AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఆత్రేయపురం మీసాల వేణుగోపాలుడి గురించి మీకు తెలుసా? 400 ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ టెంపుల్ విశేషాలు మీకోసం..

తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం పేరు వినగానే నోరూరించే పూతరేకులు గుర్తుకొస్తాయి. కానీ ఆ ప్రాంతం వారికి కృష్ణుడు అనగానే చటుక్కున గుర్తుకు వచ్చేది మీసాల వేణుగోపాల కృష్ణయ్య. అఖండ గోదావరి రెండు పాయలై.. వశిష్ఠ, గౌతమి నదులయ్యాయి. ఆ నదులను ఆనుకున్న ప్రధాన కాలువలూ కనుచూపు మేర పచ్చని పంట పొలాలతో ప్రకృతి సోయగాల మధ్య అలరారే పల్లెటూరు పులిదిండి గ్రామం.

Andhra Pradesh: ఆత్రేయపురం మీసాల వేణుగోపాలుడి గురించి మీకు తెలుసా? 400 ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ టెంపుల్ విశేషాలు మీకోసం..
Lord Sri Krishna
Pvv Satyanarayana
| Edited By: Shiva Prajapati|

Updated on: Sep 06, 2023 | 7:22 AM

Share

Andhra Pradesh: తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం పేరు వినగానే నోరూరించే పూతరేకులు గుర్తుకొస్తాయి. కానీ ఆ ప్రాంతం వారికి కృష్ణుడు అనగానే చటుక్కున గుర్తుకు వచ్చేది మీసాల వేణుగోపాల కృష్ణయ్య. అఖండ గోదావరి రెండు పాయలై.. వశిష్ఠ, గౌతమి నదులయ్యాయి. ఆ నదులను ఆనుకున్న ప్రధాన కాలువలూ కనుచూపు మేర పచ్చని పంట పొలాలతో ప్రకృతి సోయగాల మధ్య అలరారే పల్లెటూరు పులిదిండి గ్రామం. గౌతమీ గోదావరి నది చెంతనే ఉన్న ఆ గ్రామం మధ్యలో మీసాల వేణుగోపాల స్వామి కృష్ణుడు స్వయంభువుగా వెలిసిన ఆలయం ఉంది. ప్రస్తుతం నాలుగు తరాలుగా గ్రామంలో పూజలు అందుకుంటున్న ఈ వేణుగోపాల స్వామి కృష్ణుడు పురాతన ఆలయం ప్రాంతంలో నూతన ఆలయాన్ని నిర్మించుకుంటున్నారు గ్రామస్తులు తో పాటు ప్రభుత్వ అధికారులు. కృష్ణాష్టమి సందర్భంగా ఆత్రేయపురం మండలంలో ఉన్న దేశంలోనే రెండు ఆలయాల్లో ఒకటైన మీసాల వేణుగోపాల కృష్ణుడి గురించి తెలుసుకుందాం..

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మీసాలు ఉన్న వేణుగోపాల కృష్ణుడు ఆలయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేసింది టీవీ9. దేశంలోనే రెండో ఆలయం మీసాల వేణుగోపాల కృష్ణుడు ఆలయం ఎక్కడుంది?. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం పులిదిండిలో స్వయంభుగా వెలిశాడు వేణుగోపాల కృష్ణుడు. సాధారణంగా కృష్ణుడు అనగానే మీసాలు అస్సలే ఉండవు కానీ ఇక్కడ మీసాల వేణుగోపాల కృష్ణుడుకి మంచి ప్రాముఖ్యత ఉంది అంటున్నారు ఆత్రేయపురం మండలం పులిదిండి గ్రామస్తులు.

అసలు కృష్ణుడికి మీసాలు ఉంటాయా.. సినిమాల్లో కానీ కృష్ణుడు ఆలయంలో కానీ కృష్ణుడికి అసలు మీసాలే ఉండవు. కానీ ఈ పులిదిండి గ్రామంలో మాత్రం స్వయంభుగా వెలసిన వేణుగోపాల కృష్ణుడికి మీసాలు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తాయి. ప్రస్తుతం నూతన ఆలయం నిర్మాణంలో ఉండడంతో ఈ ఆలయంలో ఉన్న వేణుగోపాలకృష్ణుడిని స్వయంభు విగ్రహాన్ని ధాన్యంలో పడుకోపెట్టారు ఆలయ అర్చకులు. అసలు ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలి? వివరాలు తెలుసుకుందాం. రాజమండ్రి నగరానికి సుమారు 27 కి.మీ. దూరంలో పులిదిండి గ్రామం ఉంది. రాజమండ్రి నుంచి రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. సుమారు 400 ఏళ్ళ కిందట వెలసిన పులిదిండి వేణుగోపాల స్వామి నల్లరాతి విగ్రహం విలక్షణంగా ఉంటుంది. కుడిచేతిలో శంఖం, ఎడమ చేతిలో చక్రం ధరించి, మీసాలతో శోభాయమానంగా స్వామి భక్తులకు దర్శనమిస్తారు. నిండు మనసుతో కొలిస్తే, కోరిన కోర్కెలను తీర్చే దైవంగా భక్తులు మీసాల వేణుగోపాలుణ్ణి ఆరాధిస్తారు.

మీసాల వేణుగోపాల స్వామివారికి ఏటా ఐదు రోజుల పాటు పులిదిండి గ్రామంలో వైభవంగా కళ్యాణం, కృష్ణాష్టమి వేడుకలతో పాటు కృష్ణాష్టమి వేడుకల రోజు పంచిపెట్టే ప్రత్యేకమైన ప్రసాదం కోసం క్యూ కడతారు గ్రామస్తులు. నిత్య ధూపదీప నైవేద్యాలూ జరుగుతున్నాయి. స్వయంభుగా వెలసిన వేణుగోపాల కృష్ణుడు ఆలయానికి వచ్చిన భక్తులు మొక్కుకుంటే పెళ్ళిళ్ళు జరుగుతాయన్న నమ్మకం కూడా ఉంది. ప్రస్తుతం పురాతన ఆలయం ప్రాంతంలో కొత్త ఆలయానికి మెరుగులు దిద్దుతున్నారు. మీసాల వేణుగోపాల కృష్ణుడు ఆలయంలో 1967లో విడుదలైన సాక్షి సినిమా చిత్రీకరణ ఈ ఆలయంలోనే జరిగింది. ప్రముఖ నటులు కృష్ణ, విజయనిర్మల మీద వివాహ దృశ్యాన్ని తీశారు. ఈ స్వామి దగ్గర పెళ్ళి సీన్‌ నటించారు కాబట్టి మీకు నిజంగా వివాహం జరుగుతుందని హాస్య నటుడు రాజబాబు వారితో అన్నారని ఆనవాయితీగా వస్తున్న ఈ ఆలయంలో పూజారి చెప్తున్నారు.

ఆ తరువాత కృష్ణ, విజయనిర్మల తెలంగాణలో నెమలి గ్రామంలో ఉన్న మీసాల కృష్ణుడు ఆలయంలో కృష్ణ విజయనిర్మల దంపతులయ్యారనీ చెప్తున్నారు. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో విజయనిర్మల స్వయంగా చెప్పారు కూడా. ఇదే విషయాన్ని గ్రామస్తులతో పాటు ఆలయంలో పూజారు కూడా చెప్తున్నారు.

కొత్త ఆలయం..

ప్రస్తుతం పులిదిండి మీసాల కృష్ణుడు పాత ఆయలం పాక్షికంగా దెబ్బతినడంతో ఇదే ఆలయం ప్లేసులో కొత్త నమూనాతో నూతన ఆలయం నిర్మిస్తున్నారు గ్రామస్తులతో పాటు ప్రభుత్వ అధికారులు.. పురాతన ఆలయంగా ఈ గ్రామంలో మీసాల వేణుగోపాల కృష్ణుడికి ప్రత్యేక పురాణాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయంలో గ్రామానికి చెందిన ప్రొడ్యూసర్ సాక్షి సినిమాతో పాటు బాపు దర్శకత్వంలో రూపొందిన బుద్ధిమంతుడు, ముత్యాలముగ్గు, తూర్పు వెళ్ళే రైలు.. తదితర చిత్రాల షూటింగ్‌ ఈ ఆలయంలో జరిగింది. ఆత్రేయపురంలో పూతరేకులు ఎంత ఫేమస్ ఈ మీసాల కృష్ణుడు కూడా ఈ గ్రామానికి అంతే ఫేమస్. ఈ ఆలయంలో పెళ్లి కావాలని కోరుకుంటే కచ్చితంగా పెళ్లి అవుతుంది అనేది నానుడి అంటున్నారు గ్రామస్తులు.

మీసాల వేణుగోపాలస్వామి క్రిష్ణాలయం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దేశంలోనే ఒక ఆలయం అయితే రెండో ఆలయం తెలంగాణ నెమలి గ్రామంలో ఉందని చెబుతున్నారు..ఈ ఆలయంలో అఖండ దీపం వెలుగుతూ ఉంటుందట. ఈ వేణుగోపాల మీసాల కృష్ణుడు ఆలయాలు రెండు.. సుమారు 400 ఏళ్ళ నుంచి ఆనవాయితీగా వస్తున్నాయట. తెలంగాణలో ఉన్న వేణుగోపాల స్వామి ఆలయంలో నిరంతరాయంగా దీపం వెలుగుతూనే ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. దీనివల్ల గ్రామం పాడిపంటలు, సిరిసంపదలతో తులతూగుతుందని వారి నమ్మకం. వ్యవసాయ పనులు మొదలు పెట్టగానే స్వామికి ముడుపులు కడతారు. అలాగే, ఎలాంటి వివాదమైనా వేణుగోపాలుని ఆలయం మెట్లు ఎక్కితే ఇట్టే పరిష్కారం అవుతుందనీ, స్వామి సన్నిధిలో అబద్ధం ఆడినవారికి తప్పదని స్థానికులు విశ్వసిస్తారు. ఇంత ప్రత్యేకత ఉన్నది మీసాల వేణుగోపాల స్వామి ఆలయాలు ఎందుకు వెలుగులకు రాలేదనీ అని భక్తులు ప్రశ్నించుకుంటున్నారు. ఇప్పటికైనా ఇలాంటి ప్రత్యేకమైనటువంటి అరుదైన ఆలయాలను ప్రభుత్వ దేవాదాయ శాఖ అధికారులు వెలుగులోకి తీసుకొచ్చి ప్రజలకు ఈ ఆలయాల చరిత్రలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..