Chardham Yatra: కేదార్‌నాథ్‌కు పోటెత్తుతున్న భక్తులు.. గంటకు 1,800 మందికి పైగా భక్తుల దర్శనం.. ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం
ఛార్ ధామ్ యాత్రకు రోజు రోజుకీ భక్తులు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. కేదార్‌నాథ్, బద్రీనాథ్ క్షేత్రాల దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ధామ్‌లో ఆలయ కమిటీ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. భక్తులకు దర్శనం మరింత సులభతరం చేసేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు.
ఛార్ ధామ్ యాత్ర దర్శనానికి భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ తగిన కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తోంది. భక్తుల రద్దీని అనుసరించి గంటకు 1,800 మందికి పైగా భక్తులు కేదార్‌నాథ్‌ను దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే భక్తులు అర్ధరాత్రి 12 గంటల వరకు స్వామివారిని దర్శించుకునేలా అవకాశం కల్పించారు. మే 10న ప్రారంభమైన కేదార్‌నాథ్ యాత్ర.. మే నెల ముగిసేవరకూ కేవలం 20 రోజుల్లోనే 5, 54 , 671 మంది భక్తులు కేదార్‌నాథ్‌ను దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
చార్‌ధామ్ యాత్రకు ప్రభుత్వం ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభించిన నేపథ్యంలో జూన్ రెండవవారం నుంచి భక్తుల రద్దీ మరింతగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కేదార్‌నాథ్‌లో భక్తులకు దర్శనం మరింత సులభతరం చేసేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. రోజుకు 36 వేల మంది భక్తులకు దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు.
కేదారేశ్వరుని దర్శనం ఉదయం 4.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 3.30 వరకు కొనసాగుతుంది. 30నిమిషాల పాటు స్వామివారికి బాల భోగం సమర్పిస్తారు. ఆ సమయంలో ఆలయాన్ని కొద్దిసేపు మూసివేస్తారు. తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి మొదలై 7 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. అర్ధరాత్రి 12 గంటల వరకు నిర్వహించే సాయంత్రం హారతితో బాబా కేదార్ శృంగార దర్శనం ప్రారంభమవుతుంది. రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు భక్తుల పూజలు నిర్వహిస్తున్నారు. కేదార్‌నాథ్‌లో యాత్ర విజయవంతం భక్తులకు దర్శనం కల్పించడంలో ఆలయ అధికారులు, సిబ్బంది ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..