Ganga Pushkaram 2023: అట్టహాసంగా ప్రారంభమైన గంగా పుష్కరాలు.. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు..
పవిత్ర గంగా పుష్కరాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. శనివారం నుంచి మే 3వ తేదీ వరకు 12 రోజులపాటు గంగా పుష్కరాలు జరగనున్నాయి. గంగానది ప్రవహించే ప్రతిచోటా కన్నుల పండుగగా ఉత్సవాలు సాగనున్నాయి. అయితే, గంగా పుష్కరాలు అంటే అందరికీ గుర్తొచ్చేది కాశీనే. భక్తులంతా కాశీ వెళ్లడానికే మొగ్గుచూపుతారు.
పవిత్ర గంగా పుష్కరాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. శనివారం నుంచి మే 3వ తేదీ వరకు 12 రోజులపాటు గంగా పుష్కరాలు జరగనున్నాయి. గంగానది ప్రవహించే ప్రతిచోటా కన్నుల పండుగగా ఉత్సవాలు సాగనున్నాయి. అయితే, గంగా పుష్కరాలు అంటే అందరికీ గుర్తొచ్చేది కాశీనే. భక్తులంతా కాశీ వెళ్లడానికే మొగ్గుచూపుతారు. ఇక్కడే త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నివసిస్తారని భక్తుల నమ్మకం. అంతేకాదు.. గంగానదిని అత్యంత పవిత్రంగా భావిస్తారు భారతీయులు.
గతించిన ఆత్మీయులకు గంగా జలాల్లో పిండప్రదానం చేస్తే ముక్తి లభిస్తుందని నమ్ముతారు. అందుకే.. గంగా పుష్కరాలు భారతీయులకు ఎంతో ప్రత్యేకం అని చెప్పొచ్చు. గంగా పుష్కరాల కోసం తెలుగు ప్రజలు కూడా వారణాసి, ప్రయాగ్ రాజ్, హరిద్వార్ వంటి పుణ్యక్షేత్రాలకు పెద్ద ఎత్తున తరలి వెళ్తుంటారు. అందుకే.. తెలుగు ప్రజల కోసం కాశీలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాట్లు చేశారు. ఈ నెల 29న వారణాసిలోని గంగా ఘాట్ దగ్గర జరిగే తెలుగు సంగమంలో ప్రధాని మోదీ పాల్గొనున్నారు.
భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు..
ఇక.. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో గంగా నది ప్రవహిస్తుండంతో ఆయా ప్రాంతాల్లో గంగా పుష్కరాలను వైభవంగా జరుపుకుంటారు. ఇప్పటికే.. గంగోత్రి, గంగాసాగర్, హరిద్వార్, బదిరీనాథ్, కేదారనాథ్, వారణాసి, అలహాబాద్ క్షేత్రాల్లో ఘాట్లు సిద్ధమయ్యాయి. సాధారణంగా కాశీలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం గంగా పుష్కరాలు కావడంతో మరింత మంది వచ్చే అవకాశం ఉంటుంది. గంగానది తీర ప్రాంతాలు.. పుణ్యస్నానాలు చేసే భక్తులతో నిండిపోనున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యం కలుగకుండా యోగి ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఎండాకాలం నేపథ్యంలో భక్తులు ఇబ్బంది పడకుండా దానికి తగ్గట్లుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు నిర్వాహకులు.
12 ముఖ్యమైన నదులన్నింటికీ పుష్కరాలు..
భారతీయ కాలమానం ప్రకారం పుష్కరం అంటే 12 సంవత్సరాలు. ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి భారతదేశంలోని 12 ముఖ్యమైన నదులన్నింటికీ ‘పుష్కరాలు’ వస్తాయి. పుష్కర సమయంలో ఆయానదుల్లో స్నానం చేస్తే ప్రత్యేక పుణ్యఫలం ప్రాప్తిస్తుందని భారతీయులు భావిస్తారు. బృహస్పతి ఆయా రాశులలో ప్రవేశించినప్పుడు ఆయానదికి పుష్కరాలు వస్తాయి. బృహస్పతి ఆ రాశిలో ఉన్నంతకాలం ఆ నది పుష్కరంలో ఉన్నట్టే. పుష్కరకాలం సాధారణంగా ఒక సంవత్సరం పాటు ఉంటుంది. అయితే.. పుష్కరకాలంలోని మొదటి పన్నెండు రోజులను ఆది పుష్కరం అని, చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరం అని వ్యవహరిస్తారు. ఈ మొదటి, చివరి పన్నెండు రోజులు మరింత ప్రత్యేకమైనవిగా భావిస్తారు.
ఏప్రిల్ 22, 29, మే 6 తేదీల్లో ప్రత్యేక రైళ్లు..
గంగా పురష్కరాల నేపథ్యంలో కాశీకి ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. సికింద్రాబాద్, ప్రయాగ్‌రాజ్, వారణాసి మీదుగా రక్సోల్ వరకు ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఏప్రిల్ 23, 30, మే 7 తేదీల్లో ఆయా మార్గంలో ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. తిరుపతి, ప్రయాగ్‌రాజ్, వారణాసి మీదుగా దానాపూర్ వరకు ఏప్రిల్ 22, 29, మే 6 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. అలాగే.. గుంటూరు, ప్రయాగరాజ్ మీదుగా బెనారస్ వరకు ఏప్రిల్ 22, 29, మే 6 తేదీల్లో ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. మొత్తంగా.. భారతీయ సాంస్కృతిక వైభవంలో యుగాలుగా తన ప్రత్యేకతను చాటుకున్న గంగానది 12రోజులపాటు పుష్కరశోభను సంతరించుకోనుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..