ఆరోగ్యం గుట్టు విప్పిన చరకుడు.. ఆయుర్వేద శాస్త్రం గురించి ఇంకా ఏమన్నారంటే.?
ఆయుర్వేద వైద్యానికి ఆద్యుడు చరకుడు. 'చరక సంహిత' పేరుతో ఆయన రెండు వేల ఏళ్ళ క్రితమే ఆయుర్వేద శాస్త్రాన్ని రాసి..

ఆయుర్వేద వైద్యానికి ఆద్యుడు చరకుడు. ‘చరక సంహిత’ పేరుతో ఆయన రెండు వేల ఏళ్ళ క్రితమే ఆయుర్వేద శాస్త్రాన్ని రాసి ప్రపంచానికి అందించాడు. దేవతలు వైద్యానికి సంబంధించిన వారు అశ్విని దేవతలు. అశ్విని దేవతలే తనకు ఆయుర్వేద వైద్యశాస్త్రాన్ని బోధించి గ్రంథస్థం చేయించారని చరక సంహితలో చరకుడు రాసుకున్నాడు. ఆయుర్వేద వైద్యానికి కొద్దిగా ఆధ్యాత్మిక చింతనను కూడా జోడించి ఆయన రాసిన చరక సంహిత క్రమంగా ఆయుర్వేద వైద్యులకు ప్రామాణిక గ్రంథం అయింది. ప్రముఖ సంస్కృత, ప్రాకృత వ్యాకరణ పండితుడు పాణిని ఆయనకు సహధ్యాయి. చరకుడి గురించి ఆయన తన గ్రంథాల్లో అనేక విశేషాలను వెల్లడించాడు. చరకుడు అసలు ఎలా ఆయుర్వేద వైద్య శాస్త్రాన్ని రాశాడో పాణినీ చాలా చక్కగా వివరించాడు.
ఒక రోజున చరకుడు ఆయుర్వేద వైద్యశాస్త్రాన్ని రాయటానికి తన ఇంటి ముందున్న ఓ చెట్టు కింద కూర్చున్నాడు. తన గ్రంథాన్ని ఎలా ప్రారంభించాలో, అందులో ఏం రాయాలో అంతుబట్టక ఆయన తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ఆయనకు ఏమీ తోచడం లేదు. ఆ సమయంలో ఆ చెట్టు మీద వాలిన ఒక కొంగలాంటి పక్షి అరవటం మొదలు పెట్టింది. ఆ పక్షి అరుపు ఆయనకు ‘కోరుక్’ అన్నట్టుగా వినిపించింది. కోరుక్ అంటే ఎవరు ఆరోగ్యవంతుడు అని సంస్కృతంలో అర్థం. ఆయన వెంటనే ‘హిత భు క్’ అని ఆ పక్షికి సమాధానంగా చెప్పాడు. హిత భుక్ అంటే హితంగా భుజించేవాడని అర్థం. హితంగా అంటే శరీరానికి ఎంత అవసరమో అంతే భుజించాలి అని అర్థం చేసుకోవాలి. చరకుడు హిత భుక్ అన్నప్పటికీ ఆ పక్షి కోరుక్ అని అరుస్తూనే ఉంది. చరకుడు ఈసారి ‘మిత భుక్ ‘ అని జవాబు ఇచ్చాడు. అంటే మితంగా తినేవాడని అర్థం. అయినప్పటికీ అది అరుస్తూనే ఉంది. ఆయన కొద్దిసేపు ఆలోచించి, తల పైకెత్తి, ‘ మేథ్య భుక్ ‘ అని సమాధానం ఇచ్చాడు. అయినప్పటికీ అది అరవటం ఆపలేదు. అది అరుస్తూనే ఉంది.
ఆయన ఈసారి మరింత దీర్ఘంగా ఆలోచించాడు. ఆయనలో పట్టుదల పెరిగింది. ఆ పక్షిని చూస్తూ ఆయన ఈసారి ‘ హిత, మిత, మే థ్య భుక్ ‘ అని గట్టిగా అరుస్తూ సమాధానం ఇచ్చాడు. ఆ మాట వినగానే ఆ పక్షి టప టపా రెక్కలు ఆడిస్తూ ఎగిరిపోయింది. హితంగాను, మితంగాను, పరిశుభ్రంగాను భుజించేవాడని ఆ వాక్యానికి అర్థం. అశ్వినీ దేవతలే పక్షి రూపంలో వచ్చి తనకు ఆయుర్వేద శాస్త్ర రచనకు పునాది వేశారని ఆయన అర్థం చేసుకున్నాడు. ఇదే ఆరోగ్య సూత్రంతో ఆయన వైద్యశాస్త్రాన్ని రాయటం మొదలుపెట్టాడు. ఈ కథను పాణినీ స్వయంగా లోకానికి వెల్లడించాడు. ఆరోగ్యం సలక్షణంగా ఉండాలన్నా, ఆరోగ్యం మెరుగుపడాలన్నా తప్పనిసరిగా ఈ ఆరోగ్య సూత్రాన్ని పాటించాలని ఆయన ఆయుర్వేద వైద్యశాస్త్రంలో మొదటి వాక్యంగా రాశాడు.