Srisailam Temple: మల్లన్న సన్నిధిలో జ్వాలాతోరణం.. భక్తులతో కిటకిటలాడిన ఆలయ వీధులు..
Srisailam: జ్యోతిర్లింగం, శక్తిపీఠం కొలువైన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల ఆలయ ప్రాంగణం కార్తీక పౌర్ణమి సందర్భంగా కిటకిటలాడింది. శివనామ స్మరణతో మారు మోగింది. శ్రీశైలం కార్తీక పౌర్ణమి జ్వాలాతోరణం కార్యక్రమంలో మంత్రి రోజా, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్, నవంబర్26; శ్రీశైలం మహాక్షేత్రంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని జ్వాలాతోరణోత్సవం కన్నులపండువగా నిర్వహించారు. ఆలయ ముందు బాగంలోని గంగధర మండపం వద్ద జ్వాలాతోరణోత్సవాన్ని భక్తులు దర్శించుకునేంధుకు వీలుగా ఏర్పాటు చేశారు. నేతితో తడిపిన నూలు ఒత్తులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్థంబాలపై ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకిలో ఊరేగింపుగా గంగాధర మండపం వద్దకు తోడ్కొని వచ్చి అర్చకులు వేదపండితులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి రోజా, శ్రీశైలం ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి జ్వాలాతోరణం వత్తులకు దివిటిలతొ వెలిగించి జ్వాలాతోరణోత్సవాన్ని వైభవంగా ప్రారంభించారు. నులు వత్తులు పెద్దగా మంటలతో వెలుగుతుండగా ఓం నమఃశివాయ శివాయనమహా అంటూ శివనామస్మరణతో శ్రీశైలం క్షేత్రం మారుమ్రోగింది.
జ్వాలాతోరణోత్సవాన్ని తిలకించిన భక్తులు జ్వాలాతోరణ భస్మాన్ని తీసుకునేందుకు పోటిపడ్డారు. కాలిన భస్మాన్ని నుదుట తిలక ధారణగా ధరించి శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామివారిని దర్శించుకుని పౌర్ణమి పూజలు నిర్వహించారు. కార్తీక పౌర్ణమి రోజున జ్వాలాతోరణోత్సవాన్ని తిలకించి భస్మాన్ని నుదుట తిలకంగా ధరించడం వల్ల సకల పాపాలు తొలగి ఆయుష్షు, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..