AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hindu Temple in US: టెక్సాస్‌లో నిర్మాణంలో మరో హిందూ ఆలయం హరిహర క్షేత్రం! ఘనంగా బాలాలయం ప్రారంభోత్సవం

అమెరికాలో హిందూ ప్రాబల్యం మరింత పెరుగుతోంది. ఇప్పటికే ప్రధాన నగరాల్లో హిందూ ఆలయాల నిర్మాణం జరిగింది. తాజాగా మరో ఆధ్యాత్మిక క్షేత్ర నిర్మాణానికి బీజం పడింది. టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్ నగరంలో భారీ ఆలయాన్ని నిర్మించబోతున్నారు. 375 కింగ్ రియా జార్జ్ టౌన్ లో హరిహర క్షేత్రం పేరుతో శైవ, వైష్ణవ ఆలయాన్ని నిర్మించబోతున్నారు.

Hindu Temple in US: టెక్సాస్‌లో నిర్మాణంలో మరో హిందూ ఆలయం హరిహర క్షేత్రం! ఘనంగా బాలాలయం ప్రారంభోత్సవం
Puja In Us
Surya Kala
|

Updated on: Nov 26, 2024 | 1:41 PM

Share

టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్ నగర శివారులో దాదాపు 25 ఎకరాల విశాలమైన స్థలంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో శైవ, వైష్ణవ ఆలయ నిర్మాణం చేపట్టబోతున్నారు. స్థల సేకరణ పూర్తయి, ముందస్తు నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి.

టెక్సాస్ లో ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రంగా హరిహర క్షేత్రం..

హరిహర క్షేత్ర ఆలయాన్ని ఇతర ఆలయాల కన్నా భిన్నంగా ఉండేలా నిర్మించనున్నారు. టెక్సాస్‌లోని హిందూ సమాజానికి ఆధ్యాత్మికంగా, సాంస్కృతిక కార్యక్రమాలకు కేంద్రంగా తీర్చిదిద్దనున్నారు. సమీప భవిష్యత్తులో సనాతన భారతీయ సంప్రదాయంతో పాటు కమ్యూనిటీపరంగా ఆధ్యాత్మికను ప్రతిబింబించే వేదికను సృష్టించడమే తమ లక్ష్యమని ఆలయ కమిటీ చైర్మన్, కేబీకే గ్రూప్ ఛైర్మన్, సీఈఓ డా. కక్కిరేణి భరత్ కుమార్ తెలిపారు.

తాత్కలికంగా బాలాలయం..

ప్రస్తుతం ఈ 375 కింగ్ రియా జార్జ్ ప్రదేశంలో తాత్కాలికంగా ఒక బాలాలయాన్ని నెలకొల్పారు. ఈ ఆధ్యాత్మిక కేంద్రంలో ఇటీవలే బాలాలయం ప్రారంభోత్సవం భారీ వేడుకగా జరిగింది. ఆలయ చైర్మన్ భరత్ కుమార్ మార్గనిర్దేశంలో అక్టోబరు 20న హరిహర క్షేత్రం బాలాలయం ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ ఆలయ ప్రారోంభోత్సవానికి స్థానికంగా ఆస్టిన్ నగరంలోని హిందూ కుటుంబాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచి బాలాలయ ప్రాంగణమంతా భక్తులతో నిండిపోయింది. వేద మంత్రోచ్ఛరణలు, ధూపద్రవ్యాలు, సాంప్రదాయ దుస్తులతో ఆ ప్రాంతం అంతా సాంస్కృతిక, ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. ప్రారంభోత్సవంలో భాగంగా వేద మంత్రోచ్ఛరణలతో మహా కుంభాభిషేకం అనంతరం పూజలు, అర్చనలు నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

కన్నుల పండువగా వేంకటేశ్వర స్వామి కళ్యాణం

బాలాలయ ప్రారంభోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన భూదేవి శ్రీదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణం కన్నుల పండువగా సాగింది. ఆస్టిన్ నగరంలో నివాసం ఉంటున్న భక్తులు పెద్ద ఎత్తున హాజరై శ్రీవారి కళ్యాణోత్సవాన్ని తిలకించారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం టెంపుల్ వాలంటీర్లు అన్నదానం చేశారు. సాయంకాలం ఆటపాటలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు. కళాకారుల బృందం ప్రదర్శనలు, శృతి కొండాయిల నృత్య ప్రదర్శన ఆద్యంతం ఆకట్టుకుంది.

నిత్య పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు

ప్రస్తుతం ఈ బాలాలయంలో భూదేవి శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామి, గణపతి, అయ్యప్ప స్వామి విగ్రహాలను ప్రతిష్ఠించి నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. బాలాలయ ప్రాణ ప్రతిష్టకు ముందు కూడా ఈ ప్రదేశంలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించారు. అందులో భాగంగా 200 పైగా పర్యావరణ హిత మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. దసరా సందర్భంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు, బతుకమ్మ వేడుకలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

కార్తిక పౌర్ణమికి సామూహిక సత్యనారాయణ వ్రతాలు

ఈ హరిహర క్షేత్రంలో కార్తీక మాస శోభ సంతరించకుంది. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా నవంబర్ 15న సాయంత్రం పెద్ద ఎత్తున సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. పాల్గొనే వారి కోసం చేపట్టిన ముందస్తు రిజిస్ట్రేషన్లకు భక్తుల నుంచి ఊహించని స్పందన వచ్చింది.

ఆధ్మాత్మిక క్షేత్రం.., ఆహ్లాదకర ప్రదేశం..

హరిహర క్షేత్రానికి విచ్చేసే భక్తుల కోసం పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తోంది. ఈ బాలాలయ దివ్య క్షేత్ర సందర్శనకు వచ్చే కుటుంబాలకు నిత్య పూజల అనంతరం హాయిగా సేదతీరడానికి పలు సౌకర్యాలను నెలకొల్పుతోంది. చిన్నారులు ఆడుకునేందుకు వివిధ పరికరాలతో పార్క్ ను కూడా ఏర్పాటు చేశారు.

హరిహర క్షేత్రం క్యాంటీన్..

ఆలయ సందర్శన కోసం వచ్చే భక్తులకు భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేసింది ఆలయ కమిటి. హరిహర క్షేత్రం క్యాంటీన్ ద్వారా స్వచ్ఛమైన రుచికరమైన భోజన సదుపాయం కల్పించారు. ఈ సౌకర్యాలతో, హరిహర క్షేత్రం ఆధ్యాత్మిక కార్యక్రమాలతోపాటు ఆహ్లాదకరమైన వాతావరణంతో స్థానిక హిందువులకందరికీ సాదరంగా ఆహ్వానం పలుకుతోంది. వారాంతాల్లో పిల్లలతో హాయిగా సేదతీరడానికి చక్కని డెస్టినేషన్ పాయింట్ గా మారింది ఈ హరిహరక్షేత్రం. ఆలయ కమిటీ లో దిలీప్ రెడ్డి బందెల, ప్రదీప్ యాసం, ప్రణయ్ తేజ తడకమళ్ల, కిరణ్ కుమార్ కక్కిరేణి, పూర్ణ కొప్పుల, జయ వైష్ణవి కొప్పిశెట్టి, అన్విత రెడ్డి సరసాని, చక్రపాణి రెడ్డి చిట్ల, తదితరులు ఉన్నారు.

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..