AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

kamika Ekadashi: ఈ ఏడాది కామిక ఏకాదశి ఎప్పుడు? పూజ ప్రాముఖ్యత? కోరికలు తీరాలంటే వేటిని దానం చేయడం శుభప్రదం అంటే..

ఆషాఢ మాసం కృష్ణ పక్ష ఏకాదశిని కామిక ఏకాదశిగా జరుపుకుంటారు. ఈ కామిక ఏకాదశి రోజున పూజ చేసి ఉపవాసం ఉండడం వలన పాపాలు నశిస్తాయని.. ఈ కామిక ఏకాదశికి పేరుకు తగినట్లే మనసులోని కోరికలను సిద్ధింపచేసే శక్తి ఉందని నమ్మకం. ఈ రోజు ఈ ఏడాది కామిక ఏకాదశి ఎప్పుడు వచ్చింది? పూజా శుభసమయం ఎప్పుడు తెలుసుకుందాం..

kamika Ekadashi: ఈ ఏడాది కామిక ఏకాదశి ఎప్పుడు? పూజ ప్రాముఖ్యత? కోరికలు తీరాలంటే వేటిని దానం చేయడం శుభప్రదం అంటే..
Kamika Ekadashi
Surya Kala
|

Updated on: Jul 14, 2025 | 9:16 AM

Share

హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని కామిక ఏకాదశి అంటారు. ఏకాదశి శ్రీ మహావిష్ణువుకి అంకితం చేయబడినప్పటికీ యోగా నిద్రలో శ్రీ మహా విష్ణువు యోగ నిద్రలో ఉండడంతో శివుడు భూలోకంలో విహరిస్తాడని స్కంద పురాణంలో పేర్కొన్నాడు. వైష్ణవ క్యాలెండర్‌లో కామిక ఏకాదశి శ్రీకృష్ణుడికి అంకితం చేయబడిన అత్యంత పవిత్రమైన రోజు. అయితే ఈ ఏడాది కామిక ఏకాదశి జరుపుకునే విషయంలో గందర గోళం నెలకొంది.

ఈ సంవత్సరం కామిక ఏకాదశి జూలై 20న వచ్చిందా లేదా జూలై 21న వచ్చిందా అని తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉన్నారు. వేద పంచాంగం ప్రకారం ఏకాదశి తిథి జూలై 20న మధ్యాహ్నం 12:12 గంటలకు ప్రారంభమై జూలై 21న ఉదయం 9:38 గంటలకు ముగుస్తుంది, దీనితో కామిక ఏకాదశిని జూలై 21, 2025న అధికారికంగా జరుపుకోవాల్సి ఉందని చెబుతున్నారు.

కామిక ఏకాదశి పూజ శుభ సమయం, ఆచారాలు

కామిక ఏకాదశి ఉపవాస కాలం జూలై 20 మధ్యాహ్నం ప్రారంభమై జూలై 21 ఉదయం వరకు కొనసాగుతుంది. భక్తులు జూలై 22న ఉదయం 5:37 నుంచి 7:05 గంటల మధ్య తమ ఉపవాసాన్ని విరమించవచ్చు. ఈ పవిత్ర సమయం శ్రీ మహా విష్ణువు, లక్ష్మీ దేవిని పూజించడానికి చాలా ముఖ్యమైనది. ఈ రోజున పూజ చేయడం వలన ఆధ్యాత్మిక ప్రయోజనాలను పెంచుతుందని నమ్ముతారు.

భక్తులు సాధారణంగా తెల్లవారుజామున అభ్యంగ స్నానంతో తమ రోజును ప్రారంభిస్తారు, ఆ తర్వాత విష్ణువు స్వరూపమైన శ్రీ కృష్ణుడికి హృదయపూర్వక ప్రార్థనలు చేస్తారు. నైవేద్యాలు సమర్పిస్తారు. ఈ భక్తి రోజున నెయ్యి దీపం వెలిగించడం, భోగం, పువ్వులు సమర్పిస్తారు. ఏకాదశి రాత్రి మేల్కొని ఉండటంతో పాటు, రోజంతా విష్ణు సహస్ర నామం, మంత్రాలు జపించడం భజనలు చేయడం వలన శివ కేశవుల అనుగ్రహం లభిస్తుంది.

కామిక ఏకాదశి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత

కామిక ఏకాదశి రోజున ఉపవాసన్నీ కఠినమైన ఆహార నియమాలతో చేయాల్సి ఉంటుంది. భక్తులు ధాన్యాలు, కాయధాన్యాలు, కొన్ని కూరగాయలకు దూరంగా ఉండాలి. పండ్లు, గింజలు, దుంపలను ఆహారంగా తీసుకోవాలి. ఈ రోజు చేసే ఉపవాసం ఆత్మను శుద్ధి చేస్తుందని, పాపాలను పరిహరిస్తుందని, ఆధ్యాత్మిక వృద్ధిని పెంపొందిస్తుందని నమ్ముతారు. ఈ ఉపవాసాన్ని పాటించడం పవిత్ర స్థలాలను సందర్శించడం కంటే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తారు.

కామిక ఏకాదశి మహత్యం వ్రత కథ

ధర్మవర్తనుడైన యుధిష్ఠిరుడు శ్రీకృష్ణున్ని ఆషాఢ మాసములో కృష్ణ పక్షములో వచ్చే ఏకాదశి మహిమలను గురించి వివరించమని కోరగా వాసుదేవుడు సంతోషించి ఓ రాజా ! ఏకాదశి మహిమలను వివరించటం కూడా పుణ్య కార్యమే.. ఒకసారి నారద మునీంద్రుడు కమలముపై ఆసీనుడై ఉన్న తన తండ్రి బ్రహ్మ దేవుడిని ఇలా అడిగాడు ఆషాఢ కృష్ణ పక్షములో వచ్చే ఏకాదశిని గురించి వివరించండి. ఆ రోజునకు అధిదేవత ఎవరు , వ్రతమును ఆచరించవలసిన విధి విధానమును గురించి తెలపండి” అని కోరాడు

దానికి బ్రహ్మ బదులిస్తూ ” నా ప్రియమైన కుమారుడా ! మానవాళి సంక్షేమం కోసం నీవు అడిగిన విషయములన్నీ వివరించెద. ఆషాఢ కృష్ణ పక్షములో వచ్చే ఏకాదశిని కామిక ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి మహిమ విన్నంతనే అశ్వమేధ యాగ ఫలం లభిస్తుంది. శంఖ, చక్ర గదాధరుడు, తామర పాదములు కలిగి ఉన్నవాడు అయిన శ్రీ మహావిష్ణువును కామిక ఏకాదశి రోజు ఆరాధిస్తారు. ఈ రోజున శ్రీహరిని ఆరాధిస్తే వచ్చే పుణ్యఫలం కాశీలో గంగ స్నానం కన్నా, హిమాలయాలలో ఉండే కేదారనాథుని దర్శనం కన్నా, సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్రంలో ఆచరించే స్నానం కన్నా, సమస్త భూమండలాన్ని దానం చేసిన దానికన్నా , గురు గ్రహం సింహ రాశిలో ఉన్న పౌర్ణమి రోజు,సోమవారం గోదావరి నదిలో పుణ్య స్నానం చేస్తే వచ్చే పుణ్యఫలం కన్నా ఎక్కువ అని చెప్పాడు.

కామిక ఏకాదశీ రోజున భగవద్గీతను విన్నా,చదివినా , శ్రీ విష్ణు సహస్రనామాలతో మహా విష్ణువును పూజించినా నారాయణుడి అనుగ్రహం లభిస్తుంది. తద్వారా మనసులో ఉన్న కామికములు(కోరికలు) నెరవేరతాయి. అంతేకాదు మోక్షం కూడా సిద్ధిస్తుంది.

కామిక ఏకాదశి సందర్భంగా దానధర్మాలను కూడా నొక్కి చెబుతారు. కామిక ఏకాదశి రోజు పాలు ఇచ్చే గోవును, దూడ, గ్రాసములతో కలిపి దానం చేయటం వలన సమస్త దేవతల ఆశీర్వాదం పొందుతారు. లేత తులసి ఆకులతో చేసే పూజ గత జన్మ పాపాలను కూడా తొలగించివేస్తుంది. కామిక ఏకాదశి రోజున తులసి మొక్కనుపూజిస్తే పాపాలు తొలగిపోతాయి. భక్తులు ఆహారం, దుస్తులు, డబ్బును అవసరమైన వారికి, ముఖ్యంగా ఉపవాసం తర్వాత రోజున దానం చేయడం విశేష ఫలితాలను ఇస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.