Summer Gardening Tips: ఎండ వేడికి మొక్కలు వాడిపోతున్నయా.. మొక్కలు పచ్చగా ఉండాలంటే.. సింపుల్ టిప్స్ మీ కోసం
వేసవి కాలం వచ్చేసింది. భానుడు తన ప్రతాపం చూపించడం మొదలు పెట్టాడు. ఎండ వేడికి మనుషులే నీరసం బారిన పడితే.. ఇక మొక్కలు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ వేసవి కాలం ముగిసే సమయానికి, చాలా మొక్కలు ఎండిపోతాయి. చిన్న చిన్న మొక్కలు అంతరించిపోతాయి. కనుక వేసవిలో తోటలోని పూల మొక్కల పట్ల కొంత జాగ్రత్త తీసుకోవాలి. కొన్ని రక్షణ చర్యలు పాటిస్తేనే ఇంట్లోని ఈ పూల తోట ఈ మండే ఎండలో కూడా పచ్చగా ఉంటుంది. ఈ రోజు వేసవిలో మొక్కలను పెంచేందుకు కొన్ని సాధారణ చిట్కాల గురించి తెలుసుకుందాం..

ఒక అందమైన ఇంటికి ఆ ఇంటి ఆవరణలోని పచ్చని తోట మరింత అందంగా తీర్చిదిద్దుతుంది. ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు రకరకాల పువ్వు మొక్కలతో తోట ఉండాలని కోరుకుంటారు. అయితే ఈ పువ్వుల మొక్కలను పెంచడం కూడా ఒక ఆర్ట్. ముఖ్యంగా ఈ వేసవి కాలంలో తోటలో ఉన్న మొక్కలను నిర్వహించడం ఒక సవాలుతో కూడుకున్న పని. ఒక రోజు మొక్కలకు నీరు పోయకపోయినా, సరైన సంరక్షణ తీసుకోకపోయినా, మొక్క ఎండిపోతుంది. కనుక వేసవిలో పువ్వుల తోటలను తగినంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ చిట్కాలు ఏమిటంటే..
నీరు పుష్కలంగా పోయండి: ఈ వేసవిలో సూర్య కిరణాలు ప్రకాశవంతంగా ఉంటాయి. ఈ కాలంలో మొక్కలు వాడిపోవడానికి లేదా చనిపోవడానికి ప్రధాన కారణం వాటికి తగినంతగా నీరు పెట్టకపోవడమే. కనుక మొక్కలకు క్రమం తప్పకుండా నీరు పెట్టండి. ఎండ ఉష్ణోగ్రత నేలలోని తేమను ఆవిరి చేస్తాయి. కనుక ఉదయం సమయంలో మొక్కలకు నీరు పెట్టడం చాలా ముఖ్యం. అందువల్ల రోజుకు రెండుసార్లు మొక్కకు నీరు పెట్టడం వలన నీరు నేలలోకి చొచ్చుకుపోయి నేల తేమగా.. మొక్కను పచ్చగా.. ఉంచుతుంది.
ఎరువులు వాడకండి: ఎరువులు సాధారణంగా మొక్కల పెరుగుదలను ప్రేరేపిస్తాయనేది నిజం. అయితే ఈ వేసవిలో మొక్కలు ఎరువులను గ్రహించలేవు. మండే ఎండలో మొక్కలకు ఎరువులు వేస్తే అవి చనిపోతాయి. అంతేకాదు ఎరువులు మొక్కలపై అదనపు భారాన్ని మోపుతాయి. కనుక వేసవి కాలంలో వీలైనంత వరకు ద్రవ ఎరువులను ఉపయోగించకుండా ఉండడం మంచిది.
నేల సారాన్ని పెంచడంపై శ్రద్ధ వహించండి: వేసవి కాలం ప్రారంభం కావడంతో పూల తోట లేదా కూరగాయల తోట సంరక్షణపై శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. ఈ సమయంలో మొక్క మట్టిని వదులు అయ్యేలా చేయండి. ఇలా మట్టిని లూజుగా చేయడం వలన గాలి వేర్లకు చేరుకోవడానికి వీలు కల్పిస్తుంది. మొక్క నాటడానికి ముందే ప్రారంభంలోనే నేలకు సేంద్రియ ఎరువులు వేయాలి. ఇలా చేయడం వలన నేల సారవంతంగా అవుతుంది. మొక్కలకు అవసరమైన పోషకాలను పొందుతాయి. పచ్చదనంతో కళకళాడుతూ ఉంటాయి.
తీగ మొక్కలకు నీడ కల్పించండి: మండుతున్న ఎండని.. ఉష్ణోగ్రతను తట్టుకోవడానికి మొక్కలు, తీగలు చాలా కష్టపడతాయి. అందువల్ల మొక్కలను, తీగలను ఎండ తగిలే ప్రదేశంలో కాకుండా నీడ ఉన్న ప్రదేశంలో ఉంచండి. దీనివల్ల సూర్యకిరణాలు నేరుగా మొక్కలపై పడకుండా నిరోధించవచ్చు.
మొక్కలను కప్పి ఉంచండి: వేసవిలో ఎండ వేడి తీవ్రంగా ఉంటుంది. దీని వలన మొక్కలు ఎండిపోతాయి. మొక్కలకు ఎంత నీరు పోసినా నీరు త్వరగా ఆవిరైపోతుంది. కనుక మొక్కల మొదలు ఎండిన ఆకులు, పచ్చని ఆకులు, మొక్కల నుండి రాలిపోయిన పువ్వులు లేదా కొబ్బరి పీచుతో కప్పండి. ఈ విధంగా చేయడం వలన నేలలోని తేమ ఆవిరైపోదు. మొక్క పచ్చగా ఉంటుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..