వెంకన్నకు అభిషేకం లేని ఆలయం.. ఎక్కడుందో తెలుసా..? విశిష్టత ఏంటంటే..

Andhra Pradesh: ఆలయానికి నాలుగు వైపులా నాలుగు ప్రధాన రాజగోపురాలు ఉన్నాయి. స్వామి వారి తూర్పు రాజగోపురం ఎదురుగా వివాహాలకు అనువుగా ఉండేందుకు విశాలమైన అనివేటి మండపాన్ని నిర్మించారు. నిత్యం స్వామి వారికి ఆలయంలో నిత్య కళ్యాణంతో పాటు, ఆర్జిత సేవలు నిర్వహిస్తారు. శనివారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శిస్తారు. అలాగే వచ్చిన భక్తుల సౌకర్యార్థం అధికారులు రెండు పూటలా ఉచిత అన్న ప్రసాద వితరణతో పాటు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచారు.

వెంకన్నకు అభిషేకం లేని ఆలయం.. ఎక్కడుందో తెలుసా..? విశిష్టత ఏంటంటే..
Dwaraka Tirumala Temple
Follow us
B Ravi Kumar

| Edited By: Jyothi Gadda

Updated on: Sep 19, 2023 | 10:29 AM

ఏలూరు,సెప్టెంబర్19: అభిషేక ప్రియుడైన ఆ దేవదేవునికి ఆ ఆలయంలో అభిషేకం జరగదు.. ఇప్పటికీ ఆలయ గర్భాలయంలో ఎర్రటి చీమలు తిరుగుతూ ఉంటాయి. ఆలయంలో ఇద్దరు ధ్రువ మూర్తులు కొలువైయున్నారు. దక్షిణ ముఖంగ స్వామి వారు భక్తులకు దర్శనమిస్తారు. అసలు ఆ చీమలు ఏంటి..? దక్షిణ ముఖంగానే స్వామి దర్శనమివ్వడానికి కారణమేంటి..? అభిషేక ప్రియుడికి అభిషేకం ఎందుకు జరపరు..? ఆ ఆలయం ఎక్కడ ఉంది..? ఇప్పుడు ఈ కథలో తెలుసుకుందాం.. రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన ద్వారకాతిరుమల శేషాచల కొండపై కొలువైన చిన వెంకన్న దివ్య క్షేత్రాన్ని నిత్యం వేలాది మంది భక్తులు దర్శిస్తారు. ద్వారకాతిరుమలను చిన తిరుపతి అని కూడా పిలుస్తారు. ఇక్కడ స్వామి వారు దక్షిణ ముఖంగా ఉండి ఇద్దరు ధ్రువమూర్తులుగా భక్తులకు దర్శనమిస్తారు.

ఆలయ విశిష్టత..

ఈ ఆలయానికి ఎంతో రాణ విశిష్టత ఉంది. ద్వారకా మహర్షి స్వామి వారి కోసం ఘోర తపస్సు ఆచరించారు. ఆయన తపస్సుకు మెచ్చిన స్వామివారు ప్రత్యక్షమై ఇక్కడ స్వయంభుగా వెలిశారు. అయితే ద్వారకా మహర్షి చాలాకాలం తపస్సు చేయడంతో ఆయన చుట్టూ పెద్ద ఎత్తున వల్మీకం (పుట్ట) ఏర్పడింది. స్వామివారు స్వయంభువుగా వెలసినప్పుడు నడుము నుండి సగభాగం ఆ వాల్మీకం ( పుట్ట) లోనే ఉండిపోయింది. దాంతో స్వామివారి పాద పూజకు వీలు లేకుండా పోయింది. విష్ణు సేవలో స్వామివారి పాదపూజే ప్రధానం కావడంతో పెద్ద తిరుపతి నుంచి మరో విగ్రహాన్ని తీసుకువచ్చి స్వయంభువు విగ్రహం వెనకన మరో మూర్తిని ప్రతిష్టించారు. అందుచేతనే ఇక్కడ గర్భాలయంలో ఇద్దరు ధ్రువమూర్తులు ఉంటారు. ఇక ద్వారకా మహర్షి ఉత్తర ముఖం వైపు కూర్చుని తపస్సు చేయడం కారణంగా స్వామివారు దక్షిణ ముఖంగా ప్రత్యక్షమై స్వయంభువుగా వెలిశారు. ఇక్కడ స్వామివారికి రెండుసార్లు కళ్యాణ మహోత్సవాలు నిర్వహిస్తారు. స్వయంభువుగా వెలసిన స్వామికి వైశాఖ మాసంలోనూ, ప్రతిష్టించిన స్వామికి ఆశ్వయుజ మాసంలోనూ కల్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.

గర్భాలయంలో ఎర్ర చీమలు..

వేంకటేశ్వరస్వామి అభిషేక ప్రియుడు.. కానీ ద్వారకా తిరుమల చిన వెంకన్నకు మాత్రం అభిషేకం జరగదు. స్వామివారు కొలువైన అంతరాలయంలో ఒక్క బొట్టు నీటి చుక్క పడిన ఆలయమంతట స్వామివారి విగ్రహాల క్రింద నుండి కొనిజులు అనే ఎర్ర చీమలు బయటికి వస్తాయి. అలా వచ్చిన ఎర్ర చీమలు స్వామివారి అంతరాలయ మంతట వ్యాపిస్తాయి. ఎందుకంటే స్వామి వారి స్వయంభువు మూర్తి సగభాగం ఇప్పటికీ వల్మీకం (పుట్ట)లోనే కప్పబడి ఉందని, ఏమాత్రం అక్కడ నీళ్లు ఒలికిన ఆ వల్మీకం లోంచి కొనిజులు అనే ఎర్ర చీమలు పెద్ద సంఖ్యలో బయటికి వస్తాయని, ఆ కారణం చేత ఇక్కడ ధ్రువమూర్తులకు అభిషేకం నిర్వహించరని అర్చకులు చెబుతున్నారు. అంతేకాక ఎవరైనా మైలుతో ఆలయంలోకి ప్రవేశించినప్పుడు ఎర్ర చీమలు బయటికి వస్తాయని అర్చకులు చెబుతున్నారు. స్వామివారు అలంకార ప్రియుడు గనుక ప్రతిరోజు ప్రత్యేక పూలతో స్వామిని అలంకరిస్తారు. అలా అలంకరణ చేసిన పూలలో అప్పుడప్పుడు ఎర్ర చీమలైన కోనిజులు కనిపిస్తాయి.

స్వామివారి మహత్యం..

శేషాచల కొండపై కొలువైన స్వామి వారు భక్తుల కోర్కేలు తీర్చే కొంగుబంగారంగా వెలసిలుతున్నారు. రాష్ట్ర నలుమూలనుంచే కాకుండా దేశ విదేశాలనుంచి సైతం భక్తులు స్వామివారి ఆలయానికి చేరుకుని, కేశఖండనశాలలో తలనీలాలు సమర్పించి తమ మొక్కుబడులను తీర్చుకుంటారు. పెద్ద తిరుపతిలో మొక్కు ఉండి వెళ్లడానికి వీలుపడని వారు ఆ మొక్కు చిన తిరుపతిలో తీర్చుకుంటే ఆ స్వామివారికి చేరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆలయానికి నాలుగు వైపులా నాలుగు ప్రధాన రాజగోపురాలు ఉన్నాయి. స్వామి వారి తూర్పు రాజగోపురం ఎదురుగా వివాహాలకు అనువుగా ఉండేందుకు విశాలమైన అనివేటి మండపాన్ని నిర్మించారు. నిత్యం స్వామి వారికి ఆలయంలో నిత్య కళ్యాణంతో పాటు, ఆర్జిత సేవలు నిర్వహిస్తారు. శనివారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శిస్తారు. అలాగే వచ్చిన భక్తుల సౌకర్యార్థం అధికారులు రెండు పూటలా ఉచిత అన్న ప్రసాద వితరణతో పాటు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..