది.

కోనేటినీటిలో దివ్యఔషధగుణాలు

మృతసంజీవనీ ఔషధపు మొక్క ఆలయప్రాంగణంలో ఉన్న కోనేటి నీటిలో పడిందని.. అందుకనే ఈ నీటికి దివ్యఔషధగుణాలు ఉన్నాయని విశ్వాసం. అందుకనే ఈ కోనేటిని సంజీవరాయ పుష్కరిణి అని పిలుస్తారు. ఈ నీరు తాగడంతో అనేక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్మకం. అందుకనే కోనేటినందలి నీటిని శరీర రుగ్మతలు తగ్గించుకోవడానికి భక్తితో స్వీకరిస్తారు. వనమూలికల ప్రభావంచే సహజంగా ఉద్భవించిన సంజీవరాయ పుష్కరిణీ తీర్థాన్ని సేవిస్తే వ్యాధులు నయమవడమే కాదు మనసులోని కోరికలు తీరతాయని నమ్మకం. అంతేకాదు ఆలయ పరిసరాల్లోని నీరు ఇతర ప్రదేశాలన్నిటిలో కంటే తియ్యగా ఉంటుంది. కొలనులోని నీరు పర్వతం నందలి వివిధ మార్గముల నుంచి అనేక ఔషదమొక్కలను తాకుతూ ప్రవహించి ఈకొలనును చేరుతుంది. ఈ కోనేటిలో నీరు చేరి వేలసంవత్సరాలు గడిచాయి.. అయినా నేటికీ మనుషులకు సంక్రమించే వ్యాధులను నయం చేయగల ఔషధ గుణాలు ఉన్నాయని నమ్మకం. టి.బి., ఆస్తమా, కీళ్లనొప్పులు సహా అనేక వ్యాధులను నయంచేసే శక్తి ఈ నీటికి ఉందని ప్రసిద్ధి. శారీరక రుగ్మతలు పోగొట్టి శరీరానికి సామర్థ్యాన్ని కలిగిస్తుంది అని నమ్మకం. ఈ పుష్కరిణిలో నీరు‌ 40 రోజులపాటు సేవించి పక్కనే ఉన్న ఆంజనేయస్వామి ని దర్శిస్తే అన్ని వ్యాధులు తగ్గిపోతాయని భక్తుల విశ్వాసం.

పౌర్ణమికి పత్యేక పూజలు

పౌర్ణమిరోజు ఆంజనేయుడు మరింత శక్తివంతంగా ఉంటాడని నమ్మకం. ఈ క్ష్త్రంలో ప్రతి నెలా పౌర్ణమి రోజున విశేష పూజలు, భజనలు, హరికథలతో క్షేత్రం భక్తుల సందడితో నిండిపోతుంది. పౌర్ణమిరోజున భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఆంజనేయుడికి కోరిన కోర్కెలు తీర్చమని వేడుకుంటూ తమలపాకులు, తులసిదళములతో ఉన్న దండలు స్వామికి సమర్పిస్తారు.

ఆలయం దర్శన సమయం

ఆలయము ఉదయం 5 గంనుంచి మధ్యాహ్నం 1-30 వరకు తిరిగి 2 గం. నుంచి 8-00 వరకు తెరచి ఉంటుంది.

ఈ క్షేత్రం, పుష్కరిణీలు త్రేతాయుగం నాటివి అని పురాణాల ద్వారా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఆంజనేయ స్వామివారి గుడి మాత్రం చోళరాజుల కాలంలో నిర్మించబడిందనే ఆధారాలున్నాయి. ఈ క్షేత్ర సమీపంలో ఎన్నో గుహలు కనిపిస్తాయి. ఈ గుహలలో ఎందరో యోగులూ, మహర్షులు తపస్సు చేసిన ఆనవాలు నేటికీ దర్శనం ఇస్తాయి. దక్షిణ భారతదేశంలోని ఆంజనేయస్వామి దేవాలయాల్లో ఈ అర్ధగిరి ఆంజనేయస్వామి ఆలయం.. అతి ముఖ్యమైనదిగా పరిగణించబడుతోంది. ఈ పురాతన ఆలయంలోని స్వామివారిని దర్శించుకోవడానికి, పుష్కరణిలోని నీరు సేవించడానికి ప్రతిరోజూ వేలాదిమంది భక్తులు తరలివస్తారు.

 

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు