హర హర అంటే బుడ బుడ మంటూ కోనేరులో నీరు బయటకు వస్తుంది…ఈ ఆలయం ఎక్కడ ఉందో తెలుసా..?
ఆ పరమశివుడే అక్కడ స్వయంభుగా కొలువయ్యాడని నమ్మిన స్థానికులు స్వామివారి విగ్రహాన్ని బయటకు తీసి విరిగిన భాగాన్ని అతికించినట్టు చెబుతారు. ఇప్పటికీ లింగాకారంలో కొంత భాగం ఒక పక్క విరిగినట్లుగా, దానిని తిరిగి అతికించినట్లుగా స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాక అతికించిన భాగం నుంచి చమరిస్తున్నట్లుగా భక్తులకు కనిపిస్తుంది.
ఏలూరు : చీకటిలో ఉన్న వస్తువును మనిషి తన సాదారణ కళ్ళతో చూడలేడు. అలా అని అక్కడ వస్తువు ఏమి లేదని చెప్పటం తర్కానికి నిలవదు. ఎందుకంటే దానికి రెండు పార్శ్వాలు ఉంటాయి. అలాగే మన కళ్ళు చూడలేనివి, తార్కిక వాదనలకు సమాధానం దొరకనివి చాలానే ఈ భూమి పైన ఉన్నాయి. సైన్సు కొన్నిటికి సమాదానం చెబితే మరికొన్నింటిపై సమాదానాలు దొరకని పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా హిందూ దేవాలయాల్లో ఎంతో విజ్ఞానం దాగి వుంది. వాటి నిర్మాణ విషయంలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఇలాంటి వాట్లో ఇపుడు ఏలూరు జిల్లాలో ఉన్న ఒక ప్రముఖ ఆలయం, అక్కడి విశేషాల గురించి ఇపుడు తెలుసుకుందాం..
ఆలయాలు గత పూర్వ చరిత్రకు, వైభవానికి ఆనవాలుగా చెబుతుంటారు. కొన్ని ప్రసిద్ధ ఆలయాల్లో ఎన్నో వింతలు, మరెన్నో మహిమలు చూస్తుంటాం, వింటాము.. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆలయంలో కూడా సరిగ్గా అలాంటీ వింత సంఘటన భక్తులను భక్తి పారవశ్యంలో కట్టిపడేస్తుంది. ఏలూరు జిల్లా కలిదిండిలో అతి ప్రాచీన దేవాలయం ఒకటి ఉంది. ఆ ఆలయం పేరు పాతాళ భోగేశ్వర స్వామి ఆలయం.. అయితే అక్కడ శివుడు లింగాకారంలో స్వయంభుగా కొలువై ఉన్నాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆలయ ప్రాంగణంలో పవిత్రమైన కోనేరు ఉంది. ఆ కోనేరులో పంచబుగ్గలు ఉన్నాయి. ఆలయానికి విచ్చేసిన భక్తులు స్వామిని దర్శించిన అనంతరం కోనేరు వద్దకు వెళ్లి హరహర అంటే చాలు ఆ వింత భక్తుల కంట పడుతుంది. ఎవరైతే భక్తులు కోనేరు వద్దకు చేరుకుని హరహర అంటారో కోనేరులోని పంచ బుగ్గల నుంచి నీరు బుడబుడా అని శబ్దం చేస్తూ పైకి వస్తుంది. ఆ వింతను చూసిన స్థానికులు ఆ భోగేశ్వర స్వామి మహిమగా కీర్తిస్తూ ఉంటారు.
అయితే ఈ ఆలయానికి ఎంతో ప్రాచీన చరిత్ర ఉంది. ఈ ఆలయం కలిదిండికి తూర్పు ఆగ్నేయంలో నిర్మించబడి ఉంది. వేంగిరాజు రాజరాజ చోళుడు పరిపాలించిన సమయంలో ఈ దేవాలయం నిర్మించినట్టుగా స్థల పురాణంలో చెప్పబడింది. రాజ రాజ చోళుడు కుమారుడు రాజరాజ నరేంద్రుని కాలంలో ఒక రైతు నాగలితో పొలందున్నుతుండగా భూమిలో నాగలి కర్రుకు లింగాకారంలో ఉన్న శిల కనిపించింది. కొంత భాగం అది విరిగి అక్కడి నుండి రక్తం వరదలా పారింది. దీంతో ఆ పరమశివుడే అక్కడ స్వయంభుగా కొలువయ్యాడని నమ్మిన స్థానికులు స్వామివారి విగ్రహాన్ని బయటకు తీసి విరిగిన భాగాన్ని అతికించినట్టు చెబుతారు. ఇప్పటికీ లింగాకారంలో కొంత భాగం ఒక పక్క విరిగినట్లుగా, దానిని తిరిగి అతికించినట్లుగా స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాక అతికించిన భాగం నుంచి చమరిస్తున్నట్లుగా భక్తులకు కనిపిస్తుంది.
ఈ ఆలయం కలిదిండికి 3 మైళ్ళ దూరంలో పొలాల మధ్య ఏకాంతంగా ఉంటుంది.. అక్కడి నుంచి విగ్రహాన్ని గ్రామంలోకి తీసుకువచ్చేందుకు స్థానికులు ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. అంతేకాక స్వామివారు ఓ భక్తుని స్వప్నంలో సాక్షాత్కారమై కోడికూత, రోకటిపోటు వినలేనని, కనుక నా ఆలయాన్ని అక్కడే నిర్మించమని కోరినట్టుగా చెబుతారు. ఆ తరువాత కాలంలో లింగాకారం లభించిన చోటనే ఆలయ నిర్మాణం చేశారు. అంతేకాక ఆలయ ధ్వజస్తంభంపై స్వామివారి పాదాలు కూడా భక్తులకు కనిపిస్తాయి.
పూర్వం వర్షాకాలంలో జోరున వర్షం కురుస్తుండటంతో స్వామివారి నిత్యార్చనకు ఆలస్యం అవడంతో స్వామివారు ధ్వజస్థంభం ఎక్కి చూచి అర్చకుల రాకను గమనించి ధ్వజస్థంభంపై నుండి దూకటంతో స్వామివారి పాదాల గుర్తులు ఏర్పడినట్లు ఆలయ స్థల పురాణంలో చెబుతారు. నేటికి కూడా ఆ పాద గుర్తులు భక్తులు ప్రత్యక్షంగా చూస్తున్నట్లు అర్చకులు చెబుతున్నారు. ప్రతి ఏటా మాఘ బహుళ ఏకాదశి నుండి అమావాస్య వరకూ శ్రీ పార్వతీ సమేత పాతాళ భోగేశ్వరస్వామి వారికి పాంచాహ్నిక దివ్య కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా ఇక్కడ జరుపుతారు.