AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శివుని త్రిశూలం, విష్ణువు చక్రం.. దుర్గాదేవికి ఈ దివ్య ఆయుధాలు ఎవరు ఇచ్చారో తెలుసా?

Durga Devi Weapons: మహిషాసురుడిని సంహరించేందుకు దుర్గాదేవి అవతరించినప్పుడు దేవతలందరూ తమ దివ్య ఆయుధాలను అమ్మవారికి సమర్పించినట్లు దుర్గా సప్తశతి చెబుతుంది. శివుడి త్రిశూలం, విష్ణువు సుదర్శన చక్రం, ఇంద్రుడి వజ్రాయుధం సహా ఏ దేవుడు ఏ ఆయుధాన్ని ఇచ్చాడో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

శివుని త్రిశూలం, విష్ణువు చక్రం.. దుర్గాదేవికి ఈ దివ్య ఆయుధాలు ఎవరు ఇచ్చారో తెలుసా?
Durga Devi Aayudhalu
Rajashekher G
|

Updated on: Oct 08, 2026 | 3:44 PM

Share

Durga Devi Aayudhalu: హిందూ ధార్మిక గ్రంథాల్లో మహిషాసురుడిని అత్యంత శక్తివంతమైన రాక్షసుడిగా వర్ణిస్తారు. అతని దురాగతాలతో దేవతలు తీవ్రంగా కలవరపడ్డారు. దేవతలను ఓడించి వారి అధికారాన్ని సైతం మహిషాసురుడు స్వాధీనం చేసుకున్నాడు. దీంతో అతడిని సంహరించేందుకు దేవతలందరూ శివుడు, విష్ణువుతో సహా దైవిక శక్తులను ఆశ్రయించారు. దేవీ మహాత్మ్యం లేదా దుర్గా సప్తశతి ప్రకారం.. దేవతల ఆగ్రహం, తేజస్సు ఒకచోట చేరి అపారమైన దైవిక శక్తిగా మారింది. ఆ దివ్య శక్తి నుంచే దుర్గాదేవి అవతరించినట్లు పురాణ కథనం చెబుతుంది. అందువల్ల దుర్గాదేవిని ఒకే దేవతకు సంబంధించిన శక్తిగా కాకుండా.. సమస్త దేవతల తేజస్సుకు ప్రతిరూపంగా భావిస్తారు. అనంతరం దేవతలు తమ వద్ద ఉన్న దివ్య ఆయుధాలను అమ్మవారికి సమర్పించారు.

  1. శివుడి త్రిశూలం, విష్ణువు సుదర్శన చక్రం: శివుడు దుర్గాదేవికి త్రిశూలాన్ని, విష్ణువు సుదర్శన చక్రాన్ని అందించినట్లు దుర్గా సప్తశతిలో పేర్కొనబడింది. త్రిశూలం శివతత్వానికి, సుదర్శన చక్రం విష్ణు శక్తికి ప్రతీకలుగా భావిస్తారు.
  2. వరుణుడి శంఖం, అగ్ని దేవుడి శక్తి ఆయుధం: వరుణుడు అమ్మవారికి శంఖాన్ని సమర్పించగా, అగ్నిదేవుడు ‘శక్తి’ అనే ఆయుధాన్ని అందించాడు. శంఖం పవిత్రత, శుభత్వానికి ప్రతీకగా భావిస్తే.. అగ్ని ప్రసాదించిన ఆయుధం దైవిక తేజస్సు, యుద్ధ పరాక్రమాన్ని సూచిస్తుంది.
  3. వాయుదేవుడి విల్లు, బాణాలు: వాయుదేవుడు దుర్గాదేవికి ధనుస్సుతో పాటు రెండు అమ్ములపొదులను బాణాలతో సహా అందించినట్లు కథనం చెబుతుంది. ఇవి లక్ష్యసాధన, ఏకాగ్రతకు ప్రతీకలుగా భావించవచ్చు.
  4. ఇంద్రుడి వజ్రాయుధం, ఐరావత గంట: దేవేంద్రుడు తన శక్తివంతమైన వజ్రాయుధాన్ని అమ్మవారికి ఇచ్చాడు. అలాగే ఐరావత ఏనుగు నుంచి ఒక గంటను కూడా సమర్పించాడు. వజ్రం శక్తికి, గంట దుష్టశక్తులను తరిమికొట్టే దైవిక నాదానికి ప్రతీకగా భావిస్తారు.
  5. ఇవి కూడా చదవండి
  6. యమధర్మరాజు దండం: మృత్యుదేవుడైన యముడు తన దండాన్ని దుర్గాదేవికి అందించినట్లు దుర్గా సప్తశతి చెబుతుంది. ఇది అధర్మంపై శిక్ష, న్యాయం స్థాపనకు సంకేతంగా భావిస్తారు.
  7. బ్రహ్మదేవుడి కమండలం, జపమాల: బ్రహ్మదేవుడు కమండలం, స్ఫటిక జపమాలను అమ్మవారికి సమర్పించాడు. కమండలం పవిత్రతకు, జపమాల ఆధ్యాత్మిక సాధన, ధ్యానానికి ప్రతీకలుగా నిలుస్తాయి.
  8. కాలుడి ఖడ్గం, డాలు: కాలం దుర్గాదేవికి ప్రకాశవంతమైన ఖడ్గం, డాలును ఇచ్చినట్లు పురాణ కథనం చెబుతుంది. ఖడ్గం అజ్ఞానాన్ని ఛేదించే జ్ఞానానికి, డాలు రక్షణకు ప్రతీకగా భావిస్తారు.
  9. విశ్వకర్మ గొడ్డలి, కవచం: దేవశిల్పి విశ్వకర్మ అమ్మవారికి గొడ్డలితో పాటు వివిధ ఆయుధాలు, అభేద్యమైన కవచాన్ని అందించాడు. ఇవి శక్తి, రక్షణ, దుష్టశక్తులపై విజయానికి సంకేతాలు.
  10. హిమాలయాల సింహం: చివరగా హిమాలయాలు దుర్గాదేవికి సింహాన్ని వాహనంగా సమర్పించినట్లు దేవీ మహాత్మ్యంలో వర్ణన కనిపిస్తుంది. అందుకే ఆమెను ‘సింహవాహిని’ అని పిలుస్తారు. సింహం ధైర్యం, బలం, నిర్భయత్వానికి ప్రతీక.

ఈ విధంగా దుర్గాదేవి చేతిలో కనిపించే ప్రతి ఆయుధం వెనుక ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక భావన ఉందని భక్తులు విశ్వసిస్తారు. దేవతలందరి శక్తులు ఒకే రూపంలో ఏకమై.. అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి దుర్గాదేవి ప్రతిరూపంగా నిలుస్తుంది.

(Disclaimer: ఈ కథనం హిందూ ధార్మిక గ్రంథాలు, పురాణ సంప్రదాయాల్లోని విశ్వాసాల ఆధారంగా రూపొందించబడింది. ఆయుధాలకు సంబంధించిన ఆధ్యాత్మిక అర్థాలను భక్తి, సంప్రదాయ దృష్టితోనే చూడాలి.)

Follow Us