Katas Raj Temple in Pakistan: పాకిస్తాన్‌లో పరమశివుడి ఆలయం.. దాయాది దేశంలో విరాజిల్లుతున్న భోళాశంకరుడు

Katas Raj Temple: ఈశ్వరుడి కన్నీరు ఒక జలపాతమై..శివుడి కంటనీరు చూడాలంటే మనం పాకిస్తాన్‌కు వెళ్లాలి. చదవండి ఈ సూపర్‌ ఎక్స్‌క్లూజివ్‌ స్టోరీని.

Katas Raj Temple in Pakistan: పాకిస్తాన్‌లో పరమశివుడి ఆలయం.. దాయాది దేశంలో విరాజిల్లుతున్న భోళాశంకరుడు
katas raj temple
Follow us

|

Updated on: Mar 11, 2021 | 8:04 PM

Shri katas raj temple: మహాశివుడు మహోగ్రరూపుడు. ముక్కంటి.. మూడో కన్ను తెరిస్తే భస్మమే. సర్వేశ్వరుడిని లయకారుడు. కానీ అంతటి ఉగ్రేశ్వరుడి కంట కన్నీరు వచ్చిందని మనలో ఎంతమందికి తెలుసు. ఈశ్వరుడి కన్నీరు ఒక జలపాతమై.. ఒక కొలనుగా మారిందని మీకు తెలుసా? ఆ కొలను ఎక్కడుందో మనలో చాలామందికి తెలియదు. శివుడి కంటనీరు చూడాలంటే మనం పాకిస్తాన్‌కు వెళ్లాలి. చదవండి ఈ సూపర్‌ ఎక్స్‌క్లూజివ్‌ స్టోరీని.

మనిషి ప్రకృతి శక్తులను కొలిచిన తర్వాతి దశలో శివుడు ఆదిదేవుడు అయ్యాడు. ఆ దేవాదిదేవుడి శివలింగాలు అఖండ భారతంతోపాటు.. వివిధ దేశాలలో కొలువై ఉన్నాయి. పరమశివుడు కంటనీరు పెట్టిన చోటు పాకిస్తాన్‌లో ఉంది. పాకిస్తాన్‌లోని అత్యంత పురాతనమైన ఆలయం ఇది.

భారతీయ పురాణాలలో ప్రస్తావన ఉన్న పవిత్రమైన చోటు ఇది. దీని పేరు కటాస్‌రాజ్‌ ఆలయం. పాకిస్తాన్‌లో పంజాబ్‌ రాష్ట్రంలోని చక్వాల్‌ జిల్లాలో ఉంది ఈ విఖ్యాత చారిత్రక ఆలయం.  శివరాత్రివేళ.. భక్తజనం దర్శించుకునేచోటు ఇది. పాకిస్తానే కాదు.. భారత్‌లోని హిందువులంతా వచ్చే ఆలయం ఇది. కటాస్‌రాజ్‌ టెంపుల్‌ పాకిస్తాన్‌లోని ఒక ప్రధాన టూరిస్ట్‌ స్పాట్‌. పాకిస్తాన్‌లోని ముస్లింలు కూడా గొప్పగా చెప్పుకున్న దేవాలయం ఇది. పాకిస్తాన్‌ మాజీ ఫాస్ట్‌ బౌలర్ షోయబ్‌ అఖ్తర్‌ కూడా కటాస్‌రాజ్‌ ఆలయం గురించి చాలా సోషల్ మీడియా వేదిక చాలా సార్లు పోస్ట్ చేశాడు. ఇస్లామాబాద్‌ నుంచి లాహోర్‌కు వెళుతూ ఈ ఆలయ గొప్పతనం గురించి వివరించాడు.

షోయబ్‌ అఖ్తర్‌ చెబుతున్న ఈ ఆలయ చరిత్రను, శివుడి కన్నీటికథను మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకుందాం. దక్ష ప్రజాపతి ఒక మహా యజ్ఞం చేస్తాడు. తన బిడ్డ అయిన సతీదేవిని, అల్లుడు మహాశివుడిని ఈ యజ్ఞానికి ఆహ్వానించడు. అందరినీ ఆహ్వానించిన దక్షుడు.. తనను, శివుడిని పిలవకపోవడం- సతీదేవి అవమానంగా భావిస్తుంది. ఆత్మార్పణ చేసుకుంటుంది. సతీదేవి ఆత్మార్పణ మహాశివుడికి కోపం తెప్పిస్తుంది. బాధను కలిగిస్తుంది. అలా నీలకంఠుడు బాధను దిగమించి.. కన్నీళ్ల పర్యంతం అవుతాడు.

శివుడి కంటనీరుతో కటాస్‌రాజ్‌ తటాకం ఏర్పడిందని నమ్మకం. కటాస్‌ అన్న పేరుకు మూలం కటాక్ష అనే సంస్కృత పదం.  కటాస్‌ అంటే కన్నీటి ఊట అని అర్థం. దీనికి అమర్‌కుండ్‌, చమస్‌కుండ్‌, కటాక్షకుండ్‌ అనే పేర్లు ఉండేవి. కటాస్‌రాజ్‌ తటాకాన్ని ఉర్దూలో చష్మ్‌-ఎ-ఆలమ్‌ అంటున్నారు. ఈ సరస్సులో స్నానం చేస్తే పాపాలు పోతాయని భక్తుల విశ్వాసం. రాముడు, హనుమంతుడు, శివుడి ఆలయాలు ఇక్కడ ఉన్నాయి.

సిక్కు మత వ్యవస్థాపకుడు గురునానక్‌ కూడా ఈ కటాస్‌రాజ్‌ ఆలయాన్ని సందర్శించినట్లు చరిత్ర చెబుతోంది. బైసాఖి ఉత్సవంలో భాగంగా 1806లో గురునానక్‌ కటాస్‌రాజ్‌ ఆలయంలో శివుడిని దర్శించుకున్నారు. దేశవిభజనకు ముందు కటాస్‌రాజ్‌ టెంపుల్‌కు భారతీయులు కూడా వెళ్లేవారు. కానీ కాలక్రమేణా భారత్‌ నుంచి రాకపోకలు తగ్గిపోయాయి. 2005లో నాటి ఉపప్రధాని ఎల్‌.కె.అద్వానీ ఈ కటాస్‌రాజ్‌ ఆలయాన్ని సందర్శించారు. ఆలయ నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఈ ఆలయ పునరుద్ధరణకు చర్యలు చేపడతామని పాక్‌ సర్కార్‌ అప్పట్లో తెలిపింది.

పాకిస్తాన్‌లో ఉగ్రవాదం వల్ల, అక్కడి అస్థిరత వల్ల- భారతీయులు కాలక్రమేణా కటాస్‌రాజ్‌ టెంపుల్‌ను సందర్శించడం తగ్గిపోయింది. అయితే- ఈ ఆలయానికి ఉన్న పౌరాణిక విశిష్టతల వల్ల దీనికి పరాయిదేశంలోనూ ప్రత్యేకత కనిపిస్తోంది. ఈ చారిత్రక సంపదను కాపాడుకోవడానికి పాక్‌ ప్రభుత్వం కూడా అంగీకరించింది.

కటాస్‌రాజ్‌ ఆలయంలోని శివలింగాన్ని శ్రీకృష్ణుడు స్వయంగా తయారుచేసినట్లుగా చెబుతారు. అందుకే ఈ తీర్థక్షేత్రానికి అంతటి ఘనకీర్తి లభించింది. పాండవులు తమ వనవాసంలో భాగంగా ఇక్కడ గడిపారట. అలాగే యక్షుడు పాండవుల్ని ప్రశ్నలు అడిగిన ప్రదేశంగా చెబుతారు. వాస్తవానికి ఈ ప్రాంతమంతా క్షారనేలల ప్రాంతం. అంటే నేలలో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇక్కడి నీటి వాడకం కాస్త తక్కువే.

పాకిస్తాన్‌లోని కటాస్‌రాజ్‌ ఆలయం గురించి సరిహద్దు రాష్ట్రాల ప్రజలకు తెలిసినంతగా ఇతర ప్రాంతాల్లోని భారతీయులకు పెద్దగా తెలియదు. పాక్‌ ప్రభుత్వం అనుమతి ఇస్తే శివుడి కంటనీరు ప్రవహించిన ఈ ప్రాంతానికి వెళ్లడానికి హిందువులు ఆసక్తిగా ఉన్నారు. కానీ పాకిస్తాన్‌ విదేశమే కావచ్చు.. కానీ అఖండ భారతంలో ఒకప్పుడు భాగమే. శివలింగాలు కేవలం పాకిస్తాన్‌కే పరిమితం కాలేదు.  ఆసియా ఖండంలోని ఇతర దేశాల్లోనూ, యూరప్‌, దక్షిణ అమెరికా, సెంట్రల్‌ ఏషయన్‌ కంట్రీస్‌లోనూ ఉన్నాయి.

ఇవి కూడా చదవండి..

Gunathilaka Out or not?: లంక, విండీస్ వన్డేలో వివాదం.. బంతిని కాళ్లతో తన్నాడని బ్యాట్స్‌మెన్ గుణతిలక ఔట్..!

Jati Ratnalu Movie: ‘జాతి రత్నాలు’ ట్విట్టర్ రివ్యూ: హిట్టు బొమ్మ.. కామెడీ అదుర్స్.. బ్లాక్‌బస్టర్ లోడింగ్.!