Gudi Padwa 2025:ఉగాదిని మరాఠీలు గుడి పడ్వాగా జరుపుకుంటారు.. ఈ రోజున ఇంటి ముందు గుడిని ఎందుకు ఎగరవేస్తారో తెలుసా..
హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం చైత్ర మాసం మొదటి రోజుని తెలుగు వారు ఉగాదిగా జరుపుకుంటారు. మరాఠీలు గుడి పడ్వా జరుపుకుంటారు. హిందువులకు కొత్త సంవత్సరం ప్రారంభాన్ని సూచించే వసంతకాల వేడుకను ఒకొక్క ప్రాంతంలో ఒకొక్క పేరుతో జరుపుకుంటారు. ఈ పండగ హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో ఒకటి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర , కొంకణి హిందువులు గోవా అండ్ డామన్ , చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ పండగను చాలా ఘనంగా జరుపుకుంటారు. అయితే ఈ గుడి పడ్వా పండగను ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందాం...

హిందూ క్యాలెండర్ ప్రకారం.. చైత్ర మాసంలోని శుక్ల పక్షం పాడ్యమి తిథిని ఉగాది గా, గుడి పడ్వగా జరుపుకుంటారు. ఈ పండగ హిందూ నూతన సంవత్సర ప్రారంభానికి ప్రతీకగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక దీనిని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ ఏడాది ఉగాది పండుగ మార్చి 30వ తేదీ ఆదివారం రోజున జరుపుకోనున్నారు. ఈ రోజును మరింత పవిత్రంగా భావిస్తారు. ఒకొక్క ప్రాంతంలో ఒకొక్క సంప్రదాయ పద్దతిలో ఈ పండగను జరుపుకుంటారు. మరాఠీలు గుడి పడ్వాగా ఘనంగా జరుపుకుంటారు. ‘గుడి’ అంటే ‘జెండా.. ‘పడ్వా’ అంటే ‘మొదటి రోజు’. ఈ రోజున మరాఠీల ఇళ్లలో ఒక గుడి ఎగురవేయడం అనే సంప్రదాయం. ఇలా చేయడం వల్ల జీవితంలో ఆనందం, సుఖ సంతోషాలు లభిస్తాయని నమ్మకం. అయితే ఈ పండుగ ఎలా ప్రారంభమైంది, దీని వెనుక ఉన్న పురాణ కథ ఏమిటి తెలుసుకుందాం..
గుడి పడ్వా ఎందుకు జరుపుకుంటారంటే..
గుడి పడ్వాకు సంబంధించిన ఒక కథ రామాయణ కాలంతో ముడిపడి ఉంది. పురాణం ప్రకారం త్రేతా యుగంలో కిష్కింధ అనే రాజ్యాన్ని వాలి అనే రాజు పరిపాలించేవాడు. వాలి తన సోదరుడు సుగ్రీవుడిని వేధించేవాడు. శ్రీరాముడు 14 సంవత్సరాలు వనవాసం చేసే సమయంలో రావణుడు.. సీతాదేవిని అపహరించాడు. శ్రీ రాముడు సీత దేవి జాడ కోసం వెతుకుతున్నప్పుడు.. సుగ్రీవుడిని కలిశాడు. శ్రీరాముడు.. సుగ్రీవుడిని కలిసిన తర్వాత.. సుగ్రీవుడు తన కష్టాలను చెప్పి సహాయం కోరాడు.
సుగ్రీవునికి సహాయం చేస్తానని మాట ఇచ్చిన రాముడు వాలిని వధించాడు. సుగ్రీవునికి న్యాయం చేసి.. అతని రాజ్యం అతనికి తిరిగి ఇచ్చాడు. ఈ సంఘటన చైత్ర మాసంలోని శుక్ల పక్షంలోని పాడ్యమి తిథిలో జరిగిందని నమ్మకం. అందుకే ఈ రోజును విజయ దివస్‌గా జరుపుకుంటారు. మరొక పురాణం ప్రకారం.. ఈ రోజున బ్రహ్మ దేవుడు విశ్వాన్ని సృష్టించాడు.. కనుక ఈ రోజు నుంచి హిందూ నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. మహారాష్ట్రలో దీనిని జరుపుకోవడానికి ప్రధాన కారణం మరాఠా పాలకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ యుద్ధంలో విజయం సాధించడం.
గుడి పడ్వా ప్రాముఖ్యత
మహారాష్ట్రలో గుడి పడ్వా పండుగను హిందూ నూతన సంవత్సరం ప్రారంభం రోజుగా, విజయానికి చిహ్నంగా జరుపుకుంటారు. ఈ రోజున మరాఠీ సమాజానికి చెందిన ప్రజలు ఒక వెదురు కర్రను తీసుకొని దానిపై తలక్రిందులుగా ఉన్న వెండి, రాగి లేదా ఇత్తడి కలశం ఉంచుతారు. దానిపై కాషాయ రంగు జెండాను ఉంచి.. వేప ఆకులు, మామిడి ఆకులు, పూలతో అలంకరించి, ఇంట్లో ఎత్తైన ప్రదేశంలో ఉంచుతారు. ఇలా చేయడం వలన ఇంట్లో సుఖ సంతోషాలు, సిరి సంపదలకు లోటు ఉండదని నమ్మకం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు