Surya Kala |
Updated on: Nov 26, 2023 | 12:14 PM
రకరకాల పూలతో అందంగా అలంకరించిన వాహనాలపై అన్నామలైయార్, నిమ్ములై అమ్మన్‌లను మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే పంజరథ రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తుల శివనామస్మరణతో అరుణగిరి మార్మోగింది. వేలాదిమంది భక్తులు గిరి ప్రదక్షిణ చేశారు.
అరుణాచలంలోని కార్తీక దీపోత్సవాల్లో ప్రధాన ఘట్టం భరణి దీపం. ఈ వేడుకను ఆదివారంఉదయం 5 గంటలకు నిర్వహించారు. అన్నామలైయార్ గర్భగుడి ఎదుట శివాచార్యులు వేద మంత్రోచ్ఛారణలతో పారాణి దీపం వెలిగించారు.
ఈ సందర్భంగా ఆయన అనేకత్వంలోని ఏకత్వాన్ని వివరించారు. అనంతరం అరుణాచలేశ్వర ఆలయం లోపలి ప్రాకారం చుట్టూ తిరుగుతూ నిన్నములైయమ్మన్‌తోపాటు అన్ని సన్నిధానాల్లో పారాణి దీపం వెలిగించారు.
ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో స్వామివారి దర్శనం చేసుకున్నారు.
కార్తీక దీపోత్సవాల్లో మరో అద్భుత ఘట్టం మహాదీపం. ఈ మహాదీపాన్ని ఆలయం వెనుకవైపు ఉన్న 2,668 అడుగుల ఎత్తయిన కొండపై కార్తీక పౌర్ణమి ఘడియల్లో ఆదివారం సాయంత్రం 6 గంటలకు వెలిగిస్తారు.
భక్తులు, ఆలయ నిర్వాహకులు ఈ మహాదీపాన్ని శివనామ స్మరణలతో ఊరేగింపుగా కొండపైకి తీసుకు వెళ్లారు. ఈ మహాదీపాన్ని వీక్షించేందుకు అరుణాచలక్షేత్రానికి వేలాదిగా భక్తులు పోటెత్తారు.
ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం కొండపై 7 అడుగుల పొడవు, 200 కిలోల బరువు కలిగిన జ్యోతిని వెలిగిస్తారు.
ఈ మహాదీపం కోసం భక్తులనుంచి సేకరించిన 3,500 కిలోల నెయ్యి, వెయ్యి మీటర్ల ఖాదీ వస్త్రాన్ని ఆదివారం తెల్లవారుజామున కొండపైకి తీసుకెళ్లారు. కార్తీక దీపోత్సవం సందర్భంగా తిరువణ్ణామలై దీపాల వెలుగులతో మెరిసిపోతోంది.