సీఎం కేసీఆర్ సతీమణి శోభమ్మ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి బోనం, పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. శోభమ్మతోపాటు రాజ్యసభ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కూడా ఉన్నారు. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఆమె.. డిప్యూటీ స్పీకర్ పద్మారావు ఇంటికి వెళ్లారు.
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. తెల్లవారుజామునుంచే భక్తులు అమ్మవారిని దర్శించుకుని బోనాలు సమర్పించుకుంటున్నారు. మహంకాళి బోనాల ఉత్సవాలకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరై అమ్మవారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు అమ్మవారికి బోనం సమర్పించారు.
ఉజ్జయిని మహంకాళి బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే భక్తులు బారులు తీరి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. వీఐపీల తాకిడి కూడా పెరిగింది. మహిళా భక్తులు పెద్దసంఖ్యలో తరలి వస్తున్నారు. బోనాలతో క్యూలైన్‌లో నిల్చున్నారు.
అమ్మవారి దర్శనానికి గంటపైనే సమయం పడుతోంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులందరికీ మాస్కులు అందజేస్తున్నారు. కరోనా నేపథ్యంలో అన్ని నిబంధనలు పాటిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.